Free Sand Policy : ఎవరెవరివో ఆధార్‌లతో క్యూ
ABN , Publish Date - Jul 09 , 2024 | 05:41 AM
ఉచిత ఇసుక విధానాన్ని ఎంత పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినా, అందులో చిల్లులను కొందరు సరఫరాదారులు వెతికి పట్టుకొని సొమ్ము చేసుకొనేందుకు అప్పుడే వ్యూహరచన మొదలుపెట్టారు.
ఇసుక అవసరమో, లేదో తెలియదు
లారీకి అదనంగా రూ.3 వేలట!
గుంటూరుజిల్లాలో స్టాక్‌యార్డు వద్ద
ఇసుక సరఫరాదారుల హల్‌చల్
గుంటూరు, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఉచిత ఇసుక విధానాన్ని ఎంత పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినా, అందులో చిల్లులను కొందరు సరఫరాదారులు వెతికి పట్టుకొని సొమ్ము చేసుకొనేందుకు అప్పుడే వ్యూహరచన మొదలుపెట్టారు. గుంటూరు జిల్లాలోని ఐదు స్టాక్‌యార్డుల వద్దకు ఇప్పటికే వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు క్యూ కట్టాయి. ప్రతీ వాహనదారుడి వద్ద ఎవరెవరివో ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్లు, చిరునామాలు ఉన్నాయి. వాటిని చూపించి ఇసుక లోడింగ్ చేయాల్సిందిగా కోరుతున్నారు. అయితే లారీ డ్రైవర్లు సమర్పిస్తున్న ఆధార్, ఫోన్ నంబర్లు కలిగిన వారికి వాస్తవంగా ఇసుక అవసరమో, లేదో తెలియని పరిస్థితి. ఉచిత ఇసుక విధానంలో రోజుకు 20 టన్నుల వరకు ఇసుకని ఉచితంగా స్టాక్‌యార్డు నుంచి తీసుకెళ్లొచ్చన్న ఒక్క నిబంధన ఉంది.
దాన్ని ఆసరాగా చేసుకొని సరఫరాదారులు సొమ్ము చేసుకొనే పనిలో పడ్డారు. వివరాల్లోకి వెళితే.... గుంటూరు జిల్లాలో తాళ్లాయపాలెం, లింగాయపాలెం, మున్నంగి, కొల్లిపర, గుండిమెడలో స్టాక్‌యార్డులు ఉన్నాయి. వీటిల్లో ఇసుక నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ ఐదు చోట్లే దాదాపుగా 9 లక్షల 25 వేల 372.45 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉన్నది. గుంటూరు జిల్లాలో నిర్మాణ రంగ అవసరాలకు ఈ నిల్వలు సుమారు రెండు నెలలకు పైగా సరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కొందరు ఇసుక సరఫరాదారులు ఉచిత ఇసుక విధానంలోనూ ప్రవేశించి సొమ్ము చేసుకొనేందుకు వ్యూహరచన చేస్తున్నారు.
తొలుత తమ కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లు, మొబైల్ నెంబర్లను స్టాక్‌యార్డులో ఇచ్చి టన్నుకు రూ. 250 చొప్పున లోడింగ్ చార్జీలు చెల్లించి గుంటూరు నగరానికి తీసుకొచ్చి బ్లాక్‌లో అమ్మేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 20 టన్నులకు స్టాక్‌యార్డు వద్ద రూ. 5,000 చెల్లిస్తే సరిపోతుంది. ఇక రవాణ చార్జీలు 45 కిలోమీటర్ల వరకు అయితే 10 టైర్ లారీకి రూ. 7,500, 12 టైర్ లారీకి అయితే రూ. 8 వేలు నిర్ణయించారు. ఆ మేరకు రూ. 12,500 నుంచి రూ. 13 వేల వరకు అవుతుంది. ఈ మొత్తానికి అదనంగా మరో రూ. 3 వేలకు పైగా జోడించి రూ. 15,500 నుంచి రూ. 16 వేలకు లారీ ఇసుకని విక్రయించేందుకు నిమగ్నమయ్యారు. గతంలో ఏదైనా నిర్మాణం జరుగుతుంటే దానికి సంబంధించిన బిల్డింగ్ ప్లాన్ జత చేయమనేవారు. దాని ప్రకారం ఆ భవన నిర్మాణానికి ఇసుక ఎంత అవసరమౌతుందో లెక్కించి ఆ మేరకు సరఫరా చేసేవారు. ఇప్పుడు ఎలాంటి నిబంధన లేకుండా కేవలం ఆధార్ నంబరు ఉంటే చాలు రోజుకు 20 టన్నుల ఇసుక తీసుకెళ్లొచ్చన్న నిబంధన దుర్వినియోగమయ్యే ప్రమాదముంది.