Elections 2024: జగన్‌కు షాక్.. టీడీపీ బాట పట్టిన వలంటీర్లు!
ABN , Publish Date - Apr 13 , 2024 | 06:07 AM
వలంటీర్లకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన ఆయా వర్గాల్లో ఆలోచన రేకెత్తించింది. ఐదేళ్లపాటు వైసీపీకి అడ్డగోలుగా చాకిరీ చేసినా..
నెల్లూరు జిల్లాలో 40 మంది, శ్రీకాకుళంలో ఇద్దరు చేరిక
నెల్లూరు, టెక్కలి, ఏప్రిల్ 12: వలంటీర్లకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన ఆయా వర్గాల్లో ఆలోచన రేకెత్తించింది. ఐదేళ్లపాటు వైసీపీకి అడ్డగోలుగా చాకిరీ చేసినా రూపాయి కూడా పెరగకపోవడాన్ని వలంటీర్లలో అనేక మంది ప్రశ్నిస్తున్నారు. పైగా తమను రాజీనామా చేసి, వైసీపీ కార్యకర్తల్లా పనిచేయాలని ఆదేశించడంపై పలువురిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే పలువురు వలంటీర్లు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో 40 మంది వలంటీర్లు శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరులోని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, కోవూరు అభ్యర్థి ప్రశాంతిరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ఇంకా చాలామంది వలంటీర్లు వైసీపీ నుంచి విముక్తి కోసం వేచి ఉన్నారని అన్నారు. వారంతా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చిట్టయ్యవలస పంచాయతీ తులసిపేట ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారానికి అచ్చెన్నాయుడు వెళ్లగా.. తోట సింహాచలం, పట్ట కాశీపతి అనే ఇద్దరు వలంటీర్లు టీడీపీలో చేరిపోయారు.