Praja Galam: ప్రజాగళ గర్జన!
ABN , Publish Date - Mar 18 , 2024 | 04:14 AM
‘ప్రజాగళం’ సభకు రాష్ట్రం నలుమూలల నుంచీ జనం వచ్చారు. ప్రధానంగా ఉమ్మడి గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కృష్ణా జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చారు.
‘కూటమి’ సభలో జన హోరు..
కార్యకర్తల్లో ఉరిమిన ఉత్సాహం
సుమారు మూడువందల ఎకరాల ప్రాంగణం... జాతీయ రహదారిపై అటూఇటూ దాదాపు 20 కిలోమీటర్లు... ఎటు చూసినా జనం జనం... ప్రభంజనం! టీడీపీ- జనసేన - బీజేపీ కూటమి తొలి ఉమ్మడి సభ సూపర్‌హిట్ అయ్యింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఆదివారం నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో జన గర్జన వినిపించింది. ఉదయం నుంచే సభా ప్రాంగణానికి జనం రాక మొదలైంది. మధ్యాహ్నానికే మొత్తం మైదానం నిండిపోయింది. ఆపై జాతీయ రహదారి సైతం కనుచూపు మేర జనసంద్రంగా మారింది. యువకులు వృద్ధులు, మహిళలు, పిల్లలు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారూ కూటమి పార్టీల జెండాలతో బొప్పూడి వైపు కదిలారు. ఇటు చిలకలూరిపేట, అటు మార్టూరు వరకు రోడ్డంతా జనంతో నిండిపోయింది. వేలాదిమంది సభా ప్రాంగణానికి
చేరుకోలేక.. వాహనాల్లోనే ఉండిపోయారు.
బొప్పూడిలో కిక్కిరిసిన సభా ప్రాంగణం
హైవేపై కిలోమీటర్ల మేర జనం
రాష్ట్రం నలుమూలల నుంచీ రాక
ప్రసంగాలకు జోరుగా స్పందన
‘కూటమి’ సభలో ఉరిమిన ఉత్సాహం
కిక్కిరిసిన సభా ప్రాంగణం
హైవేపై కిలోమీటర్ల కొద్దీ జనం
రాష్ట్రం నలుమూలల నుంచీ రాక
(చిలకలూరిపేట/నరసరావుపేట - ఆంధ్రజ్యోతి) :
‘ప్రజాగళం’ (Praja Galam) సభకు రాష్ట్రం నలుమూలల నుంచీ జనం వచ్చారు. ప్రధానంగా ఉమ్మడి గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కృష్ణా జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చారు. బస్సులు, ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు... ఇలా అందుబాటులో ఉన్న అన్ని రవాణా సాధనాలను ఉపయోగించుకున్నారు. మూడు పార్టీల కార్యకర్తలే కాకుండా సాధారణ ప్రజలు కూడా స్వచ్ఛందంగా కదలిరావడంతో సభా ప్రాంగణం జనసాగరాన్ని తలపించింది. సభకు రెండు కిమీ దూరంలోనే వాహనాలను ఆపేసినా, ఎండను సైతం లెక్క చేయకుండా నడుచుకుంటూ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రసంగాలకు ప్రజల నుంచి అద్భుత స్పందన లభించింది. 2014 ఎన్నికల్లో 3పార్టీలు కలసి ఘన విజయం సాధించాయి. ఇప్పుడూ అదే రిపీట్ అవుతుందని అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్‌పై విమర్శలకు జనం నుంచి అనూహ్య స్పందన లభించింది. సైకో జగన్‌ను తరిమికొట్టేందుకు సిద్ధమా... అని అధినేతలు ప్రశ్నించగా లక్షలాది మంది సిద్ధమంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు.
ఉత్సాహపరిచిన నేతలు
పవన్ కల్యాణ్, నాగబాబు మధ్యాహ్నం 2.30 గంటలకే ప్రాంగణానికి చేరుకుని ఉత్సాహం నింపారు. టీడీపీ యువనేత లోకేశ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 3.30కు వచ్చారు. సభకు వచ్చిన ప్రజలను అలరించేందుకు కళాకారులు రకరకాల కళా రూపాలు ప్రదర్శించారు. డప్పుల నృత్యం, కోలాటం, బాంగ్రా, కిందిరి, రేలా తదితర సంప్రదాయ, గిరిజన కళారూపాలను 3 గంటలపాటు ప్రదర్శించారు. వలంటీర్లు నిరంతరం మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేశారు. సభను విజయవంతం చేసేందుకు మూడు పార్టీల నేతలు సమన్వయంతో కృషి చేశారు. తమ శ్రమ ఫలించిందని, ‘ప్రజాగళం’ సభకు అనూహ్య స్పందన లభించిందని పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేశారు.