AP Elections: సీఎస్‌కు ఈసీ ఊహించని ఝలక్.. రంగు పడింది!!
ABN , Publish Date - May 07 , 2024 | 04:19 AM
జగన్ సర్కార్‌కు పోలింగ్‌కు ముందు సాయం చేయాలన్న తలంపుతో సీఎస్ జవహర్‌రెడ్డి ప్రతిరోజూ ఎన్నికల కమిషన్‌కు ఏదో ఒక ప్రతిపాదన పంపిస్తున్నారు..
సీఎస్ జోరుకు ఈసీ కళ్లెం
పోలింగ్ వేళ వైసీపీ కోసం పలు ప్రతిపాదనలు
వైసీపీ కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకేనా?
కమిటీ పునః పరిశీలనకు ఈసీ ఆదేశం
(అమరావతి-ఆంధ్రజ్యోతి) :
జగన్ సర్కార్‌కు పోలింగ్‌కు (AP Elections) ముందు సాయం చేయాలన్న తలంపుతో సీఎస్ జవహర్‌రెడ్డి (CS Jawahar Reddy) ప్రతిరోజూ ఎన్నికల కమిషన్‌కు ఏదో ఒక ప్రతిపాదన పంపిస్తున్నారు. నిధుల విడుదలతో ముడిపడిన, ఎప్పుడో పూర్తిచేయాల్సిన పనులను సరిగ్గా ఎన్నికల ముందు తెరపైకి తెస్తున్నారు. వాటిని అమలు చేసేందుకు అనుమతివ్వాలంటూ ఎన్నికల ప్రధానాధికారికి ప్రతిపాదనలు పంపుతున్నారు. ఇటీవల ఈ ధోరణి మరీ తీవ్రంగా మారింది. తామరతంపరగా సీఎస్ పలు అనుమతుల కోసం ఎన్నికల కమిషన్‌కు ఫైళ్లు పంపిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే చేయాల్సిన పనులివి. గతంలోనే బటన్ నొక్కి డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేయకుండా వాటిని ఇప్పుడు విడుదల చేసేందుకు ఈసీ అనుమతి కోరుతూ సీఎస్ లేఖలు రాస్తుండటం గమనార్హం. వైసీపీ పార్టీకి చెందిన కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ఇదంతా చేస్తున్నారన్నా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ఇప్పటికే అమల్లో ఉన్న నగదు బదిలీ పథకాలను కోడ్ సమయంలో కూడా కొనసాగించేందుకు అభ్యంతరం ఉండదు. అయితే లబ్ధిదారులందరూ పాతవారే అయి ఉండాలి. జగన్ నగదు బదిలీ పథకాలన్నీ ఎప్పటికప్పుడు కొత్త లబ్ధిదారులను చేరుస్తూ, గతంలో ఉన్న లబ్ధిదారులను తొలగిస్తూ అమలయ్యేవే. అమ్మఒడి, చేయూత తదితర పథకాలకు సంబంధించి ప్రతి విడత కొత్త లబ్ధిదారులుంటారు.
అలాంటప్పుడు ఈ తరహా పథకాల అమలును ఎన్నికల కోడ్ సమయంలో అనుమతించే అవకాశం ఉండదు. ఈ కారణంగానే ఇటీవల విద్యాదీవెన పథకానికి సంబంధించి రూ.610 కోట్లు విడుదల చేయాల్సి ఉందని సీఎస్ చేసిన విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత అమలు చేయవచ్చని ఈసీ తెలిపింది. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రమకోట గ్రామంలో పురావస్తు తవ్వకాలకు సంబంధించి అనుమతి ఇవ్వాలని, పరిశ్రమలశాఖకు సంబంధించి ఎన్నికల కోడ్‌కు ముందు భూములు కేటాయించామని, ఆ ప్రక్రియను కొనసాగించేందుకు అనుమతించాలని, వైఎ్‌సఆర్ చేయూత కింద నాలుగో విడత కోసం రూ.5021 కోట్లు లబ్ధిదారులకు విడుదల చేసేందుకు, వైఎ్‌సఆర్ ఆసరా పథకం కింద రూ.1843 కోట్లు విడుదల చేసేందుకు, ఈబీసీ నేస్తం మూడో విడత కోసం రూ.629 కోట్లు విడుదల చేసేందుకు సమ్మతించాలని ఎన్నికల కమిషన్‌కు సీఎస్ ప్రతిపాదనలు పంపారు. అయితే సీఎస్ పంపిన ప్రతిపాదనలు సమగ్రంగా లేకపోవడంతో వాటికి సంబంధించి కొన్ని వివరాలను పంపాలని సీఎ్‌సకు ఈసీ తిప్పి పంపింది. లబ్ధిదారులు కొత్తవారా? పాతవారా? ఆయా పథకాలకు సంబంధించి విడుదల చేయాల్సిన పీరియడ్ ఏది? ఏ విధానంలో పంపిణీ చేస్తారు? ఈ పంపిణీ అత్యవసరంగా జరగాల్సిన అవసరం ఏమైనా ఉందా అనేవాటిపై వివరాలను చెప్పాలని స్పష్టం చేసింది.