YS Jagan Arrest: కంచికి చేరని కేసుల కథ!
ABN , Publish Date - May 28 , 2024 | 03:37 AM
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక అక్రమ మార్గాల్లో ప్రజా సంపదను కొల్లగొట్టారు.
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా కూడా అవినీతికి పాల్పడవచ్చా?
చట్టాల్లో లొసుగులను వాడుకుని కేసు విచారణకే రాకుండా ఎన్నేళ్లయినా అడ్డుకోవచ్చా?
2011లో తొలి కేసు...
2012లో తొలి చార్జిషీటు దాఖలు
విచారణ జాప్యానికి ఎత్తుల మీద ఎత్తులు
39 క్వాష్, 95 డిశ్చార్జి పిటిషన్లు దాఖలు
ఇప్పటికి ఆరుగురు జడ్జీలు బదిలీ
తాజా అఫిడవిట్‌లో సీబీఐ వెల్లడి
పరిస్థితి మారుతుందంటున్న నిపుణులు
ఈ రెండు అంశాలకు సంబంధించి అటు పోలీసు వ్యవస్థ, ఇటు న్యాయ వ్యవస్థకు కేస్ స్టడీగా మారిన ఏకైక వ్యక్తి... వైఎస్ జగన్మోహన్ రెడ్డి! రాష్ట్ర స్థాయిలోనే కాదు... జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన అవినీతి చరిత్ర ఆయనది! ‘క్విడ్ ప్రోకో’ అనే పదాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే! అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2012 మే 27వ తేదీన అరెస్టయ్యారు! అంటే... ఇప్పటికి సరిగ్గా పన్నెండేళ్లు! దాదాపు పదేళ్లుగా ఆయన బెయిలుపైనే ఉన్నారు. ఆయనపై కేసుల విచారణ మాత్రం ఒక్క అడుగూ ముందుకు పడలేదు! అయితే... ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు! ఇకపై జరగబోయేది మరో ఎత్తు!... అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి): ‘‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక అక్రమ మార్గాల్లో ప్రజా సంపదను కొల్లగొట్టారు. భూములు, లైసెన్సులు, వివిధ ప్రాజెక్టులు, సెజ్‌లు, మైనింగ్ లీజులు, రేవులు, రియల్ ఎస్టేట్ అనుమతులు ఇష్టారాజ్యంగా కేటాయించి... అందుకు బదులుగా ముడుపులు స్వీకరించారు. మేళ్లు పొందిన వారంతా జగన్ స్థాపించిన కంపెనీల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి ముడుపులు చెల్లించుకున్నారు’’... నెల రోజుల కిందట సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొన్న విషయమిది! 13 సంవత్సరాల క్రితం 2011లో జగన్‌పై సీబీఐ తొలి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 2012 జనవరి 21న తొలి చార్జిషీటు దాఖలు చేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదీ కొలిక్కి రాలేదు. చార్జిషీట్లు, అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు, డిశ్చార్జి పిటిషన్లు, వాదనలు, ప్రతివాదనలు, వాయిదాలు! జగన్ అక్రమాస్తుల కేసులో 13 సంవత్సరాలుగా సాగుతున్నది ఇదే! తాము సమగ్రంగా దర్యాప్తు జరిపిన తర్వాత 11 చార్జిషీట్లు దాఖలు చేశామని సీబీఐ నెల రోజుల క్రితం సుప్రీంకోర్టులో తాజా అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ తర్వాత జగన్ కేసుల్లో కదలిక తథ్యమని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.
న్యాయ వ్యవస్థకే సవాలు...
జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీపై ఎంపీ రఘురామ కృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో అనేక సంచలన అంశాలను ప్రస్తావించింది. దీని ప్రకారం...
జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇప్పటిదాకా 39 క్వాష్ పిటిష న్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై తీర్పు లు ఇవ్వకముందే ఆరుగురు న్యాయమార్తులు బదిలీ అయ్యారు. తాజా న్యాయమూర్తి కూడా కనీసం రెండేళ్లు కాకముందే బదిలీ అయ్యారు.
ఈ కేసులో ఉన్న నిందితులంతా శక్తివంతులే! ఏదో ఒక కారణంతో ఒకదాని తర్వాత మరొక పిటిషన్ దాఖలు చేస్తూ, దేశంలో ఉన్న అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలను వినిపిస్తున్నారు.
ఈ కేసుల్లో దాదాపు 900 మంది సాక్షులున్నారు. వీరంతా 50 ఏళ్లు పైబడిన వారే. ఒక ప్రిన్సిపల్ కోర్టును ప్రత్యేక కోర్టుగా నియమించి కేసులను రోజువారీ విచారించాలి.
వేసవి సెలవుల తర్వాత...
