Share News

Pawan Kalyan: ఆరోగ్యం సరిగా లేకపోయినా వచ్చా!

ABN , Publish Date - Sep 09 , 2024 | 09:41 PM

వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఏలేరు వరద పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు సోమవారం నాడు పిఠాపురం నియోజక వర్గంలో పర్యటించిన పవన్.. గొల్లప్రోలులోని వైఎస్సార్ కాలనీ ముంపు పరిస్థితిని తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు...

Pawan Kalyan: ఆరోగ్యం సరిగా లేకపోయినా వచ్చా!
Pawan Kalyan At Gollprolu

అమరావతి/కాకినాడ: వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఏలేరు వరద పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు సోమవారం నాడు పిఠాపురం నియోజక వర్గంలో పర్యటించిన పవన్.. గొల్లప్రోలులోని వైఎస్సార్ కాలనీ ముంపు పరిస్థితిని తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. బాధితుల కష్టాలు తెలుసుకుని చలించిపోయారు.. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్.. గత వైసీపీ (YSR Congress) ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.వైఎస్సార్ జగనన్న కాలనీల పేరుతో గత ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు బలైపోయారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులను మేం సరిదిద్దాల్సిన పరిస్థితి వచ్చింది. చినుకు పడితే చాలు మునిగిపోయే భూములను కాలనీల కోసం కొని, కనీస వసతులు కూడా కల్పించకుండా ప్రజలకు ఇచ్చింది. గత ప్రభుత్వం ఆ కాలనీలు పేరుతో కొన్న స్థలాల మార్కెట్ ధరకు, చెల్లించిన పరిహారానికి చాలా వ్యత్యాసం ఉందిఅని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.


ఎందుకీ కాలనీలు..?

సుద్దగడ్డ పూర్తిస్థాయిలో పొంగడంతో కాలనీకి వెళ్లే రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. దీంతో కాలనీ వాసులు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. పడవలో వెళ్లి బాధితులతో స్వయంగా మాట్లాడారు. ముంపులో ఉండిపోయిన వారి బాధలను తెలుసుకొని స్వయంగా ఇళ్లను పరిశీలించారు. వరదలో ఉండిపోయిన బాధితులకు తక్షణ సహాయం అందించేలా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, రెవెన్యూ, సివిల్ సప్లైస్, పంచాయతీరాజ్ అధికారులకు పలు సూచనలు చేశారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన జగనన్న కాలనీలో చినుకు పడితే వరద వచ్చే పరిస్థితి ఉందన్నారు. ‘నాలుగు అడుగుల లోతట్టు ప్రాంతంలో గొల్లప్రోలులో స్థలాలు ఇచ్చారు. మొత్తం 38 ఎకరాల్లో రెండు వేల మందికి స్థలాలు ఇచ్చారు. ఈ ప్రాంతం ముంపు ప్రాంతం అని తెలిసిన ఇక్కడ ఎకరా ధర రూ. 30 లక్షలు మించి లేకపోయినా, ఎకరాకు రూ. 60 లక్షల ప్రభుత్వ పరిహారం చెల్లించారు. పోనీ పట్టాలు ఇచ్చిన వారైనా ఇక్కడికి వచ్చారా..? అంటే అది లేదు. 10 శాతం మంది కూడా రాలేదు. ఇంతటి లోతట్టు ప్రాంతం అని తెలిసినా గత ప్రభుత్వం అవేమి పట్టించుకోకుండా ప్రజలను ముంచేసింది’ అని పవన్ విమర్శలు గుప్పించారు.


