డబ్బు కొట్టు సీటు పట్టు!
ABN , Publish Date - Sep 17 , 2024 | 01:17 AM
కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి మూడు నెలలు దాటింది. అయినా పోలీస్ శాఖలో బదిలీల పందేరం సా..గుతూనే ఉంది. డబ్బు కొట్టిన వాళ్లకే సీట్లు దక్కుతున్నాయనే వాదన పెద్ద ఎత్తున వినవస్తోంది. గతంలో పని చేసిన చోట పలు ఆరోపణలు ఎదుర్కొన్న వారు సైతం మళ్లీ అదే స్థానం దక్కించుకోవడం దానికి బలాన్ని చేకూరుస్తోంది. పైగా వైసీపీకి తమ వంతు సాయం చేసిన వాళ్లకూ మంచి పోస్టింగులే వచ్చాయి. వీఆర్, లూప్‌లైన్లలో ఏళ్ల తరబడి చేసిన వా
కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి మూడు నెలలు దాటింది. అయినా పోలీస్ శాఖలో బదిలీల పందేరం సా..గుతూనే ఉంది. డబ్బు కొట్టిన వాళ్లకే సీట్లు దక్కుతున్నాయనే వాదన పెద్ద ఎత్తున వినవస్తోంది. గతంలో పని చేసిన చోట పలు ఆరోపణలు ఎదుర్కొన్న వారు సైతం మళ్లీ అదే స్థానం దక్కించుకోవడం దానికి బలాన్ని చేకూరుస్తోంది. పైగా వైసీపీకి తమ వంతు సాయం చేసిన వాళ్లకూ మంచి పోస్టింగులే వచ్చాయి. వీఆర్, లూప్‌లైన్లలో ఏళ్ల తరబడి చేసిన వాళ్లకు అసలు లా అండ్ ఆర్డర్ విభాగంలో పోస్టింగులు దక్కడం లేదనే చర్చ ఆ శాఖ వర్గాల్లో నడుస్తోంది. కూటమి వచ్చిన తర్వాత తమకు అవకాశం దక్కుతుందని ఆశగా ఎదురు చూసిన వారికి నిరాశే మిగులుతోంది. ఈ పరిస్థితుల్లో పోలీసు బదిలీల్లో ఏంటీ గందరగోళం? అసలు ప్రభుత్వానికి ఈ తంతు తెలుస్తోందా? అనే మీమాంశ నెలకొంది. డబ్బులిచ్చి పోస్టింగ్ తెచ్చుకున్న వాళ్లు సాంపాదనకు మొగ్గు చూపకుండా పేదోళ్ల పక్షాన ఉంటారా? అనే ప్రశ్న జనుల నుంచి గట్టిగా వినబడుతోంది.
పోలీసు శాఖలో బదిలీల పందేరం 8 ఆరోపణలున్నా కోరుకున్న చోటికే
జిల్లా బాస్ ఒప్పుకోక తప్పని పరిస్థితి 8 వీఆర్, లూప్‌ల వాళ్లకు దక్కని అవకాశం
అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీల సీట్లు ఖాళీ 8 ఇంకా పూర్తిగా భర్తీకాని సీఐ స్థానాలు
అధికార కూటమిలో.. అనధికార వైసీపీ హవా
సీఎం చంద్రబాబు సమీక్షించాలని వేడుకోలు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
వైసీపీ ప్రభుత్వం పోలీసులను ఎంత దారుణంగా సొంత పనులకు వాడు కుందో ప్రజలకు తెలిసిందే. అప్పుడు రూల్ ప్రకారం నడుచుకున్న వాళ్లంతా కూటమి ప్రభుత్వం వచ్చాక కాస్త సాంత్వన చెందారు. తమకు ప్రాధాన్యం ఇస్తారని అనుకొన్నారు. కానీ వాస్తవం భిన్నంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీస్ వ్యవస్థలో సమూల ప్రక్షాళన చేపట్టింది. దీనిలో భాగంగా నిజాయితీ అధికారిగా పేరున్న సీహెచ్ ద్వారకాతిరుమలరావును ఏరికోరి రాష్ట్ర పోలీస్ బాస్‌గా నియమించింది. తర్వాత బదిలీల తంతు మొదలైంది. ముందుగా రాష్ట్ర స్థాయిలో బదిలీలు చేపట్టారు. తర్వాత జిల్లా అధికారుల వంతు వచ్చింది. ఈ ‘తతంగం’ అంతా పైస్థాయిలో జరగడంతో