ప్రధాన నిందితుడు జగన్ సహా ఇతర నిందితులు ఏదో ఒక కారణం చూపుతూ విచారణ ప్రక్రియ సాగకుండా, తీర్పు లు వెలువరించకుండా అడ్డంకులు సృష్టించినట్లు తెలంగాణ హైకోర్టు 2018 సెప్టెంబరు 10న జారీ చేసిన ఉత్తర్వులను కూడా సీబీఐ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. జగన్ అక్రమాస్తు ల కేసు విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న రఘురామ పిటిషన్‌పై వేసవి సెలవుల తర్వాత విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. అప్పటికి దేశంలో మారే రాజకీయ వాతావరణం కూడా ఈ కేసుల వే గవంతం అయ్యేందుకు మార్గాన్ని సుగమం చేయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. నిందితులు దాఖలు చేస్తున్న డిశ్చా ర్జి పిటిషన్లపై త్వరితగతిన విచారణ ముగించి, తీర్పులు కూ డా వెలువరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి గతంలో ఇచ్చిన తీర్పును కూడా గుర్తు చేస్తున్నారు.
ఇలా మొదలైంది...
2004-2009 మధ్య వైఎస్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్మోహన్ రెడ్డి అనేక అక్రమ లావాదేవీల ద్వారా రూ.43 వేల కోట్ల మేరకు అక్రమ సంపాదన కూడబెట్టారని మాజీ మంత్రి పి. శంకర్‌రావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని 2011 ఆగస్టు 10న ఏపీ హైకోర్టు ఆదేశించింది.
2011 ఆగస్టు 17న దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో జగన్ వ్యా పార సామ్రాజ్యంలో అక్రమ పెట్టుబడులు వచ్చాయని, అనేక అక్రమ ఆస్తులు పోగు చేశారని సీబీఐ పేర్కొంది.
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13తోపాటు... ఐపీసీలోని సెక్షన్ 120బీ(నేరపూరిత కుట్ర), 420(మోసం), 409 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన), 477ఏ(తప్పుడు లెక్కలు)ల కింద జగన్, మరో 74 మందిపై కేసులు నమోదు చేసింది. ఈడీ కూడా కేసులు నమోదు చేసింది.
2012-2013ల మధ్య సీబీఐ జగన్‌పై 11 చార్జిషీట్లు దాఖలు చేసింది. ఈడీ 9 దాఖలు చేసింది. ప్రతి కేసులో ఏ1గా జగన్, ఏ2గా విజయసాయిరెడ్డి ఉన్నారు.
హెటెరో, అరబిందో ఫార్మా, రాంకీ, వాన్‌పిక్, దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, రఘురాం సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, ఇందూ టెక్ జోన్, లేపాక్షి నాలెడ్జి హబ్, ఏపీ హౌసింగ్ ప్రాజెక్ట్స్ తదితర కంపెనీలపై అభియోగాలు నమోదయ్యాయి.
జగన్ మీడియాతోపాటు, భారతీ సిమెంట్స్‌లోనూ పెద్ద పెద్ద కంపెనీలు అత్యధిక ప్రీమియంతో వాటాలు కొన్నాయని సీబీఐ ఆధారాలు సేకరించింది. నిజానికి ఇవి ‘క్విడ్ ప్రో కో’లో భాగంగా అందిన ముడుపులే అని, పెట్టుబడులు కావని ఆధారాలతో సహా నిరూపించింది.
ఆయా ముడుపులు సూట్‌కేస్ కంపెనీల ద్వారా ఎక్కడెక్కడికి వెళ్లి... ఎలా జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులుగా వచ్చా యో స్పష్టంగా వివరించింది.
మనీలాండరింగ్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు నివేదికలు ఉన్నందువల్లే ‘సాక్షి’ టీవీకి కేంద్రం అనుమతులు పునరుద్ధరించకుండా నిలిపివేసింది.
2012 మే 12న జగన్ అరెస్టయ్యారు. 16 నెలలు చంచల్‌గూడ జైలులో గడిపిన అనంతరం... 2013 సెప్టెంబరు 24న బెయిలుపై విడుదలయ్యారు. ఆ క్షణం నుంచే కేసు ల్లో విచారణ ఆలస్యమయ్యేలా ఎత్తులు వేస్తూనే ఉన్నారు.
పాదయాత్ర, రాజకీయ కార్యకలాపాలు, ఇతరత్రా రకరకా ల కారణాలు, సాకులు చెబుతూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతున్నారు. సీఎం అయ్యాక... తాను ప్రజాసేవలో నిరంతరం నిమగ్న మై ఉన్నందువల్ల, భారీ ఆర్థిక లోటుతో ఉన్న ఏపీని కాపాడాల్సిన బాఽధ్యత తనపై ఉందని... హైదరాబాద్ కు రాలేనని పిటిషన్లు సమర్పించారు. కింది కోర్టు ఈ పిటిషన్ కూడా తిరస్కరించినప్పటికీ... హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు.
అన్ని చార్జిషీట్లను కలిపి ఒకేసారి విచారించాలని కూడా జగన్ పిటిషన్లు దాఖలు చేశారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయాలకూ తనకూ సం బంధం లేదంటూ ఆయన డిశ్చార్జి పిటిషన్లను కూడా దాఖలు చేశారు.