Share News

Guntur : టీడీపీ నాయకుడిపై వేటకొడవళ్లతో దాడి

ABN , Publish Date - Jun 28 , 2024 | 04:03 AM

పట్టపగలు వైసీపీ కార్యకర్తలు వేటకొడవళ్లతో చెలరేగిపోయారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో టీడీపీ నాయకుడు, నిమ్మగడ్డవారిపాలెం సొసైటీ మాజీ అధ్యక్షుడు కమ్మా శివప్రసాద్‌పై దాడికి పాల్పడ్డారు.

Guntur : టీడీపీ నాయకుడిపై వేటకొడవళ్లతో దాడి

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైసీపీ నేతల దారుణం

దాడి చేసిన వారిలో ఒకరు వలంటీర్‌

ప్రత్తిపాడు, జూన్‌ 27:పట్టపగలు వైసీపీ కార్యకర్తలు వేటకొడవళ్లతో చెలరేగిపోయారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో టీడీపీ నాయకుడు, నిమ్మగడ్డవారిపాలెం సొసైటీ మాజీ అధ్యక్షుడు కమ్మా శివప్రసాద్‌పై దాడికి పాల్పడ్డారు. కోర్టు ఆదేశాలతో గురువారం ప్రత్తిపాడు మంచినీటి చెరువు కరకట్టపై అక్రమ కట్టడాల తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఆక్రమణదారులంతా వైసీపీ కార్యకర్తలు. వారిలో ఒకరు వలంటీర్‌ కూడా ఉన్నారు. ఆక్రమణదారులు అడ్డుపడినా పోలీసుల సహకారంతో ఓ ఇంటి ప్రహరీ, మెట్లను అధికారులు కూల్చేశారు. దీంతో పెట్రోలు పోసుకుంటానంటూ ఓ వ్యక్తి, పురుగు మందు తాగి మరణిస్తానంటూ మరొకరు ఆత్మహత్యాయత్నం చేశారు.

‘మా ఇళ్లు పడగొట్టడానికి కారణం నువ్వే’ అంటూ కమ్మా శివప్రసాద్‌ ఇంటిపైకి వలంటీర్‌ పరమేశ్వరరావు, అతడి సోదరుడు పృఽథ్వి దాడి చేశారు. శివప్రసాద్‌ను వేటకొడవళ్లతో తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు. శివప్రసాద్‌ను స్థానికులు ప్రత్తిపాడు వైద్యశాలకు, అక్కడి నుంచి గుంటూరుకు తరలించారు. శివపవ్రసాద్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఆక్రమణలు తొలగించాలన్న కోర్టు

చెరువు ఆక్రమణలో ఉన్నదని గొట్టిపాడుకు చెందిన పచ్చల కోటేశ్వరరావు గతంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. లోకాయుక్త ఆదేశాల మేరకు అప్పటి ఇన్‌చార్జి సర్పంచ్‌ నుదురుపాటి సుశీల పంచాయతీ తీర్మానం ప్రకారం ఆక్రమణలో ఉన్న సుమారు 7 ఎకరాల భూమిని స్వాధీన పరుచుకున్నారు.

పూర్వం నుంచి చెరువు కట్ట వెంట ఉన్న ఇళ్లను కూడా ఖాళీ చేయాలంటూ పంచాయతీ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. కమ్మా శివప్రసాద్‌ పూర్తి వివరాలతో కోర్టుకు విన్నవించగా గృహాలను తీసి వేయాలని కోర్టు 2023లోనే ఆదేశాలు జారీ చేసింది.

అయితే, వైసీపీ పెద్దల ఒత్తిడితో అప్పుడు ఆ గృహాలను కూల్చి వేయలేదు. కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి డీపీవో నుంచి వచ్చిన ఉత్తర్వులతో గురువారం పంచాయతీ కార్యదర్శి జాన్‌పీరా ఆక్రమణల తొలగింపు చేపట్టగా, ఆక్రమణదారులు అడ్డుపడ్డారు. శివప్రసాద్‌పై హత్యాయత్నం జరగడంతో ఆక్రమణల తొలగింపును అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

Updated Date - Jul 08 , 2024 | 10:49 AM