AP Elections: జగన్‌ను ఎలా నమ్మాలి.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సూటి ప్రశ్న!
ABN , Publish Date - May 06 , 2024 | 04:39 AM
ఉద్యోగి పక్షపాతినంటూ ఉపాధ్యాయ, ఉద్యోగులందరినీ నమ్మించారు. మేనిఫెస్టోను పవిత్ర మత గ్రంథాలతో పోల్చుతూ ఎన్నో హామీలు ఇచ్చారు
గత ఎన్నికల్లో జగన్ ఇచ్చిన మాట
మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు వారంలో సీపీఎస్ రద్దు చేస్తా. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు కట్టిస్తాను. మూడు డీఏలు పెండింగ్‌లో పెట్టారు. బకాయిలు పెండింగ్‌లో పెట్టారు. ఉద్యోగులు ఎలా బతుకుతారు? చాలీచాలని జీతాలతో బతకాలంటే అవినీతి చేయక తప్పని పరిస్థితిలోకి ప్రభుత్వమే నెట్టేయడం లేదా? ఉద్యోగులకు రావాల్సినవన్నీ సమయానికి వచ్చేలా చేస్తా. ప్రతి డీఏ సమయానికి వచ్చేలా చేస్తా.
సీఎం అయ్యాక ఏం చేశారంటే..
ఒకటో తేదీన జీతాలు, పెన్షన్ల చెల్లింపు మాట ఎప్పుడో మరచిపోయారు. ప్రతినెలా ఎప్పుడిస్తారో తెలియదు. ‘వారంలో సీపీఎస్ రద్దు’ హామీని బంగాళాఖాతంలో కలిపేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం హామీని గాలికొదిలేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఊసే లేదు. టీఏ, డీఏ, జీపీఎఫ్, సరెండర్ లీవులు, డీఆర్ బకాయిల చెల్లింపు మాటే లేదు. జగన్ సర్కారు ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగులను అన్నివిధాలా వంచన చేసింది. హక్కులు, సమస్యల గురించి ప్రశ్నించినవారిని కేసులతో వేధించింది.
చంద్రబాబు సర్కారులోనే అధిక ఫిట్‌మెంట్
6వ పీఆర్సీ-1993లో మర్రి చెన్నారెడ్డి 10 %
7వ పీఆర్సీ-1999లో చంద్రబాబు 25 %
8వ పీఆర్సీ-2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి 16 %
9వ పీఆర్సీ-2010లో రోశయ్య 39 శాతం
10వ పీఆర్సీ-2015లో చంద్రబాబు 43 %
11వ పీఆర్సీ-2020లో జగన్ 23 శాతం
చంద్రబాబు హయాంలో రెగ్యులర్ ఉద్యోగులకు పెన్షనర్లకు ఇవ్వాల్సిన డీఏ, డీఆర్‌లతో పాటు మ్యారేజ్ అడ్వాన్స్, సరెండర్ లీవ్‌లు, జీపీఎఫ్, హెచ్‌బీఏ, వెహికల్ లోన్స్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ వంటివి సకాలంలో అందేవి.
ఉద్యోగ, ఉపాధ్యాయుల సూటి ప్రశ్న
వైసీపీ మేనిఫెస్టో సాక్షిగా మోసం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఉద్యోగి పక్షపాతినంటూ ఉపాధ్యాయ, ఉద్యోగులందరినీ నమ్మించారు. మేనిఫెస్టోను పవిత్ర మత గ్రంథాలతో పోల్చుతూ ఎన్నో హామీలు ఇచ్చారు. పాదయాత్రలో ఊరూవాడా వరాలు కురిపించారు.
తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అటకెక్కించడంతోపాటు ఉద్యోగులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ప్రయోజనాలను కాలరాశారు.దాచుకున్న డబ్బు సైతం పొందలేని దౌర్భాగ్యస్థితి కల్పించారు. అదేంటని ప్రశ్నిస్తే... మెమోలు, బెదిరింపులు, వేధింపులు, డిస్మి్‌సలు, కేసులు, కటకటాలు.
ఐదేళ్ల పాలనా కాలంలో చర్చల పేరుతో కాలయాపన చేస్తూ, సమస్యలు పరిష్కరించకుండా వంచించారు. జగన్ సర్కార్ వచ్చిన నాటి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులపై గతంలో ఎన్నడూలేని విధంగా కక్షసాధింపులకు దిగింది. ఉద్యోగులు శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా చేసింది. హక్కుల కోసం ప్రశ్నించిన చిరుద్యోగులను జైలుకు పంపింది.
జీతాల కోసం వ్యథలు
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 1వ తేదీన జీతాలు, పెన్షన్లు అందడం లేదు. ప్రతి నెలా ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడాల్సిన దుస్థితి. దీంతో ఈఎంఐలు, ఇతర అవసరాల కోసం ప్రతినెలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. జీతాల కోసం ఉద్యోగులు పోరాటం చేయాల్సిన పరిస్థితి కల్పించారు. జీతాలు ఒకటో తేదీన ఇచ్చేలా చట్టాలు చేయాలంటూ నినదించారు.
