Mummidivaram: పాము రాళ్ల పేరుతో రైతులను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు..
ABN , Publish Date - Dec 20 , 2024 | 06:27 PM
కోమసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రులో పాము రాళ్ల పేరుతో ఇద్దరు వ్యక్తులు స్థానికులను మోసం చేశారు. తమ వద్ద ఉన్న రాళ్లు కొనుగోలు చేస్తే విష సర్పాలు దరిచేరవని చెప్పారు. తేళ్లు, జర్రిలు కుట్టిన చోట ఆ రాళ్లు పెడితే బాధ నుంచి ఉపశమనం కలుగుతుందని మాయమాటలు చెప్పారు.
కోనసీమ: విషసర్పాలు కారణంగా ప్రతి ఏటా ఎంతో మంది రైతులు, సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పనుల నిమిత్తం చేలకు వెళ్లి పాము కాటుకు గురై వేల మంది అన్నదాతలు బలైపోతున్నారు. అలాగే ఇళ్లలోకి సైతం విష సర్పాలు వచ్చి ప్రజలను చంపేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రజల భయాన్ని క్యాష్ చేసుకోవాలని చూసిన కొంతమంది కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీశారు. ముమ్మిడివరంలో పాము రాళ్లు అంటూ ఇద్దరు మోసగాళ్లు ప్రజలను బురిడీ కొట్టించారు. పాము తల నుంచి తీసిన రాళ్లు దగ్గరుంటే విష సర్పాలు దరిచేరవని జోరుగా ప్రచారం చేశారు. అమాయకుల ప్రజల నుంచి వేల రూపాయలు స్వాహా చేశారు.
ఐ.పోలవరం మండలం కేశనకుర్రులో పాము రాళ్ల పేరుతో ఇద్దరు వ్యక్తులు స్థానికులను మోసం చేశారు. తమ వద్ద ఉన్న రాళ్లు కొనుగోలు చేస్తే విష సర్పాలు దరిచేరవని చెప్పారు. తేళ్లు, జర్రిలు కుట్టిన చోట ఆ రాళ్లు పెడితే బాధ నుంచి ఉపశమనం కలుగుతుందని మాయమాటలు చెప్పారు. రైతులు, స్థానికుల ఎదుటే పాములు పట్టినట్లు నటించిన కేటుకాళ్లు.. వాటి తలల నుంచి రాళ్లు తీశారు. దీంతో స్థానికులు, రైతులు సైతం వారి మాటలు నమ్మారు. వాటిని కొనుగోలు చేసి దగ్గర ఉంచుకున్న వారిని ఎలాంటి పాము ఏమీ చేయదని బురిడీ కొట్టించారు. ఆడపాము తలలో నాలుగు, మగ పాము తలలో రెండు రాళ్లు మాత్రమే ఉంటాయని చెప్పారు. దీంతో రైతులు, స్థానికులు పెద్దఎత్తున వాటిని కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక్కో రాయిని ఏకంగా రూ.500 నుంచి రూ.1000 వరకూ విక్రయించారు.
అయితే ఇదంతా మోసమేనని స్నేక్ క్యాచర్ గణేశ్ వర్మ చెప్తున్నారు. అసలు పాము తలలో ఎటువంటి రాళ్లూ ఉండవని ఆయన అంటున్నారు. రైతులను మోసం చేసి డబ్బులు దండుకునేందుకే ఇలాంటి మోసాలకు తెర తీస్తున్నారని వర్మ చెప్పారు. మాయమాటలు నమ్మి ఎవరూ వాటిని కొనుగోలు చేయెుద్దని తెలిపారు. విష సర్పాలు లేదా తేళ్లు, జెర్రిలు కుడితే రాళ్లను గాయం వద్ద ఆ రాళ్లు పెట్టి సమయం వృథా చేయవద్దని హెచ్చరించారు. ఏవైనా విష సర్పాలు కరిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యుల వద్ద చికిత్స తీసుకోవాలని గణేశ్ వర్మ చెబుతున్నారు.