Fake IPS : పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్!
ABN , Publish Date - Dec 29 , 2024 | 05:52 AM
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటనలో హల్‌చల్ చేసిన నకిలీ ఐపీఎస్ గుట్టు ఎట్టకేలకు రట్టయింది. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.
అరెస్టు చేసిన పోలీసు అధికారులు
సాలూరు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటనలో హల్‌చల్ చేసిన నకిలీ ఐపీఎస్ గుట్టు ఎట్టకేలకు రట్టయింది. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఏఎస్పీలు దిలీ్‌పకిరణ్, అంకిత శనివారం విలేకరులకు వివరాలు తెలిపారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గడసాంకు చెందిన సూర్యప్రకాశ్ 2003 నుంచి 2005 వరకు ఆర్మీలో పనిచేశాడు. అక్కడి నుంచి వచ్చేశాక బొబ్బిలిలో బీటెక్ చేశాడు. ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ కూడా చేశాడు. కొద్దిరోజుల తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయాడు. 2020లో తండ్రి తవిటిబాబు చనిపోయాక. ఆయన భూమిని దక్కించుకోడానికి నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తాడు. 2024లో ఐపీఎ్‌సకు సెలెక్ట్ అయ్యానని చెప్పి, హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్టల్‌లో ఉండి.. యూనిఫాం కుట్టించుకుని, నకిలీ ఐడీ కార్డులు తయారు చేసుకున్నాడు. ఆరు నెలల కిందట విజయనగరం తిరిగి వచ్చాడు. ఈనెల 20న పవన్‌కల్యాణ్ పర్యటన సందర్భంగా పనసభద్ర వెళ్లాడు. అక్కడ వీఐపీలతో ఫొటోలు దిగాడు. కొన్నింటిని వాట్సాప్ స్టేట్‌సగా పెట్టుకున్నాడు. దీనిపై పోలీసులు విచారణ జరపగా గుట్టురట్టయింది. సూర్యప్రకాశ్‌ను అరెస్టు చేసి, రెండు నకిలీ ఐడీ కార్డులు, యూనిఫాం, కారు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.