Public Grievances : నేడు, రేపు కలెక్టర్ల సదస్సు
ABN , Publish Date - Dec 11 , 2024 | 04:05 AM
జగన్ జామానాలో జరిగిన అన్యాయాలను సరిదిద్దాలని ప్రజలు గత ఆరు నెలలుగా ప్రభుత్వానికి విన్నపాలు ఇస్తూనే ఉన్నారు. ఈ నేపధ్యంలో వాటి పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
జగన్ పాపాలపై ఫిర్యాదుల వెల్లువ
వాటికి పరిష్కారమే ప్రధాన అజెండా
గ్రామసభల విన్నపాలకు జవాబుదారీ
ఫ్రీ హోల్డ్, అసైన్డ్ సమస్యలు తీరేనా?
రీ సర్వే చిక్కులు ఇకనైనా తొలగేనా?
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జగన్ జామానాలో జరిగిన అన్యాయాలను సరిదిద్దాలని ప్రజలు గత ఆరు నెలలుగా ప్రభుత్వానికి విన్నపాలు ఇస్తూనే ఉన్నారు. ఈ నేపధ్యంలో వాటి పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఇప్పటికే గ్రామసభలు నిర్వహించిన సర్కారు, ప్రజా ఫిర్యాదులను ఆర్టీజీఎస్ పరిధిలోకి తీసుకొస్తోంది. ప్రజల భూముల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఆరోతేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. వేల సంఖ్యలో ప్రజా విన్నపాలు ఈ సదస్సుల్లో వస్తున్నాయి. ఈ నేపధ్యంలో సర్కారు బుధవారం నుంచి రెండు రోజులపాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. గత ఐదారు నెలలుగా కూటమి ప్రభుత్వానికి వచ్చిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారమే ప్రధాన అజెండాగా సర్కారు కీలక చర్యలు చేపట్టబోతుంది. ఆ అంశాలను జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించనున్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి విన్నపానికి జవాబుదారీ కల్పించేందుకు ప్రత్యేకంగా పబ్లిక్ రిడ్రెస్సెల్ గ్రీవెన్స్ సిస్టమ్‌ను (పీఆర్‌జీఎస్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు దీన్ని రియల్‌టైమ్ గవర్నెన్స్ సిస్టమ్‌తో (ఆర్‌టీజీఎస్) అనుసంధానించబోతున్నారు. ఆర్టీజీఎ్‌సలో ఉండే డేటాను ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, విభాగాధిపతులు ఎప్పుడైనా పరిశీలన చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ఆర్టీజీఎ్‌సలోకి వస్తే ఏ సమస్య ఎలా పరిష్కరించారు....ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం ఏ స్థాయిలో ఉంది....ఏ అధికారి వద్ద పెండింగ్‌లో ఉంది...ఒక వేళ పరిష్కారం అయితే, సంబంధిత వ్యక్తి స్పందన ఎలా ఉందో నేరుగా ముఖ్యమంత్రి తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ప్రజాఫిర్యాదుల పరిష్కారంలో జవాబుదారీ కోసమే ఈ ప్రక్రియకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అధికారవర్గాలు చెబుతున్నా యి. కలెక్టర్ల సదస్సులో సీఎం ఇదే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడం ద్వారా ప్రభుత్వం తమకోసం పనిచేస్తుందన్న సానుకూల దృక్పధం ఏర్పడేలా జిల్లా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అయితే, ప్రభుత్వానికి అందిన ప్రజా ఫిర్యాదుల్లో అత్యధిక శాతం రెవెన్యూశాఖ పరిష్కరించేవే ఉన్నాయి. అందులో ప్రధానమైనది భూముల సమస్య.
అసైన్డ్‌పై నిషేధం ఎత్తివేస్తారా?:
కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన మదనపల్లి ఫైల్స్ సంఘటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అసైన్డ్ భూముల ప్రీ హోల్డ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం నిలుపుదల చేసింది. తొలుత మూడు నెలలు అన్నారు. ఆ తర్వాత మరో నెల పొడిగించారు. చివరకు నవంబరులో మరో నెల పొడిగించారు. ఇది కాస్తా మంగళవారంతో ముగియనుంది. ఈసారి నిషేధం గడువు పొడిగిస్తారా? లేక ఎత్తివేస్తారా? అన్న చర్చజరుగుతోంది.
రీ సర్వే చిక్కులెన్నో?
