YSRCP: వైసీపీలో మొదలైన రాజీనామాలు.. సీనియర్లు ఔట్
ABN , Publish Date - Jun 09 , 2024 | 09:31 AM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) వైసీపీ (YSR Congress) ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం, కనీసం ప్రతిపక్ష హోదా లేకపోవడంతో పార్టీ ఉంటుందా..? ఊడుతుందా అనే విషయం కూడా తెలియట్లేదు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) వైసీపీ (YSR Congress) ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం, కనీసం ప్రతిపక్ష హోదా లేకపోవడంతో పార్టీ ఉంటుందా..? ఊడుతుందా అనే విషయం కూడా తెలియట్లేదు. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా రాజీనామా చేసి పార్టీ నుంచి బయటికి వచ్చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు లాంటి వ్యక్తులు రాజీనామా చేయగా.. తాజాగా మరికొందరు సీనియర్లు రాజీనామా చేశారు. జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, వైసీపీ సీనియర్ నేత దేరంగుల ఉదయ్ కిరణ్ వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మెయిల్‌లో పంపారు. శనివారం విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల్ని దారుణంగా మోసం చేస్తూ వచ్చిన జగన్‌కు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురు కావడం సబబేనన్నారు. మోసపూరిత పార్టీలో ఉండటం ఇష్టం లేక రాజీనామా చేస్తున్నానని, భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానన్నారు.
క్రైస్తవ విభాగం అధ్యక్షుడు రాజీనామా
ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ క్రైస్తవ విభాగం అధ్యక్షుడు రెవరెండ్ బందెల దయానందం కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాసరావుకు పంపినట్టు తెలిపారు. క్రైస్తవులను ఓటు బ్యాంకుగా చూడటం, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దుర్వినియోగం చేసి వేరే పథకాలకు మళ్లించడం బాధించిందన్నారు. తప్పు తెలుసుకుని మళ్లీ టీడీపీని బలోపేతంతో పాటు చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడానికి తనతో పాటు పాస్టర్ ఎస్.కిరణ్‌కుమార్, పాస్టర్ ప్రభాకర్‌రావు, పాస్టర్ పి.రబ్బునీ వస్తున్నారన్నారు.
కేడీసీసీబీ చైర్‌పర్సన్ రాజీనామా
కేడీసీసీ బ్యాంక్ చైర్‌పర్సన్ తాతినేని పద్మావతి తన పదవికి శనివారం రాజీనామా చేశారు. ఈ లేఖను సహకార శాఖ కమిషనర్, జిల్లా రిజిస్ట్రార్‌కు పంపారు. వైసీపీ ఓటమితో ఆమె ఈ పదవికి రాజీనామా చేశారు.