పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
ABN , Publish Date - Sep 01 , 2024 | 11:27 PM
ఇరవై ఏళ్ల క్రితం ఇదే రోజున కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము అమలులోకి వచ్చిందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లంకలపల్లి సాయిశ్రీనివాస్ పేర్కొన్నారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏటా సెప్టెంబరు 1న పెన్షన్ విద్రోహ దినంగా నిర్వహిస్తారని తెలిపారు.
అమలాపురం టౌన్, సెప్టెంబరు 1: ఇరవై ఏళ్ల క్రితం ఇదే రోజున కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము అమలులోకి వచ్చిందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లంకలపల్లి సాయిశ్రీనివాస్ పేర్కొన్నారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏటా సెప్టెంబరు 1న పెన్షన్ విద్రోహ దినంగా నిర్వహిస్తారని తెలిపారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు ఎస్టీయూ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను అమలులోకి తీసుకువస్తామని అధికారంలోకి వచ్చి మాట తప్పి మడమ తిప్పడంతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు అలుపెరగని పోరాటం చేశామని వివరించారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో ఆదివారం జిల్లాశాఖ అధ్యక్షుడు పోతంశెట్టి దొరబాబు, ప్రధాన కార్యదర్శి సరిదే సత్యపల్లంరాజు ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దుచేసి మెరుగైన పెన్షన్ స్కీమును అమలులోకి తీసుకువస్తామని ప్రకటించిందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం యునైటెడ్ పెన్షన్ స్కీమును ప్రకటించి అన్ని రాష్ట్రాల్లోను అమలుచేసే విధంగా ముందుకు వెళుతుందన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు ఏ విధమైన కంట్రిబ్యూషన్ చెల్లించకుండా పాత విధానంలోనే పాత పెన్షన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో జిల్లా ఆర్థిక కార్యదర్శి నేరేడుమిల్లి సత్యనారాయణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు నాగిరెడ్డి శివప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్ రాంబాబు, బోనం గంగాధర్, సీపీఎస్ జిల్లా కన్వీనర్ బి.నారాయణ, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు నల్లా రామకృష్ణ, తోట బాలకృష్ణ, జిల్లా అదనపు కార్యదర్శులు జనుపల్లి భీమారావు, బీవీవీ సత్యనారాయణ, వెంకటేశ్వరరాజు, కె.రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బకాయిలు విడుదల చేయాలి..
గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, పదవీ విరమణ బెనిఫిట్ బకాయిలను విడుదల చేయలేదని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లంకలపల్లి సాయిశ్రీనివాస్ పేర్కొన్నారు. తక్షణం ఆర్థిక బకాయిల చెల్లింపు కోసం రూ.15వేల కోట్లు విడుదల చేయాలని ఆయన డిమాండు చేశారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన 117 జీవోను తక్షణం రద్దు చేయాలని డిమాండు చేశారు. ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలల్లో తిరిగి కలిపి ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో తెలుగు మీడియంను కొనసాగించాలన్నారు. సీబీఎస్‌ఈ విధానంలో కాకుండా గతంలో మాదిరిగా రాష్ట్రస్థాయిలోనే పరీక్షా విధానం నిర్వహించాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.