ఐఆర్ మడతెట్టేసిన జగన్
11వ పీఆర్సీ బకాయిలు పూర్తిగా చెల్లించకుండానే, 11వ పీఆర్సీ పే స్కేళ్లు పూర్తిగా అమలు చేయకుండానే 12వ పీఆర్సీ కమిషన్ వేశారు. ప్రతి అయిదేళ్లకొకసారి ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ ఇవ్వడం సర్వసాధారణం. పీఆర్సీ ఇవ్వడం ఆలస్యమైతే మధ్యంతర భృతి(ఐఆర్) ఇస్తారు. అయితే ఐఆర్ ఇవ్వమంటూ జగన్ సర్కారు ఈ సంప్రదాయానికి మంగళం పాడేసింది. జూలైలో పీఆర్సీ ఇస్తామంటూ ఉద్యోగులకు షాకిచ్చింది.
ఎన్నో సమస్యలు...
ఇళ్ల స్థలాలు లేని ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామని గత ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీని విస్మరించారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి జగన్ సర్కార్ ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవు.
ఉద్యోగుల వేతనాల్లో నుంచి నెలనెలా ఈహెచ్‌ఎ్‌స కింది కొంత కట్ అవుతుంది. ఇప్పటికీ వారికి హెల్త్ కార్డులు ఇవ్వలేదు. నెట్‌వర్క్ ఆసుపత్రులకు సకాలంలో ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో సరైన వైద్య సేవలు అందడంలేదు.
దీంతోపాటు ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు అనేకం పెండింగ్‌లోనే ఉన్నాయి. వివిధ శాఖల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు ఇవ్వడంలోనూ అలసత్వం చూపింది. ఏళ్లతరబడి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
బోధన భారం..
ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే టీచర్లకు పీఆర్సీ, డీఏలు, బకాయిలు, ఇతర ఆర్థిక ప్రయోజనాల విషయంలో అన్యాయం జరుగుతోంది. సమయానికి జీతాలు ఇవ్వడం లేదు. పైగా రకరకాల యాప్‌లతో బోధనేతర పనిభారం పెంచారు. రేషనలైజేషన్‌తో ఏకోపాధ్యాయ పాఠశాలలు పెరిగాయి. ఉన్నత పాఠశాల్లోనూ టీచర్లకు పని భారం పెరిగింది.
సీపీఎస్ రద్దుపై మడత
అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ పునరుద్ధరిస్తామని 2 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు జగన్ హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక సీపీఎస్ రద్దు చేయకపోగా, ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నా జీపీఎస్ అంటూ కొత్త విధానాన్ని బలవంతంగా రుద్దారు.
పోరాటబాట పట్టిన ఉద్యోగులపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారు. సీపీఎస్ అమలుకు 2003 డిసెంబరు 22 కటాఫ్ తేదీ. ఆరోజు నాటికి ఖాళీగా ఉన్న పోస్టుల్లో చేరిన ఉద్యోగులకు ఓపీఎస్ వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించింది.
అలాంటి ఉద్యోగులు రాష్ట్రంలో 10 వేల మంది ఉన్నారు. అవకాశం ఉన్నా వారికి జగన్ సర్కారు ఓపీఎస్ అమలు చేయలేదు.
వైఎస్ హయాంలోనే సీపీఎస్
రాష్ట్రంలో సీపీఎస్ విధానం 2004 సెప్టెంబరు 1న అమలులోకి తెచ్చింది వైఎస్ రాజశేఖరరెడ్డే. ముందుగా ఒక్కమాటైనా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు చెప్పకుండా ఫైలుపై సంతకం చేసిన తర్వాతే వైఎస్ చెప్పారని ఉద్యోగ సంఘాల నేతలు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
గత టీడీపీ ప్రభుత్వంలో...
టీడీపీ ప్రభుత్వంలో సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు కుటుంబ పింఛను, సీపీఎస్ ఉద్యోగులందరికీ గ్రాట్యుటీ సౌకర్యాన్ని కల్పించారు. సీపీఎస్ ఉద్యోగులకు 12 లక్షల విలువైన గ్రాట్యుటీ (ప్రస్తుతం దీని విలువ 16 లక్షలు) జీతాల నుంచి మినహాయించి సీపీఎస్ చందాను ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్‌తో కలిపి వారి ఫ్రాన్ ఖాతాలో ఎప్పుటికప్పుడు జమ చేశారు.
ఠక్కర్ కమిటీ వేసి ఓపీఎ్‌సతో సమానంగా అన్ని ప్రయోజనాలు కల్పిస్తామని చంద్రబాబు సర్కార్ చెప్పింది. అయితే సీపీఎస్ రద్దు చేస్తామని నాడు జగన్ హామీ ఇవ్వడంతో సీపీఎస్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆయన పార్టీ వైపు మొగ్గు చూపారు.
