KA Paul - Babu Mohan: పోటీ చేయబోయే స్థానాన్ని ప్రకటించిన కేఏ పాల్.. బాబు మోహన్ ఎక్కడి నుంచంటే?
ABN , Publish Date - Mar 29 , 2024 | 07:18 PM
ఈ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా బరిలో దిగుతున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. అయితే తనను ఓడించడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కలిశాయని ఆయన ఆరోపించారు.
విశాఖపట్నం, మార్చి 29: లోక్‌సభ ఎన్నికలు-2024లో విశాఖపట్నం ఎంపీగా బరిలో దిగుతున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు (praja shanthi party) కేఏ పాల్ (Ka paul) ప్రకటించారు. బాబు మోహన్ (Babu Mohan) వరంగల్ లోక్‌సభ నుంచి పోటీ చేస్తారని ఆయన చెప్పారు. తనను ఓడించడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కలిశాయని కేఏ పాల్ ఆరోపించారు. ప్రజా సేవ కోసమే ప్రజాశాంతి పార్టీ స్థాపించానని అన్నారు. శుక్రవారం విశాఖపట్నంలో బాబు మోహన్‌తో కలిసి కేఏ పాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్బంగా బాబు మోహన్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో వరంగల్ నుంచి ప్రజా శాంతి పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవబోతున్నట్టు పునరుద్ఘాటించారు. అయితే తాను వరంగల్ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా బరిలో దిగుతున్నట్లు కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌తో తాను మాట్లాడి సుమారు ఐదేళ్లు అయిందని అన్నారు. అదీకాక ఎన్నికల వేళ.. తాను పార్టీల మారాల్సిన అవసరం లేదన్నారు.
విశాఖలో కేఏ పాల్ గెలుపు కోసం ప్రచారం చేస్తానని, ఆయన గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఇటీవల బాబు మోహన్ ఇటీవలే బీజేపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరారు. తనకు జన్మనిచ్చిన గడ్డ వరంగల్ నగరానికి ఏమైనా చేయాలనే ఉద్దేశం ఉందని అన్నారు. ఆ కొద్ది రోజులకే ప్రజా శాంతి పార్టీలో బాబు మోహన్ చేరారు. ప్రజాశాంతి పార్టీ తరపున తాను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు ఆ రోజే ఆయన ప్రకటించారు.
మరోవైపు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. అయితే తాను బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయనని.. పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు కేసీఆర్‌కు ఆమె లేఖ రాశారు. అంతేకాదు.. బీఆర్ఎస్ పార్టీలో ఇటీవల చోటు చేసుకున్న వరుస పరిణామాలు ఫోన్ ట్యాపింగ్, పార్టీ నుంచి వలసలు, అవినీతి ఆరోపణలు, లిక్కర్ స్కాం తదితర కారణాల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు లేఖలో ఆమె వివరించింది. దాంతో వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బాబు మోహన్‌ను బరిలో దింపుతున్నట్లు ఓ ప్రచారం సైతం వైరల్ అయింది. దీంతో తాజాగా ఈ ప్రచారాన్ని బాబు మోహన్ ఖండించారు.