కొందరు వైసీపీ మనుషులు కూడా సందట్లో సడేమియాగా మంచి స్థానాలు దక్కిం చుకున్నారనే విమర్శలు ఉన్నాయి. తర్వాత సీఐలు, ఎస్‌ఐల బదిలీలు చేప ట్టారు. వీరిని బదిలీ చేసే అధికారం రేంజ్ డీఐజీకి ఉంటుంది. ప్రస్తుతం ఏలూరు రేంజ్ ఐజీగా అశోక్‌కుమార్ ఉన్నారు. ఆయనకు మంచి అధికారిగా పేరుంది. ఈనేపథ్యంలో బదిలీల్లో చేతులు మారుతున్న రొక్కం ఎవరి జేబు ల్లోకి వెళుతోందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జిల్లాలోని ఇటీవల జాయిన్ అయిన ఓ సీఐకి కీలకమైన స్టేషను ఇవ్వడానికి నిజాయితీ గల జిల్లా ఉన్న తాధికారి నిరాకరించారని సమాచారం. అయితే ఓ ప్రజాప్రతినిధి ‘పై స్థాయిలో’ తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో ఆ ఉన్నతాధికారి మెత్తబడక తప్ప లేదని చెబుతున్నారు. ప్రజలను గత వైసీపీ పాలకుల దాష్టీకాల నుంచి బయటకు తీసుకొచ్చి సుపరిపాలన అందించాలని కూటమి పెద్దలు శ్రమి స్తుంటే కింది స్థాయిలో.. అదీ రోజూ ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండే ఇలాంటి పోస్టులు డబ్బుకు దాసోహం కావడంపై తీవ్రస్థాయిలో విమర్శలు ఉన్నాయి. దీంతో పోలీసు శాఖలోని పోస్టింగులను సీఎం లేదా డిప్యూటీ సీఎం స్థాయిలో పునఃసమీక్షించాలనే చర్చ నడుస్తోంది. లేదంటే పోలీస్ బది లీలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే అవకాశం ఉందనే వాదన వినవస్తోంది.
ఇదీ తంతు..
జిల్లాలో 25 పోలీస్ స్టేషన్లుండగా వివిధ విభాగాలతో కలిపి 29 మంది సీఐలను జిల్లాకు కేటాయించారు. రాజానగరం, నల్లజర్ల, కొవ్వూరు టౌన్, రాజమహేంద్రవ రంలోని వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, ప్రకాశంనగర్, రూరల్‌లోని బొమ్మూరు స్టేషన్లకు సీఐలు ఎస్‌హెచ్‌వోలుగా ఉన్నారు. మిగతా పోలీస్ స్టేషన్లలో ఎస్‌ఐలు ఎస్‌హెచ్‌వోలుగా ఉన్నారు. జిల్లాలో కొవ్వూరు రూరల్, కోరుకొండ, దేవరాపల్లి, అన పర్తి, నిడదవోలు సర్కిళ్లు ఉన్నాయి. అయితే వీటిలో చాలా స్టేషన్లలో ‘ట్రై’ చేసుకున్న వాళ్లే ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికీ వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ క్రైం స్టేషన్లకు సీఐలు లేరు. ఈ మూడింటికీ వీఆర్‌లో ఉన్న ఒక సీఐ ‘అందాక’ బాధ్యతలు నిర్వ ర్తిస్తున్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల జాబితాలో ముందుండే దేవరాపల్లి స్టేషనుకు రెగ్యులర్ సీఐ లేరు. ఈ స్టేషను బాధ్యతనూ వీఆర్‌లో ఉన్న సీఐ తాత్కాలికంగా చూస్తున్నారు. అసలే జిల్లా కేంద్రంలో అస్తవ్యస్తమైన ట్రాఫిక్‌ని దారిలో పెట్టడం ఎవరి తరమూ కావడం లేదు. దీనికితోడు ఇప్పుడు ట్రాఫిక్ సీఐ కూడా లేరు. సాధా రణంగా గతంలో పనిచేసిన స్టేషనులో ఆరోపణలు ఉంటే మళ్లీ అదే స్టేషనులో పోస్టింగు రావడం అత్యంత కష్టమని చెబుతారు. కానీ ఇప్పుడు ఆ పని ‘సొమ్ము’తో సులభంగా జరిగిపోతోందనే ఆరోపణలు