విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు
ABN , Publish Date - Nov 22 , 2024 | 04:31 AM
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తేలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, టీజీ భరత్ స్పష్టం చేశారు.
పవన్, అచ్చెన్న, భరత్ స్పష్టీకరణ
అమరావతి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తేలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, టీజీ భరత్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ అంశాన్ని త్రికరణ శుద్ధిగా ఆపి ఉంటే ఈ రోజు ఆ ప్రశ్నే వచ్చేదే కాదని శాసనమండలిలో వైసీపీ సభ్యులకు పవన్ కల్యాణ్ చురక వేశారు. గురువారం మండలిలో స్టీల్ ప్లాంట్ అంశంపై వాడివేడిగా చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, దువ్వాడ శ్రీనివాస్, పాలవలస విక్రాంత్ మాట్లాడారు. ప్రైవేటీకరణ కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ఉద్దేశమే లేదన్నారు. అయితే అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం లేదని శాసనమండలిలో తీర్మానం చేయాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. అసలు చేసే ప్రసక్తే లేనప్పుడు తీర్మానం ఎందుకని కూటమి సభ్యులు నిలదీశారు.
దీంతో మంత్రులు, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. వైసీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని, దానికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అలాంటప్పుడు తీర్మానం చేపట్టాల్సిన అవసరంలేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర మంత్రి కుమారస్వామి సైతం స్పష్టంగా ప్రకటించారన్నారు.
టాటాతో టై అప్ చేసుకుని వ్యాపారం అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉందన్నారు. కార్మిక సంఘాల నేతలు గత ప్రభుత్వంలో సీఎం జగన్ దగ్గరకు వెళితే భూములమ్మి అప్పులు తీర్చుకోమన్నారని చెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గతంలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని, అప్పటి ప్రధాని వాజపేయి వద్దకు చంద్రబాబు వెళ్లి 1200 కోట్లు గ్రాంట్‌గా తీసుకువచ్చి ఆపారన్నారు.
అమిత్‌షాను కోరా: పవన్ కల్యాణ్
ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ప్రకటన చేయాలని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు సూచించారు. దీంతో సభలో పవన్ మాట్లాడారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తేలేదని, ప్రైవేటీకరణ చేయవద్దని తాను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి కోరానని చెప్పారు. కాగా ప్లాంట్ భూములు వేలం వేసేందుకు ఇప్పటికే ప్రకటనలు జారీ చేశారని విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు.