విశాఖలో ఈడీ దాడులు
ABN , Publish Date - Oct 20 , 2024 | 03:56 AM
విశాఖపట్నం మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం సోదాలు నిర్వహించింది.
వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ నివాసంలో సోదాలు
ఆయన స్నేహితుడు జీవీ ఇల్లు, కార్యాలయంలో కూడా..
మనీ లాండరింగ్ నేపథ్యంలోనే..
‘హయగ్రీవ’ జగదీశ్వరుడు ఫిర్యాదుతో దాడులు జరిగినట్లు ప్రచారం
విశాఖపట్నం, అనకాపల్లి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం సోదాలు నిర్వహించింది. ఆయనతో పాటు ఆయన స్నేహితుడైన ఆడిటర్, వైసీపీ నేత గన్నమని వెంకటేశ్వరరావు (జీవీ) నివాసం, కార్యాలయంపై కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. లాసన్స్‌బే కాలనీలోని ఎంపీ నివాసం, కార్యాలయంతో పాటు రుషికొండలోని ఆయన కుమారుడి ఇంట్లో మూడు బృందాలు, సీతమ్మధారలోని జీవీ నివాసం, పెదవాల్తేరులోని ఆయన కార్యాలయంలో రెండు బృందాలు ఉదయం ఎనిమిది గంటల నుంచి సోదాలు నిర్వహించాయి. 2006లో రిజిస్టర్ అయిన హయగ్రీవ ఇన్‌ఫ్రాటెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కు ఎండాడలో 2008లో రాష్ట్ర ప్రభుత్వం 12.51 ఎకరాలు కేటాయించింది. సంస్థ ప్రమోటర్ అయిన చెరుకూరి జగదీశ్వరుడు ఆ భూమిలో వృద్ధులకు విల్లాలు, వృద్ధాశ్రమం నిర్మిస్తానని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఆ భూమి డెవల్‌పమెంట్ పేరుతో ఆడిటర్ జీవీ 2020లో అప్పటి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను జగదీశ్వరుడికి పరిచయం చేశారు.
ఆ సమయంలో డెవలపర్ గద్దె బ్రహ్మాజీతో తాను ఒప్పందం చేసుకున్నట్టు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి, తమను బెదిరించి ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకుని ప్రభుత్వం కేటాయించిన భూమిని లాక్కొన్నారని, బ్రహ్మాజీకి ఎంవీవీ, జీవీకి మధ్య మనీ లాండరింగ్ కూడా జరిగిందని ఈ ఏడాది జూన్‌లో పీఎం పాలెం పోలీసులకు జగదీశ్వరుడు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జూన్ 22న మాజీ ఎంపీ ఎంవీవీ, జీవీపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో వారిద్దరికీ ఈనెల 17న హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ అంశం ఈడీ దృష్టికి చేరడంతో ఈ దాడులు నిర్వహించినట్టు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో ఒక సెల్‌ఫోన్ విక్రయ సంస్థకు చెందిన నగదు భారీమొత్తంలో బయటపడిందని, దానిపై ఈడీ విచారణ జరపగా ఆ నగదుతో ఆ సంస్థకు ఆడిటర్‌గా ఉన్న జీవీ, ఎంవీవీ సత్యనారాయణకు లింకులున్నట్టు తేలిందని అంటున్నారు. శనివారం రాత్రి పొద్దుపోయేవరకు సోదాలు కొనసాగాయి. దీనికి సంబంధించి అధికారికంగా వివరాలు వెల్లడికాలేదు.
భూదందాలకు పాల్పడ్డ వైసీపీ నేతలు జైలుకే: ఎంపీ సీఎం రమేశ్
విశాఖపట్నం కేంద్రంగా గత వైసీపీ పాలకులు విచ్చలవిడిగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని, వారంతా జైలుకు వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. విశాఖలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయంలో ఈడీ సోదాల నేపథ్యంలో శనివారం ఆయన మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. ఇవి ప్రారంభం మాత్రమేనన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని వైసీపీ నేతలు విశాఖపట్నంలో చేసిన అవినీతి, అక్రమాల చిట్టా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందన్నారు. వైసీపీ నేతల దందాలపై కేంద్రానికి ఫిర్యాదు చేశామన్నారు. రుషికొండపై నిర్మాణం విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి టెండర్లు లేకుండా రూ. 500 కోట్లు దోచుకున్నారని, ఆ వివరాలు కూడా ఈడీ, సీబీఐ వద్ద ఉన్నాయన్నారు. ప్రజల సొత్తు దోచుకున్న వైసీపీ నేతలు స్వచ్ఛందంగా తిరిగి అప్పగించాలన్నారు.