Share News

YSRCP: ఏం మైండ్‌రా అయ్యా.. వైసీపీ నేత ప్లాన్ తెలిస్తే ప్యాంట్ తడవాల్సిందే..

ABN , Publish Date - Dec 12 , 2024 | 01:49 PM

తాను బెదిరించి లొంగదీసుకున్న మహిళతో ఆమె భర్తను హత్య చేయించేందుకు ఓ వైసీపీ నేత అమాయకుడైన ఓ బిక్షగాడిని హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో

YSRCP: ఏం మైండ్‌రా అయ్యా.. వైసీపీ నేత ప్లాన్ తెలిస్తే ప్యాంట్ తడవాల్సిందే..
Guntur YSRCP Leader

గుంటూరు, డిసెంబరు 12: తాను బెదిరించి లొంగదీసుకున్న మహిళతో ఆమె భర్తను హత్య చేయించేందుకు ఓ వైసీపీ నేత అమాయకుడైన ఓ బిక్షగాడిని హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంకు చెందిన ఆ పార్టీ నేత దేవరకొండ నాగేశ్వరరావు అలియాస్ ఓంకార్ సాగించిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇతని ఆరాచకాలపై బాధిత కుటుంబం ఈ నెల 2న గుంటూరు జిల్లా ఎస్సీని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాధితులు పిన్నాదుతో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఓ కేసు, మహిళా పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు చేశారు. ఎస్సీ కార్యాలయాన్ని ఆశ్రయించిన తర్వాత కేసులైతే నమోదు చేశారు గానీ ఇంతవరకు నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు. ఇప్పటికీ కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బాధిత కుటుంబం నిర్వహించే దుకాణం వద్ద, ఇంటి సమీపంలో రెకీ నిర్వహిస్తుండటంతో ఆ కుటుంబం హడలిపోతోంది.


బాధిత మహిళ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకలూరిపేట రోడ్డులో దుకాణం నిర్వాహకురాలిని లొంగదీసుకునేందుకుగానూ నిందితుడు నాగేశ్వరరావు తన అనుచరులతో మూడు దఫాలు దొంగతనాలు చేయించాడు. బాధిత మహిళ నగరంపాలెం స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసులు కూడా నమోదు చేశారు. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.


హత్య చేయించడానికి ఎన్నో ప్రయత్నాలు..

ఓ మహిళను లొంగదీసుని వారు ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను అడ్డుపెట్టుకొని ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఆమె ద్వారానే ఆమె భర్తను హత్య చేయించేందుకు ఆ వైసీపీ నేత కుట్ర పన్నాడు. ఇందుకు గానూ ఓ బిక్షగాడిని కడతేర్చాడు. భర్తను చంపకపోతే ఆమెను, ఆమె పిల్లల్ని చంపేస్తానంటూ బెదిరించాడు. ఎవరికి అనుమానం రాకుండా, చేతికి మట్టి అంటకుండా ఎలా చంపాలి అనేది ఆమెకు తెలియజెప్పడానికి ఏకంగా ఓ బిక్షగాడిని సైనెడ్ ఇచ్చి చంపేసినట్లు బాధిత మహిళ ఆరోపిస్తుంది. చిలకలూరిపేట వెళ్లే జాతీయ రహదారిపై కాటూరి మెడికల్ కళాశాల సమీపంలోని సర్వీసు రోడ్డులో ఓ బిక్షగాడు గోనె పట్టాలతో డేరా కట్టుకొని నివాసం ఉండేవాడు. దారిన వచ్చి పోయేవారు ఇచ్చే వాటితో కడుపు నింపుకునేవాడు. అయితే వైసీపీ నేత నాగేశ్వరరావు ఓ బంగారు షాపులో పనిచేసే వ్యక్తి వద్ద నుంచి సైనెడ్ తెప్పించి బిక్షగాడికి నీటిలో కలిపి తాగించాడు. దీంతో అతను చనిపోయాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని తన సెల్ ఫోన్లో వీడియో తీసి ఆమెకు చూపించాడు. ఇదే విధంగా ఆమె భర్తను చంపాలని ఆమెను బెదిరించాడు. దీంతో భయపడిన మహిళ తన భర్తకు ఆహారంలో సైనెడ్ కలిపింది. అయితే ఆ ఆహారం నోట్లో పెట్టుకోగానే వికారంగా ఉండటంతో భర్త దానిని ఊసేశాడు. దీంతో ఏమాత్రం అనుమానం రాకుండా ఆమె వెంటనే ఆహార పదార్థాలను బయట పడేసింది. ఈ ప్రయత్నం విఫలం కావడంతో ఆ తర్వాత విజయవాడలో కుక్కలు పట్టుకునే వారి వద్ద నుంచి తీసుకొచ్చిన ఇంజక్షన్ ఆమెకు ఇచ్చి భర్త నిద్రపోయే సమయంలో చేయాలంటూ బెదిరించాడు. కానీ ఆమె ఇంజక్షన్ చేయలేకపోయింది. భర్తతో ద్విచక్ర వాహనంపై వచ్చే సమయంలో నీ చేతిలో ఉన్న సంచి కింద పడేసుకుంటే దానికోసం బండి ఆపుతాడని, ఆ సమయంలో తాము వచ్చి అతనికి ఇంజక్షన్ గుచ్చి వెళ్తామని చెప్పాడు. ఆ విధంగా చేయాలని నాగేశ్వరావు ఒత్తిడి తెచ్చినా బాధిత మహిళ అంగీకరించలేదు. దీంతో హత్య చేయడానికి నాగేశ్వరావు తన అనుచరులతో స్వయంగా రంగంలోకి

దిగాడు.


చంద్రబాబుపై కోడిగుడ్లతో దాడి..

2011లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు వెంగళాయపాలెం వచ్చిన సందర్భంలో తన అనుచరులతో చంద్రబాబుపై కోడిగుడ్లతో దాడి చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి నేనులోనూ పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


కబ్జాలు.. ఆరాచకాలు

దేవరకొండ నాగేశ్వరరావు వెంగళాయపాలెంలో వైసీపీ నాయకుడుగా చలామణి అవుతూ గ్రామంలో కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడిన సందర్భాలు అనేకం ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో రోడ్డు పక్కన వాగు పోరంబోకులో అనుమతి లేకుండా ఇంటిని నిర్మించాడు. అందులో కొంతకాలం వైసీపీ కార్యాలయం నిర్వహించాడు. ఎన్ని నేరాలు చేసినప్పటికీ పోలీసులు మాత్రం కేసులం నమోదు చేయడంలేదు. ఆయన్ను పట్టుకునేందుకు కనీస ప్రయత్నం కూడా చేయడంలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 12 , 2024 | 01:49 PM