ఉన్నాయి. తీవ్రమైన ఆరోపణల వల్ల ఎన్ని కల కౌంటింగ్‌కి రెండు రోజుల ముందు కొవ్వూరు డీఎస్పీ, అదే కార్యాలయంలో తిష్ఠ వేసిన ఏఎస్‌ఐపై కఠిన చర్యలు తీసుకొన్నారు. డీఎస్పీకి ఉన్నతాధికారులు ఉద్వాసన పలికారు. ఎక్కడా పోస్టింగు ఇవ్వకుండా డీజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఏఎస్‌ఐని దేవరపల్లి బదిలీచేశారు. కానీ కొవ్వూరు వీడడం సుతరా మూ ఇష్టం లేని ఆ ఉద్యోగి మళ్లీ ఇప్పుడు కొవ్వూరు టౌన్ పీఎస్‌కి బదిలీ చేయించుకొన్నారు. బదిలీల గోల్‌మాల్‌కి ఇదో ఉదాహరణని ఆ శాఖలో అంతర్గతంగా గుసగుసలు వినవస్తున్నాయి. దీంతో విధి నిర్వహణలో చావును అంగుళం దూరంలో చూసి, ధైర్యసాహసాలకు రాష్ట్రపతి మెడల్స్ సంపాదించిన వారు, ఏళ్ల తరబడి జిల్లా పోలీసు కార్యాలయంలో.. ఇతర లూప్‌లైనులో మగ్గిపోతున్నవారు ఖర్చు పెట్టుకోలేక స్టేషన్లను అందుకోలేకపోవడం నిజాయితీని ప్రశ్నిస్తోంది. వైసీపీకి కొమ్ముకాసిన వారికి మంచి పోస్టింగులు రావడంతో వైసీపీ హవానే కొనసాగే ప్రమాదం ఉందని, అందువల్ల బదిలీలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించి సమీక్షించాలనే డిమాండ్లు వినవస్తున్నాయి. కూటమి ప్రజాప్రతిని ధులకు ఈ పోస్టింగుల్లో మతలబులు ఎందుకు తెలియడం లేదనే అనుమానం కూడా నడుస్తోంది.
అయోమయంలో కింది సిబ్బంది
తమకు బదిలీలు ఎప్పుడా అని కానిస్టేబుల్ నుంచి ఏఎస్‌ఐ కేడర్ వరకూ ఎదురు చూస్తు న్నారు. జిల్లాలో 900 మంది ఆ స్థాయి సిబ్బంది ఉండగా.. వారిలో ఐదేళ్లు దాటిన వారు సుమారు 200 మంది ఉండొచ్చు. వారి బదిలీలను ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. ప్రస్తుతం పిల్లలకు స్కూలు ఫీజులు కట్టేయడం, తరగతులు ప్రారం భంకావడంతో కౌన్సెలింగ్ చేసి దూరాభారం కాకుండా సహేతుకంగా బదిలీలు చేయాలని కోరుకుంటున్నారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొం టున్న వారి విషయంలో కఠినంగా ప్రవర్తించా లని విన్నవిస్తున్నారు. జగదీశ్ ఎస్పీగా ఉన్నప్పు డు 120 మందితో బదిలీల జాబితా సిద్ధమైంది. తర్వాత ప్రభుత్వం మారాక, డీజీపీగా ద్వారకా తిరుమలరావు పగ్గాలు చేపట్టిన తర్వాత వాటిని ఆపాలని ఉత్తర్వులు రావడంతో బదిలీల్లేవు.
ఎక్సైజ్ వంతు
సెబ్‌ని రద్దు చేసే ప్రక్రియలో ఉండడం, కొత్త మద్యం పాలసీపై సమావేశాల వల్ల ఎక్సైజ్ బదిలీల్లో కొంత జాప్యం జరిగింది. సెబ్‌ని రద్దు చేయడం వల్ల మాతృశాఖ అయిన ఎక్సైజ్‌కి జిల్లాలో 80 మంది వెనక్కి వచ్చారు. ఎక్సైజ్‌లో పూర్తి స్థాయిలో బదిలీలు జరగాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇప్పుడు ఆ శాఖ అధికారులు, సిబ్బంది ‘దారు’ల వెతుకులాటలో పడ్డారు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారని తెలు స్తోంది. పోలీసు శాఖలోని తమకు పరిచయం ఉన్నవారు, స్నేహితుల నుంచి ‘రేటు’ ఎంతో సేకరించి ఆ దిశగా వెళుతున్నారని సమాచారం.