ఏలేరు పరిస్థితిపై నిరంతర సమీక్ష

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎప్పటికప్పుడు ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఈ నెల 1, 2 తేదీల్లోనే జిల్లా కలెక్టర్‌తో ప్రత్యేకంగా మాట్లాడి పరిస్థితిని సమీక్షించానన్న విషయాన్ని గుర్తు చేశారు. అపాయకరమైన పరిస్థితి ఏమీ లేదని ఆయన చెప్పారని.. అయితే అప్పటినుంచి నిరంతరం పడుతున్న వానలతో రిజర్వాయర్‌కు అన్ని వైపుల నుంచి వరద వచ్చిందన్నారు. దీంతో పరిస్థితిని సమీక్షించేందుకు ఆరోగ్యం సహకరించకున్నా స్వయంగా వచ్చానన్నారు.ఈ కాలనీలో పరిస్థితిని, ముంపు ప్రాంతాలను చూసిన తర్వాత కనీస సౌకర్యాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం ప్రజలను ఎంత మోసం చేసిందో అర్థమైంది. ఎక్కడా కాలనీల్లో సౌకర్యాలు కల్పించకుండా, కేవలం భూములు కొనడం మీదే ఎక్కువగా దృష్టిపెట్టారు. గత ప్రభుత్వం చేసిన తప్పులపై అప్పటి పాలకులు ప్రజలకు సమాధానం చెప్పాలి. సుద్దగడ్డ వాగు ముంపు సమస్యను పరిష్కరిస్తాము. దీనికి శాశ్వత పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. కాలనీకు కనీసం ఒక వంతెన నిర్మించి ఉంటే చాలామందికి అనువుగా ఉండేది. వరదల్లో కనీసం బయట ప్రాంతంతో సంబంధాలు తెగిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకుంటాను. ఏలేరు, సుద్దగడ్డ ముంపు నుంచి రైతాంగానికి, ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించాము అని పవన్ మీడియాకు వెల్లడించారు.


ముఖ్యమంత్రి నేతృత్వంలో..

అనుకోకుండా వచ్చిన బుడమేరు వరద వల్ల విజయవాడ కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. తుపాన్లు, ప్రకృతి విపత్తులు వచ్చిన సమయంలో అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలే మళ్లీ కోలుకోవడానికి కాస్త సమయం తీసుకుంటాయి. విపత్తు వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. అధికార యంత్రాంగం సమర్థంగా పనిచేసేలా ఆయన పూర్తిస్థాయిలో దృష్టి నిలిపారు. వరద బాధితులకు వెనువెంటనే సాయం అందే ఏర్పాట్లు జరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఈ విపత్తును సమర్థంగా, సమష్టిగా ఎదుర్కోగలిగాం. వరద తర్వాత కూడా బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. వరద బాధితులు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చర్యలు ఉంటాయిఅని పవన్ తెలిపారు.


హైడ్రా కంటే బలమైనదే కావాలి..

విజయవాడ బుడమేరు ఆక్రమణల విషయంలో హైడ్రా వంటి వ్యవస్థ కంటే బలమైన వ్యవస్థ తీసుకు రావాలి. తెలిసో, తెలియకో బుడమేరు లోపల నిర్మాణాలు చేసుకున్న వారితో కలిసి ఒకసారి కూర్చుని మాట్లాడితే మంచిది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. నదీ పరివాహక ప్రాంతాల్లో, వాగులు వంకలు ప్రవహించే ప్రాంతాల్లో ఉన్న అక్రమ నిర్మాణదారులను గుర్తించి మొదట వారితో చర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించేలా ఉంటే బాగుంటుంది. చాలామంది ఆక్రమణల ప్రాంతం అని తెలియక స్థలాలు కొనుక్కొని, ఇల్లు కట్టుకున్న వారు ఉన్నారు. అలాంటివారికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ప్రజల్లోనూ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేయకూడదు అన్న చైతన్యం రావాలి. గత ప్రభుత్వంలో పంచాయతీలకు ఎలాంటి నిధులు అందలేదు. ఇప్పుడు వరద కష్టంలో ఉన్న పంచాయతీలకు నా వంతు బాధ్యతగా సొంత నిధులతో విరాళం అందించాను. ఆ నిధులు కచ్చితంగా పంచాయతీల ప్రాథమిక అవసరాలకు సరిపోతాయని భావిస్తాను అని పవన్ అన్నారు. కాకినాడ పర్యటన ముగించుకున్న పవన్.. రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు.

Updated Date - Sep 09 , 2024 | 09:49 PM