రీ సర్వే జరిగిన పల్లెల్లో నిర్వహించిన గ్రామసభల్లో 2.71 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. సర్వే నంబర్, సరిహద్దు, భూమి విస్తీర్ణం, ఇతర తప్పులపై వేలాది ఫిర్యాదులు వెల్లువె త్తాయి. వీటిని పరిష్కరించాలంటే ఆయా గ్రామాల్లో మళ్లీ భూముల సర్వే చేయాలని అధికారవర్గాలు చెబుతున్నాయి. అది అంత సులువుగా ముగిసేది కాదని వారే చెబుతున్నారు. కాబట్టి రికార్డుల్లో సవరణలు చేస్తే సరిపోతుందని రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా చెబుతున్నారు.
తొలిరోజు అజెండాలో శాంతిభద్రతలు...
జిల్లా కలెక్టర్ల సదస్సు బుధ, గురువారాల్లో జరగనుంది. ఈ భేటీలో తొలిరోజు సాయంత్రం శాంతిభద్రతలపై చర్చ జరగనుంది. సాధారణంగా రెండో రోజు చివరి అజెండాగా ఈ అంశం చర్చించడం పరిపాటి. కానీ ఈ సారి తొలిరోజే దీన్ని చర్చించాలని అజెండాలో చేర్చారు.
‘కరువు రహితా’నికి కార్యాచరణ!
రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేందుకు జలవనరుల శాఖ సిద్ధమైంది. బుధవారం మొదలయ్యే కలెక్టర్ల సదస్సులో సీఎం వివిధ ప్రాజెక్టుల పూర్తికి గడువును నిర్దేశించే అవకాశాలు ఉన్నాయి. ఏ ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తిచేయాలనుకుంటున్నదీ జలవనరుల శాఖ నివేదించనుంది. రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబరునాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త డయాఫ్రం వాల్ పనులను జనవరి రెండున ప్రారంభించనుంది. ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులు వచ్చే ఏడాది నవంబరులో మొదలుపెట్టనుంది. చింతలపూడి ఎత్తిపోతలను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో కరువు నివారణకు నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారమని ముఖ్యమంత్రి దృఢంగా విశ్వసిస్తున్నారు.
గోదావరి-పెన్నా అనుసంధాన పథకాన్ని 2026 జూన్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. గోదావరి-బనకచర్ల అనుసంధానంలో భాగంగా మొదటి దశలో గోదావరి నుంచి కృష్ణాకు కొత్త వరద కాలువను తవ్వాలని.. పోలవరం కుడి ప్రధాన కాలువను విస్తరించాలని నిర్ణయించారు. రెండో దశలో కృష్ణా పరీవాహక ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయరులో 150 టీఎంసీలను నిల్వ చేస్తారు. మూడో దశలో బొల్లాపల్లి రిజర్వాయరు నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు నీటినిఇ తరలించడానికి నల్లమలలో 31.5 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వుతారు. వంశధార-నాగావళి అనుసంధానం కూడా చేపడతారు. గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉంటూ.. వంశధార ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు గోదావరి జలాలను వంశధార దాకా తరలించడం.. గోదావరి వైపు జలాలు తక్కువగా ఉంటే.. రివర్స్ పంపింగ్ విధానం ద్వారా వంశధార నుంచి గోదావరి వైపు నీటిని తరలించడం.. ఇలా రెండు వైపుల నుంచీ నీటిని తరలించే పథకాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు అధ్యయనం జరుగుతోంది. కలెక్టర్ల సదస్సులో వీటన్నిటిపైనా చర్చ జరుగనుంది.
విజన్ -2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ
కలెక్టర్ల సదస్సులో ఆర్థిక శాఖ ప్రజంటేషన్
2047 నాటికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ నం.1గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను బుధవారం ప్రభుత్వం..కలెక్టర్ల సదస్సులో ఆవిష్కరించనుంది. ఈ సమావేశంలో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ వివరాలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూశ్ కుమార్ వెల్లడిస్తారు. నిపుణులు, వివిధ ఏజెన్సీలు, మేధావులతో పాటు 17 లక్షలమంది నుంచి విజన్ డాక్యుమెంట్‌పై సూచనలు, సలహాలు స్వీకరించారు. అందరి అభిప్రాయాలు, ఆలోచనలను పరిగణనలోకి తీసుకుని ఈ డాక్యుమెంట్‌ను రూపొందించారు.