Pawan Kalyan: సమస్యలపై డిప్యూటీ సీఎంకు మెురపెట్టుకున్న ఏపీ క్యాబ్ డ్రైవర్లు..
ABN , Publish Date - Aug 07 , 2024 | 09:33 AM
హైదరాబాద్‌లో ఏపీ క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ సంఘం ప్రతినిధులు పవన్‌కు అర్జీలు సమర్పించారు. తెలంగాణలో ఏపీ వాహనాలు తిరిగేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయనకు మెురపెట్టుకున్నారు. దీంతో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబం గడవడం కూడా కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. అందుకు అనుగుణంగా పలు సమస్యల పరిష్కార దిశగా పావులు కదుపుతోంది. ముఖ్యంగా ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని తెచ్చి ఆ సమస్య తీర్చింది. దీని వల్ల ప్రజలు సహా నిర్మాణ రంగ కార్మికులకు ఎంతో లబ్ధి చేకూరుతోంది. అలాగే అమరావతి రైతుల పోరాటాన్ని ప్రశంసిస్తూ వారికి తగిన న్యాయం చేస్తోంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి సమస్యలు విన్నవించేందుకు ప్రజలు భారీ ఎత్తున కూటమి ఎమ్మెల్యేలు, మంత్రుల వద్దకు క్యూ కడుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రతి రోజూ వందల కొద్ది అర్జీలు వస్తున్నాయి.
పవన్‌ను కలిసిన ఏపీ క్యాబ్ డ్రైవర్లు..
మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రజాదర్బార్‌లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సమస్యలు విన్నవించేందుకు అర్జీదారులు పోటీ పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని పవన్ నేరుగా కలిశారు. వారి సమస్యలు ఓపికగా విని పరిష్కార దిశగా చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో ఏపీ క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ సంఘం ప్రతినిధులు పవన్‌కు అర్జీలు సమర్పించారు. తెలంగాణలో ఏపీ వాహనాలు తిరిగేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయనకు మెురపెట్టుకున్నారు. దీంతో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబం గడవడం కూడా కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాబ్ డ్రైవర్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు సహకరించుకోవాలని డిప్యూటీ సీఎం హితవు పలికారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
అమెరికాలో విద్య పేరుతో కన్సల్టెన్సీ మోసం చేసిందని ఓ విద్యార్థిని డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేసింది. విద్యార్థినిని మోసం చేసిన కన్సల్టెన్సీపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో ఆయన స్వయంగా మాట్లాడి వారి సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. సంబంధిత సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.