Share News

Meteorological Update : బలహీనపడిన వాయుగుండం

ABN , Publish Date - Dec 22 , 2024 | 04:53 AM

కోస్తాంధ్రను వణికించిన వాయుగుండం బలహీనపడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆ వాయుగుండం శనివారం ఉదయం...

Meteorological Update : బలహీనపడిన వాయుగుండం

  • సముద్రంలోనే బలహీనం.. వాతావరణ శాఖ వెల్లడి

  • నేడూ ప్రభావం.. వేటకు వెళ్ల్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక

  • రెండ్రోజుల వర్షాలతో ఉత్తరాంధ్ర రైతాంగానికి నష్టం

  • 24 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమకు మళ్లీ వర్షసూచన

విశాఖపట్నం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కోస్తాంధ్రను వణికించిన వాయుగుండం బలహీనపడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆ వాయుగుండం శనివారం ఉదయం నుంచి గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో తూర్పు ఈశాన్యంగా పయనిస్తూ శనివారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఆదివారం సాయంత్రానికి పూర్తిగా సముద్రంలోనే బలహీనపడుతుందని వాతావరణశాఖ తెలిపింది. అయితే దీని ప్రభావం ఆదివారం ఉదయం వరకూ ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర భారతంలో పడమర నుంచి తూర్పు దిశగా భూ ఉపరితలానికి 12.5 కి.మీ. ఎత్తులో గంటకు 150 నుంచి 175 కి.మీ. వేగంగా వీస్తున్న జెట్‌ స్ర్టీమ్‌ గాలులు, ఇంకా ఉత్తరాదిలో కొనసాగుతున్న వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌ ప్రభావంతో వాయుగుండం దిశ మార్చుకుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. వాయుగుండం ఆదివారం ఉదయం నుంచి పూర్తిగా బలహీనపడుతుందని వివరించారు. ఆదివారం వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. ఆదివారం కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Untitled-5 copy.jpg


ఉత్తరాంధ్ర రైతాంగానికి నష్టం

వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో శుక్రవారం, శనివారం పలుచోట్ల భారీవర్షాలు కురిశాయి. పినపెంకిలో 88.5, ఇచ్ఛాపురంలో 87.5, ఇద్దనవలసలో 84.75, బొండపల్లిలో 80.5, రాజపురంలో 80.5, బాతుపురంలో 79.25, జరజాపుపేట, గంభీరం, కాపులుప్పాడల్లో 77.5, గుర్ల, తెర్లాంలో 74.5, విశాఖపట్నం రూరల్‌లోని సర్వీస్‌ రిజర్వాయర్‌ వద్ద 73 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలకు అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వరి పనలు, కుప్పలు నీట మునిగాయి. కోతకు సిద్ధంగా ఉన్న చేలు నేలకొరిగాయి. కల్లాల్లో ధాన్యం తడిసిపోయాయి. దీంతో వేలాది మంది రైతులు నష్టపోయారు.

తూర్పుగాలులతో మళ్లీ వర్షాలు

బంగాళాఖాతంలో మంగళవారం నుంచి తూర్పుగాలులు బలంగా మారనున్నాయి. రెండు రోజులపాటు సముద్రం నుంచి తేమగాలులు తమిళనాడు, దానికి ఆనుకుని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల వైపుగా వీయనున్నాయి. ఈ ప్రభావంతో 24, 25 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Dec 22 , 2024 | 04:54 AM