రివర్స్ పీఆర్సీ
జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇచ్చారు. ఐఆర్ (27ు) కన్నా తక్కువ ఫిట్‌మెంట్ (23ు) ఇచ్చి ఉద్యోగులను నట్టేట ముంచారు. డీఏ, పీఆర్సీ బకాయిలు ఇవ్వకుండా ఐదేళ్లు కాలయాపన చేశారు. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో జూన్, జూలైలో చెల్లిస్తామంటూ కథలు చెబుతున్నారు.
రివర్స్ పీఆర్సీతో ఉద్యోగులు తమ సర్వీసులో కేడర్‌ను బట్టి ఒక్కొక్కరు సుమారు పది లక్షల వరకు నష్టపోవాల్సి ఉంటుందని అంచనా. హెచ్‌ఆర్‌ఏ తగ్గించడంతో ఉద్యోగుల జీతాలు తగ్గిపోయాయి.
బాబు సీఎంగా ఉండగా...
సచివాలయ ఉద్యోగులకు టీడీపీ హయాంలో 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఉంటే.. జగన్ సర్కారు 24 శాతానికి తగ్గించింది. జిల్లా కేంద్రాల్లో 20 శాతంగా ఉన్న హెచ్‌ఆర్‌ఏను 16 శాతానికి కుదించింది. ఇతర అలెవెన్సుల్లో పెరుగుదల లేదు.
2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్ర విభజన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 10వ పీఆర్సీలో ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు. తెలంగాణకు తగ్గకుండా పీఆర్సీ ఇవ్వడమే గాక పీఆర్సీ ఎరియర్స్ పది నెలలవి ఇచ్చారు.
దీంతో ఒక్కో ఉద్యోగికి సుమారు లక్ష నుంచి లక్షన్నర వరకు ఒకేసారి చెల్లింపులు జరిగాయి. 1999లో చంద్రబాబు 7వ పీఆర్సీలో ఇచ్చిన ఫిట్‌మెంట్ (25 శాతం) కన్నా 11వ పీఆర్సీలో జగన్ ఇచ్చిన ఫిట్‌మెంట్ (23శాతం) తక్కువ. అంటే.. చంద్రబాబు ఇరవై ఏళ్ల ముందు ఉద్యోగులకు ఇచ్చిన పీఆర్సీ కన్నా జగన్ తక్కువ ఇచ్చారన్నమాట.
కాంట్రాక్టు ఉద్యోగులకు మోసం
అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసును పరిగణనలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని వైసీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేశారు. 10 వేల మందిని రెగ్యులర్ చేస్తామంటూ ప్రకటించినా ఆ ప్రక్రియ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
టీడీపీ సర్కారులో ఇలా...
గత ప్రభుత్వ హయాంలో జీవో 12 ద్వారా కాంట్రాక్టు, పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ తదితర ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేసింది. దీంతో కనీస వేతనం రూ.4 వేల నుంచి 13 వేల వరకు ప్రస్తుతం రూ.20 వేల వరకు పెరిగింది.
ఉన్నత స్థాయి పోస్టులకు వాటి స్కేల్స్‌కు అనుగుణంగా ఈ పెరుగుదల ఉంది. అంతకుముందు ఒక్క 010 వేతనాలకు మాత్రమే బడ్జెట్ కంట్రోల్ నుంచి వెసులుబాటు ఉండేది.
మిగిలిన ఉద్యోగులకు బడ్జెట్ నియంత్రణ వల్ల కొన్నిసార్లు నెలల తరబడి జీతాలు ఆలస్యంగా వచ్చేవి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బడ్జెట్ కంట్రోల్ లేకుండా వారి జీతాలు కూడా నేరుగా 010 తరహాలో ఒకటో తేదీనే డ్రా చేసుకునే వెసులుబాటు ఇచ్చారు.
విశ్రాంత ఉద్యోగులకు చుక్కలు
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీకి జగన్ తూట్లు పొడిచారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించకపోగా వారు ప్రతి నెలా పెన్షన్ల కోసం ఎదురు చూసేలా చేశారు. రాష్ట్రంలో 3.80 లక్షల మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. పెన్షన్ కోసం మలి వయసులో రొడ్డెక్కాల్సిన దుస్థితి కల్పించారు.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు టోకరా
సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తామని వైసీపీ మేనిఫెస్టోలో పెట్టి మరీ మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత (2022లో) 23 శాతం జీతం పెంచారు. ప్రభుత్వ ఉద్యోగం అంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు కట్ చేశారు.
బాబు హయాంలో భారీగా
2016లో చంద్రబాబు హయాంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంచారు. అదనంగా రూ.5,500 నుంచి రూ.6 వేల వరకు 58 శాతం వేతనాలు పెంచారు. అప్పట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ జీతం రూ.9,500 నుంచి రూ.15 వేలకు, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ జీతం రూ.11,500 నుంచి రూ.17,500కి పెరిగింది.