Share News

Andhra Pradesh Farmer's: ఖరీఫ్‌ పై కోటి ఆశలు

ABN , Publish Date - Jun 02 , 2024 | 05:12 AM

రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌ మొదలైంది. నైరుతి రుతుపవనాల విస్తరణ వేగంగా సాగుతోంది. రెండు, మూడు రోజుల్లో రాయలసీమకు వచ్చి, అతికొద్ది రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నాయి. వర్షాలు విస్తారంగా కురిస్తే పంటల సాగు ప్రారంభం కానున్నది.

Andhra Pradesh Farmer's: ఖరీఫ్‌ పై కోటి ఆశలు

సాగుకు సిద్ధమవుతున్న రైతన్న

మరో వారంలో రాష్ట్రమంతా నైరుతి

‘వర్షాలు ఆశాజనకం’..ఐఎండీ వెల్లడి

వైసీపీ ఐదేళ్ల పాలనలో వరుస నష్టాలు

అతివృష్టి, అనావృష్టితో కుదేలు

కోలుకోలేని దెబ్బతిన్న కౌలుదారు

ఈ ఏడు 86 లక్షల ఎకరాల్లో సాగు!

99,600 కోట్ల రుణాలు: బ్యాంకర్లు

నిరుడు 30%రైతులు సాగుకు దూరం

43 లక్షల ఎకరాల్లో పడని విత్తనం

కరువు మండలాల ప్రకటనలో కోత

తీవ్రంగా నష్టపోయిన లక్షలాదిమంది

ఇప్పటికీ అందని 'సాయం’

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌ మొదలైంది. నైరుతి రుతుపవనాల విస్తరణ వేగంగా సాగుతోంది. రెండు, మూడు రోజుల్లో రాయలసీమకు వచ్చి, అతికొద్ది రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నాయి. వర్షాలు విస్తారంగా కురిస్తే పంటల సాగు ప్రారంభం కానున్నది. కొద్దిరోజులుగా వేసవి దుక్కులతో పొలాలను సిద్ధం చేస్తున్న రైతులు ఖరీఫ్‌ సాగుకు అనువైన వంగడాలను సమకూర్చుకుంటున్నారు.

ప్రభుత్వ రాయితీ విత్తనాలు పూర్తిస్థాయిలో అందుతాయన్న నమ్మకం లేని కొందరు రైతులు బయట వ్యాపారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. తొలకరి వర్షాలకు పచ్చిరొట్ట ఎరువుకు ఉపయోగించే జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి విత్తనాలను ఎదజల్లడానికి రైతులు సిద్ధమయ్యారు. ఎల్‌నీనో పరిస్థితుల కారణంగా నిరుడు నైరుతీ, ఈశాన్య రుతుపవనాలు పెద్దగా ప్రభావం చూపక, ఏడాదంతా తీవ్ర వర్షాభావం కొనసాగింది. దీంతో 30%దాకా రైతులు ఖరీఫ్‌, రబీ పంటలు సాగు చేయలేకపోయారు. రెండు సీజన్లలో 43 లక్షల ఎకరాల్లో విత్తనమే పడలేదు. పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గింది.

ఈ ఏడాది ఎల్‌నీనో పోయి, రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ఆశాజనకంగా కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో నిరుడు నష్టపోయిన రైతులు ఈ ఏడాది సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే 2019-22 మధ్య రాష్ట్రంలో అతివృష్టి, వరుస విపత్తులు, 2023లో కరువు, తుఫాన్‌తో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ముఖ్యంగా కౌలు రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు.

ఈ కారణంగా ఈ ఏడాది పొలాల కౌలు రేట్లు పెద్దగా పెరగలేదు. భూసారాన్ని బట్టి కృష్ణా, గోదావరి డెల్టాలు, ఇతర కాలువలున్న ప్రాంతాల్లో ఎకరం కౌలు కింద 10 బస్తాల ధాన్యం లేదా రూ.20 వేల వరకు నగదు, మిర్చి, పత్తి సాగు చేసే ప్రాంతాల్లో ఎకరం రూ.25 - 30 వేలు, ఇతర పైర్లు వేసే చోట రూ.12 - 15 వేల మధ్య కౌలు ఒప్పందాలు జరుగుతున్నట్లు సమాచారం.


  • సాయమివ్వని జగన్‌ సర్కారు

జగన్‌ పాలనలో మొదటి నాలుగేళ్లూ తుఫాన్లు, వరదలు, అకాల వర్షాలు, ఐదో ఏడాది తీవ్ర వర్షాభావంతో కరువు పరిస్థితులు ఏర్పడి రైతులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో సాగు రంగానికి జగన్‌ సర్కార్‌ తగిన రీతిలో సాయపడలేదన్న అభిప్రాయం రైతుల్లో నెలకొంది.

  • పెరిగిన సాగు అంచనా

ఈ ఏడాది ఖరీ్‌ఫలో వరి, పత్తి, మిర్చి, అపరాలు, నూనెగింజలతో సహా 25 రకాల పంటలు 86 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని వ్యవసాయ, ఉద్యాన శాఖలు ప్రణాళికలు వేశాయి. గతేడాది కన్నా అధికంగా 4 - 5 లక్షల ఎకరాల్లో సాగు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్‌లో రూ.200 కోట్ల రాయితీతో 6.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తామని చెప్తున్నారు. ఖరీఫ్‌ పంటలకు 17.50 లక్షల టన్నుల ఎరువులను కేటాయించారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పద్ధతిలో ఈ సీజన్‌లో రూ.99,600 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది.. కౌలు రైతులకు ఖరీఫ్‌, రబీ సీజన్ల కింద కేవలం రూ.5 వేల కోట్లే ప్రతిపాదించింది. ఈ ఏడాది కౌలు రైతులకు 10 లక్షల సాగు హక్కు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. గత ఐదేళ్లూ తీవ్రంగా నష్టపోయినందున పంట రుణాలు అధికంగా ఇవ్వాలని కౌలు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

  • ఇప్పటికీ అందని సాయం

గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 450 మండలాల్లో తీవ్ర వర్షాభావం ఏర్పడి, రైతులు నష్టపోగా, జగన్‌ సర్కార్‌ కేవలం ఖరీ్‌ఫలో 103, రబీలో 87 మండలాలనే కరువు మండలాలను ప్రకటించింది. దీంతో లక్షలాది మంది రైతులు నష్టపోయారు. కరువు, తుఫాన్‌కు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పేరుతో గత మార్చి 6న సీఎం జగన్‌ ఆర్భాటంగా బటన్‌ నొక్కినా, రైతుల ఖాతాలకు మే 16 దాకా సొమ్ము జమ కాలేదు. ఈలోగా ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ‘పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు చెల్లింపులు వాయిదా వేయాలి’ అని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో ఖరీఫ్‌ కరువు, మిచౌంగ్‌ తుఫాన్‌ బాధిత రైతులకు మే మూడో వారంలో సొమ్ము చెల్లించిన ప్రభుత్వం.. రబీ నష్టానికి మాత్రం ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల చేయలేదు. నష్టం అంచనాల పేరుతో జాప్యం చేస్తోంది. గతేడాది పంటల బీమా పరిహారం కూడా రైతులకు రావాల్సి ఉంది.

Updated Date - Jun 02 , 2024 | 05:21 AM