Share News

Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

ABN , Publish Date - May 13 , 2024 | 06:17 PM

తెలుగు రాష్ట్రాల్లో నిర్దేశిత పోలింగ్ సమయం ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు.. అటు తెలంగాణలో 17 పార్లమెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

తెలుగు రాష్ట్రాల్లో నిర్దేశిత పోలింగ్ సమయం ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు.. అటు తెలంగాణలో 17 పార్లమెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అయితే.. ఏపీలోని పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు ఇంకా బారులు తీరడంతో, వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. గడువు ముగిసినప్పటికీ.. క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేయడానికి ఛాన్స్ ఇచ్చారు. అక్కడక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా, కొన్ని ప్రాంతాల్లో వర్షం పడినా.. లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తడం విశేషం. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొనడం చూస్తే.. ఈసారి 70 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావొచ్చని ఈసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


అంతకుముందు.. అంటే సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 67.99 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.13 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా.. 2.71 కోట్లకు పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 1.30 కోట్లకు పైగా పురుష ఓటర్లు (64.28%) ఉండగా.. 1.40 కోట్లకు పైగా మహిళలు (66.84%) పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు. పురుషులతో పోలిస్తే.. మహిళలే చురుగ్గా ఈ పోలింగ్‌లో పాల్గొన్నట్టు స్పష్టమవుతోంది. తెలంగాణ విషయానికొస్తే.. సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైనట్లు తేలింది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో తక్కువ ఓట్లు పోలయ్యాయని అర్థమవుతోంది.

Read Latest Andhra Pradesh News and Telangana News

Updated Date - May 13 , 2024 | 06:17 PM