Chandrababu: చంద్రబాబు ప్రమాణానికి ముందే.. చేతులెత్తేసిన పోలీసులు!
ABN , Publish Date - Jun 10 , 2024 | 11:55 AM
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. జూన్-12న ఉదయం 11:27 గంటలకు ఏపీ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు...
అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. జూన్-12న ఉదయం 11:27 గంటలకు ఏపీ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. దీంతో ప్రమాణస్వీకార సభా ప్రాంగణం వద్ద సందడి వాతావరణం నెలకొన్నది. సందర్శకులు, నాయకుల రాకతో ప్రాంగణ ప్రాంతం రద్దీగా మారింది. వాహనాల రద్దీ ఎక్కువ కావడంతో జాతీయ రహదారిపై.. విజయవాడ వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో నగరవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే చంద్రబాబు కాన్వాయ్ సైతం ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన పరిస్థితి. సుమారు గంట నుంచి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరణ చేయడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి రెండు రోజులు ముందే ఇలా ఉంటే.. అసలు సిసలైన రోజు పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై టీడీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ప్రమాణానికి ముందే పోలీసులు చేతులెత్తేశారనే కామెంట్స్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
పెద్దోళ్లు వస్తున్నారు..!
ఏమీ లేనప్పుడే నగరంలో ట్రాఫిక్ పరిస్థితి ఇలా ఉంటే.. ప్రమాణ స్వీకారం రోజున ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు విచ్చేస్తున్నారు. దీంతో ఆ రోజు ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంటుంది..? పోలీసులు కంట్రోల్ చేస్తారా అనే దానిపై కూటమి పార్టీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. గన్నవరం జాతీయ రహదారి పక్కనే, వెటర్నరీ కళాశాల, సావరగూడెం రోడ్డు ఎలిట్ విస్టాస్, మేధా టవర్స్, ఇతర లే-అవుట్‌లో ఎంపిక చేసిన పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. ఎలీట్ విస్టాస్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయ మూర్తులు, తదితర ప్రముఖులకు పార్కింగ్ స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రధాన మంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాన సభా వేదిక వద్దకు చేరుకు నేందుకు వీలుగా ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను.. ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సూచన చేశారు.
ఏర్పాట్లు ఇలా..!
గన్నవరం మండలం కేసరపల్లి మేధా టవర్స్ ప్రక్కన జరిగే ప్రమాణ స్వీకార సభావేదిక పనులను టీడీపీ నేతలు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వేదిక నిర్మాణ పనులు పూర్తి కావొస్తున్నాయి. జర్మన్ హ్యాంగర్స్‌తో భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్జేజీని సిద్ధం చేస్తున్నారు. స్టేజీ పనులను తిరుపతి జేసీ ధ్యాన్‌చందర్, వైజాగ్ వీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ పర్యవేక్షిస్తున్నారు. 800 అడుగుల పొడవు, 420 వెడల్పు గల జర్మన్ హ్యాంగర్స్‌తో భారీ టెంట్‌ను వేస్తున్నారు. ప్రమాణానికి వచ్చే అతిథులు, వీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేశారు. స్థల ప్రభావం వల్ల పాసులు ఉన్న వారిని మాత్రమే ప్రమాణ స్వీకారకార్యక్రమానికి అనుమతిస్తున్నారు.