ఇసుక దొంగలు
ABN , Publish Date - Aug 29 , 2024 | 12:32 AM
రామచంద్రపురం మండలం వెల్లసావరం జగనన్నకాలనీలో ఇసుక దొంగలు పడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 వేల టన్నుల ఇసుకను రాత్రికి రాత్రే తరలించేశారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు తోడు దొంగలుగా మారి ఈ బాగోతాన్ని నడిపించారు.హౌసింగ్ ఏఈ కేవీ భాస్కర్ ఫిర్యాదుతో వారిపై ద్రాక్షారామ పోలీసులు కేసులు నమోదు చేశారు.
ద్రాక్షారామ, ఆగస్టు 28: రామచంద్రపురం మండలం వెల్లసావరం జగనన్నకాలనీలో ఇసుక దొంగలు పడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 వేల టన్నుల ఇసుకను రాత్రికి రాత్రే తరలించేశారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు తోడు దొంగలుగా మారి ఈ బాగోతాన్ని నడిపించారు.హౌసింగ్ ఏఈ కేవీ భాస్కర్ ఫిర్యాదుతో వారిపై ద్రాక్షారామ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇసుక దొంగతనానికి సంబంధించి సీఐ కడియాల అశోక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెల్ల సావరం జగనన్న లేఅవుట్ 4లో జగనన్న గృహనిర్మాణ లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు గృహ నిర్మాణశాఖ అధికారులు 6245 టన్నుల ఇసుకను నిల్వచేశారు.
అందులో 3 వేల టన్నులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ నెల 27 ఉదయం ప్రతీరోజు ఇసుక తనిఖీలో భాగంగా అధికారులు వెళ్లి చూడగా ఇసుక దొంగతనం జరిగినట్లు గుర్తించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించగా తాళ్లపొలంలో రైల్వేట్రాక్ వద్ద స్థలంలో ఆ ఇసుక డంప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అక్కడ డంప్ చేసిన ఇసుకను ఆ తర్వాత మాయం చేశారు. అక్కడ జేసీబీ వద్ద కట్టాపండు అనే వ్యక్తి ఉన్నాడు. దీంతో అతనిని గట్టిగా అడగగా జేసీబీ తనదేనని చెప్పి మొత్తం ఇసుక తరలింపు వివరాలు చెప్పినట్లు హౌసింగ్ ఏఈ భాస్కర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 26 రాత్రి 11 గంటలకు 3 వేల టన్నుల ఇసుకను కట్టా అశోక్ అలియాస్ పండు, కాండ్రేగుల సాయిరామ్, ఆదిమూలం సాయిమణికంఠ, వాసంశెట్టి చంద్రశేఖర్ అలియాస్ బాల జేసీబీతో లారీల్లో తరలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏఈ ఫిర్యాదు మేరకు ద్రాక్షారామ ఎస్ఐ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్ తెలిపారు.