Share News

అర్బన్‌ సొసైటీ ఎన్నికల్లో కూటమి విజయం

ABN , Publish Date - Oct 07 , 2024 | 12:33 AM

పిఠాపురం, అక్టోబరు 6: పిఠాపురం అర్బన్‌ క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ (పూర్వ పిఠాపురం అర్బన్‌ బ్యాంకు) ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. కూటమి పా

అర్బన్‌ సొసైటీ ఎన్నికల్లో కూటమి విజయం
జనసేన ఇన్‌చార్జి మర్రెడ్డిని కలిసిన రాంబాబు

నాలుగు స్థానాల్లో కూటమి, ఒక స్థానంలో ఇండిపెండెంట్‌ గెలుపు

మర్రెడ్డి, పెండెంలను కలిసిన 1వ వార్డు డైరెక్టర్‌ రాంబాబు

పిఠాపురం, అక్టోబరు 6: పిఠాపురం అర్బన్‌ క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ (పూర్వ పిఠాపురం అర్బన్‌ బ్యాంకు) ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. కూటమి పార్టీల తరపున నలుగురు అభ్యర్థులు విజయం సాధించగా, ఒక స్థానంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి గెలుపొందారు. ఎన్నికల్లో 5 డైరెక్టరు పదవులకు 12మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. ఆదివారం పోలింగ్‌ జరిగింది. సొసైటీలో 2011మంది ఓటర్లు ఉండగా 981మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 48.78శాతం పోలింగ్‌ నమోదైంది. అనంతరం ఓట్ల లెక్కింపును చేపట్టి విజేతల వివరాలను ఎన్నికల అధికారి దుర్గాప్రసాద్‌ ప్రకటించారు. 1వ వార్డు నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పూర్వ చైర్మన్‌ బాలిపల్లి రామచంద్రకుమార్‌ (రాంబాబు) 51ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా, కూటమి మద్దతుతో పోటీ చేసిన 2వ వార్డు అభ్యర్థి చెల్లుబోయిన ప్రమీల 41ఓట్లు, 3వవార్డు అభ్యర్థి అద్దంకి వెంకటరమణ 101ఓట్లు, 4వ వార్డు అభ్యర్థి అరిగెల ప్రసాద్‌ 156ఓట్లు, మేళం రామకృష్ణ 104ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ఒకరికి భంగపాటు

టీడీపీ, జనసేన పార్టీల మద్దతుదారులు ఎన్నికల్లో నిలిచినా ఇరుపార్టీల అధినేతల సూచనల మేరకు కూటమి తరపున ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో 1,3 వార్డుల నుంచి టీడీపీ బలపరచిన అభ్యర్థులు, 2,4,5 వార్డులు నుంచి జనసేన బలపరిచిన అభ్యర్థులు పోటీలో నిలవగా ఒకటవ వార్డు అభ్యర్థి మాత్రం ఇండిపెండెంట్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం జనసేనకు చైర్మన్‌ పదవి, టీడీపీకి వైస్‌చైర్మన్‌ పదవి దక్కుతుంది. 1,2 వార్డుల్లో మాత్రం హోరాహోరీ పోరు సాగగా, 3,4,5 వార్డుల్లో ఎన్నిక ఏకపక్షంగా జరిగింది. 1వ వార్డు నుంచి డైరెక్టరుగా విజయం సాధించిన బాలిపల్లి రామచంద్రకుమార్‌(రాంబాబు) ఆదివారం రాత్రి పిఠాపురం జగసేన ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబులను కలిశారు. కాగా కూటమి అభ్యర్థి ఓటమికి కారణమైన రాంబాబును జనసేన నేతలు కలవడంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనసేన సంబరాలు

అర్బన్‌ సొసైటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో పిఠాపురంలో జనసేన నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. విజయం సాధించిన కూటమి అభ్యర్థులతో కలిసి నేతలు కోటగుమ్మం సెంటర్‌ నుంచి ఉప్పాడ సెం టర్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావుల హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీలు ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం సొసైటీని అభివృద్ధి పథంలో పయనింపచేసి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. కూటమి పట్ల నమ్మకం ఉంచి గెలిపించిన సొసైటీ సభ్యులకు, విజయానికి కృషి చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కు అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. జనసైనికులు ఉన్నారు.

Updated Date - Oct 07 , 2024 | 12:33 AM