Ex-Minister Perni Nani : రూ. కోటి చెల్లించిన పేర్ని నాని!
ABN , Publish Date - Dec 15 , 2024 | 05:31 AM
తన గోడౌన్‌లో పీడీఎస్ బియ్యం మాయమైన కేసు నుంచి బయటపడే ప్రయత్నాల్లో మాజీ మంత్రి పేర్ని నాని ఉన్నారు.
పీడీఎస్ బియ్యం కేసు నుంచి తప్పించుకునే యత్నం
మచిలీపట్నం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తన గోడౌన్‌లో పీడీఎస్ బియ్యం మాయమైన కేసు నుంచి బయటపడే ప్రయత్నాల్లో మాజీ మంత్రి పేర్ని నాని ఉన్నారు. దీనిలో భాగంగా శనివారం ఆయన కోటి రూపాయలు ప్రభుత్వానికి చెల్లించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మచిలీపట్నం సమీపంలోని పొట్లపాలెంలో పేర్ని నాని భార్య జయసుధ పేరున ఉన్న గోడౌన్‌లను పౌరసరఫరాలశాఖకు అద్దెకు ఇచ్చారు. గత నెలాఖరున నిర్వహించిన తనిఖీల్లో ఈ గోడౌన్‌ల నుంచి 187 టన్నుల పీడీఎస్ బియ్యం మాయమైనట్టు అధికారులు గుర్తించారు. అయితే అధికారులు తనిఖీలకు రాకముందే పేర్ని నాని భార్య జయసుధ స్పందించారు. ఆ గోడౌన్‌లోని బియ్యం లెక్కల్లో తేడాలు ఉన్నాయని, దానికి డబ్బు చెల్లిస్తానని పౌరసరఫరాలశాఖ అఽధికారులకు లేఖ రాశారు. దీంతో బియ్యం మాయం విషయం ముందుగానే బయట పడింది. పీడీఎస్ బియ్యం మాయంపై పౌరసరఫరాల శాఖ అధికారుల ఫిర్యాదుతో ఇటీవల మచిలీపట్నం తాలుకా పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పేర్ని జయసుధ శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నుంచి బయటపడేందుకే పేర్ని నాని ప్రభుత్వానికి డబ్బు చెల్లించినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటిస్తున్నారు.