Share News

Liquor Business : లిక్కర్‌ మార్కెట్‌లో ‘99’ హవా!

ABN , Publish Date - Dec 27 , 2024 | 03:42 AM

రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో క్వార్టర్‌ రూ.99 రకాల హవా పెరిగిపోతోంది. క్రమంగా లిక్కర్‌ మార్కెట్‌ను ఆక్రమిస్తోంది.

 Liquor Business : లిక్కర్‌ మార్కెట్‌లో ‘99’ హవా!

  • అమ్మకాల్లో 25% వాటా ఆ బ్రాండ్లదే

  • నెలకు 8 లక్షల కేసుల విక్రయం

  • తక్కువ ధరతో పెరిగిన డిమాండ్‌

  • ప్రభుత్వానికి తగ్గుతున్న ఆదాయం

  • అయినా హామీ మేరకు అమ్మకాలు

  • లైసెన్సీల మార్జిన్‌పైనా ప్రభావం

అమరావతి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో క్వార్టర్‌ రూ.99 రకాల హవా పెరిగిపోతోంది. క్రమంగా లిక్కర్‌ మార్కెట్‌ను ఆక్రమిస్తోంది. మొత్తం మద్యం అమ్మకాల్లో ‘99’ బ్రాండ్ల వాటానే 25 శాతానికి చేరడం గమనార్హం. దీంతో ఇతర బ్రాండ్లు కూడా రూ.99కు క్వార్టర్‌ మద్యాన్ని తయారు చేయాలని భావిస్తున్నాయి. మరోవైపు ఈ బ్రాండ్ల అమ్మకాలు భారీగా పెరగడంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోతోంది. అలాగే షాపుల లైసెన్సీల ఆదాయమూ తగ్గుతోంది. ఆదాయం తగ్గినా వినియోగదారుల నుంచి డిమాండ్‌ భారీగా ఉండటంతో వ్యాపారులు తప్పక వాటిని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసి అమ్ముతున్నారు.

పెరుగుతూ వస్తోన్న అమ్మకాల వాటా

రాష్ట్రంలో సగటున నెలకు 30 లక్షల కేసుల లిక్కర్‌ అమ్ముడవుతుంది. ఈ సంవత్సరం అక్టోబరు 16 నుంచి ప్రైవేటు మద్యం షాపుల పాలసీ అమల్లోకి రాగా.. ఆ నెలలో 15 రోజుల అమ్మకాల్లో 99 కేటగిరీ మద్యం 5.6 శాతంగా మాత్రమే ఉంది. ఉత్పత్తి తక్కువగా ఉండటంతో డిమాండ్‌ ఉన్నా అమ్మకాలు కనిపించలేదు. ఆ తర్వాత నవంబరులో 14.85 శాతానికి చేరింది. 4,55,086 కేసులను ఒక్క ఆ నెలలోనే విక్రయించారు. ఈ నెలలో 15వ తేదీ వరకు అమ్మకాలను పరిశీలిస్తే 19.95 శాతానికి పెరిగింది. ఇక ఈ నెలాఖరు వరకు చూస్తే ఆ వాటా 25 శాతానికి చేరినట్లు తెలిసింది. అంటే నెల మొత్తం రాష్ట్రంలో అమ్మే 30 లక్షల కేసుల్లో 99 బ్రాండ్ల మద్యమే దాదాపుగా 8 లక్షలు ఉంది. గతంలో చీప్‌ లిక్కర్‌ ఉన్నా అమ్మకాలు ఈ స్థాయిలో ఎప్పుడూ కనిపించలేదు. దీంతో రాబోయే రోజుల్లో 99 మద్యం అమ్మకాలు ఇంకా ఎక్కువ స్థాయికి చేరే అవకాశం ఉందని ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.


హామీ ప్రకారం అమల్లోకి..

గత వైసీపీ ప్రభుత్వం మద్యం ధరలను ఇష్టారాజ్యంగా పెంచింది. పేదలకు మద్యం అందుబాటులో లేకుండా ధరలు పెంచుతామన్న ఒక్క మాటను అడ్డుపెట్టుకుని వినియోగదారులను పీల్చి పిప్పి చేసింది. ఽనాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచిందా.. అంటే అదీ లేదు!! తమ పార్టీకి కమీషన్లు ఇచ్చే బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజలను అనారోగ్యం పాలు చేసింది. దీంతో తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని తక్కు వ ధరకు అందుబాటులోకి తెస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. చెప్పినట్లుగానే రూ.99కే క్వార్టర్‌ మద్యం పేరుతో జాతీయ కంపెనీల మద్యాన్ని ప్రవేశపెట్టింది. అయితే అంత తక్కువ ధరకు నాణ్యత ఉండదని మొదట్లో భావించారు. మిగిలిన మద్యం కంపెనీలు కూడా 99 బ్రాండ్ల అమ్మకాలు పెద్దగా ఉండవని భావించాయి. కానీ అనూహ్యంగా వాటి అమ్మకాలు పెరిగాయి.

ప్రభుత్వానికి ఆదాయంపై ప్రభావం

రూ.99 మద్యంతో అటు ప్రభుత్వానికి, ఇటు లైసెన్సీలకు ఆదాయం తగ్గుతోంది. ధర ఎక్కువ ఉన్న మద్యం అమ్మితే అందులో ప్రభుత్వానికి ఎక్కువ పన్నులు వస్తాయి. ఉదాహరణకు రూ.200 ధర ఉన్న సీసా అమ్మినప్పుడు ప్రభుత్వానికి రూ.170 ఆదాయం వస్తే.. రూ.99 సీసా అయితే అందులో సగమే వస్తుంది. మరోవైపు మార్జిన్‌ తక్కువగా ఉన్నా.. వినియోగదారుల నుంచి డిమాండ్‌ భారీగా రావడంతో లైసెన్సీలు వ్యాపారం కోసం వాటిపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. దీంతో 99 బ్రాండ్లు కావాలని ఎక్సైజ్‌ శాఖపై ఒత్తిడి పెరుగుతోంది. మొదట్లో రోజుకు 15 వేల కేసులు సరిపోతాయని అంచనా వేయగా.. ఇప్పుడు రోజుకు 25 వేల కేసులు అవసరం అవుతున్నాయి. అయితే ఆదాయం తగ్గినా ప్రజలకు తక్కువ ధరతో నాణ్యమైన మద్యం సరఫరా చేయాలనే హామీకి కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.

Updated Date - Dec 27 , 2024 | 03:43 AM