YS Jagan: బెంగళూరు వెళ్లినా.. బిల్లుల గోలే!
ABN , Publish Date - Jun 25 , 2024 | 03:33 AM
పెండింగ్ బిల్లుల కోసం వైసీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
జగన్‌కు చుక్కలు చూపుతున్న వైసీపీ కార్యకర్తలు
కోర్టు ద్వారా బిల్లుల కోసం పోరాటం చేద్దాం
పులివెందుల నేతలకు మాజీ సీఎం సూచన
యలహంక ప్యాలెస్ వద్దా శ్రేణుల ఆందోళన
సైకో జగన్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు
బెంగళూరు/అమరావతి-ఆంధ్రజ్యోతి/పులివెందుల, జూన్ 24: పెండింగ్ బిల్లుల కోసం వైసీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పనులు చేసినవారు పులివెందులలో ఆయన సమక్షంలోనే ఆందోళనకు దిగారు. శనివారం నుంచి సోమవారం వరకు మూడ్రోజులపాటు నిరసన తెలిపారు. ఆయన బెంగళూరు వెళ్లినా అక్కడకు వెళ్లి ఆగ్రహంతో నినాదాలు చేశారు. పులివెందుల అర్బన్ డెవల ప్‌మెంట్ అథారిటీ (పాడా) పనులు చేపట్టిన స్థానిక ఛోటామోటా నేతల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు జగన్ మాజీ అవడంతో తమ పరిస్థితేంటని శని, ఆదివారాల్లో ఆయన్ను నిలదీశారు. సోమవారం కూడా పలువురు ఆయన్ను కలిసి వాపోయారు. బిల్లులు ఆగిపోతే తమ పరిస్థితి దయనీయంగా మారుతుందని ఎంపీ అవినాశ్‌రెడ్డికి, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డికి ఎన్నిసార్లు చెప్పుకొన్నా లాభం లేకపోయిందన్నారు.
ఎన్నికల వరకు సాగదీసి.. చివరకు చేతులెత్తేశారని వాపోయారు. జగన్ స్పందిస్తూ ఎవరు అధైర్యపడొద్దని.. అందరికీ బిల్లులు వచ్చేలా కోర్టు ద్వారా సాధించుకుందామని సూచించారు. రాబోయే ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం మనదేనన్నారు. భయపడాల్సిన అవసరం లేదని.. అందరికీ అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజాద్‌బాషా, రఘురామిరెడ్డి, కడప మేయర్ సురేశ్‌బాబు, వైఎస్ మనోహర్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం అనిమెల సంగిరెడ్డి, వైఎస్ పురుషోత్తంరెడ్డి కుటుంబాలను జగన్ పరామర్శించారు.
తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో భార్యాసమేతంగా బెంగళూరు యలహంక ప్యాలెస్‌కు వెళ్లారు. అయితే పులివెందులకు చెందిన వైసీపీ అభిమానులు, కార్యకర్తలు అక్కడకు కూడా పెద్దసంఖ్యలో చేరుకున్నారు. పెండింగ్ బిల్లులకు నిధులు విడుదల చేయించాలంటూ ఆయన్ను ఘెరావ్ చేసినట్లు తెలిసింది. అయితే జగన్‌ను కలిసేందుకు వీలులేకుండా సిబ్బంది ప్యాలెస్ గేట్లు మూసివేయడంతో కార్యకర్తలు మండిపడ్డారు. ‘సైకో జగన్ డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు చేసి న వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.