Share News

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

ABN , Publish Date - Sep 10 , 2024 | 12:22 AM

వర్షాల సీజన్‌ కావడంతో విద్యార్థులకు అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ సూచించారు. సమనస మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

అమలాపురం రూరల్‌, సెప్టెంబరు 9: వర్షాల సీజన్‌ కావడంతో విద్యార్థులకు అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ సూచించారు. సమనస మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులు చదువుకునే తరగతి గదులు, నిద్రించే గదులు, మరుగుదొడ్లు, వంటశాల, తాగునీటి ప్లాంట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. టాయిలెట్ల వద్ద పరిశుభ్రత పాటించడంతో పాటు చెడు వాసన రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వైటీఎస్‌ రాజు విద్యార్థుల వివరాలతో పాటు పూర్తి సమాచారాన్ని కలెక్టర్‌కు అందించారు. తరగతి గదిలోని డిజిటల్‌ క్లాస్‌ బోర్డును పరిశీలించి విద్యార్థులకు సిలబస్‌ ఎంత వరకు పూర్తి అయిందని ప్రశ్నించారు. ప్రధానంగా పాఠశాల పరిసరాలతో పాటు విద్యార్థులు నిద్రించే గదులు, టాయిలెట్లు, వంటశాలల్లో పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున పాఠశాల ఆవరణలో నీరు చేరి దోమలు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరుగుదొడ్లు, స్నానాల గదులకు మరమ్మతులు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు వడ్డించే ఆహారం కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, మంచినీటి ప్లాంట్లను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ రక్షిత మంచినీరు అందించాలన్నారు. సకాలంలో సిలబస్‌ను పూర్తిచేసి ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్‌ సూచించారు.

Updated Date - Sep 10 , 2024 | 12:23 AM