‘భారతి’ కొంగు బంగారమే
ABN , Publish Date - Oct 30 , 2024 | 05:30 AM
వ్యాపారం చేయడం, పరిశ్రమలు పెట్టి విజయం సాధించడం అంత సులభం కాదు. ఎంతో శ్రమ, ఆర్థికంగా ఒడిదొడుకులు, పన్నులు, అప్పులు..
రఘురామ్ నుంచి భారతిగా మారగానే
పెట్టుబడులతో దిగ్గజ కంపెనీల బారులు
2010లో సిమెంట్ రంగం తిరోగమనం
అదే ఏడాది భారతిలో 51శాతం
వాటాలను భారీ విలువకు కొన్న వికాట్
జగన్ ప్రమోటరుగా 2006లో ప్రారంభం
ఆయనకు ఉన్న 82ు వాటా విలువ 45 కోట్లు
అందులో 51 శాతం వాటాకు
వికాట్ చెల్లించింది రూ.415 కోట్లు
నాడు మార్కెట్ విలువ ఏకంగా 2,300 కోట్లు
జగన్‌కు ఈ డీల్ నిజంగానే జాక్‌పాట్
దాల్మియా, ఇండియా సిమెంట్స్‌దీ ఇదే దారి
తండ్రి వైఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని
ఆ ఐదేళ్లు సాగిన జగన్మాయలెన్నెన్నో..
(అమరావతి - ఆంధ్రజ్యోతి )
వ్యాపారం చేయడం, పరిశ్రమలు పెట్టి విజయం సాధించడం అంత సులభం కాదు. ఎంతో శ్రమ, ఆర్థికంగా ఒడిదొడుకులు, పన్నులు, అప్పులు.. ఇంత చేసినా పదిశాతం మిగలదు. ఇదంతా సక్రమంగా వ్యాపారాలు చేసేవారికి మాత్రమే వర్తించే సూత్రం! కానీ... అధికారాన్ని, పరుల సొమ్మును ‘పెట్టుబడి’గా చేసుకునే జగన్‌కు ఇవి వర్తించవు. భారతి సిమెంట్స్‌లో రూ.45 కోట్ల పెట్టుబడి కాస్తా... మూడు నెలలు తిరగకుండానే రూ.3,053 కోట్లకు చేరిపోయింది. జగన్ దంపతులకు ఏడాదికి రూ.500 కోట్లకు పైగా ఆస్తులు సమకూర్చే బంగారుబాతుగా మారిపోయింది. స్థాపించి ఏడాది కాకుండానే.. పెట్టుబడులు పెడతామంటూ దిగ్గజ ప్రారిశ్రామికవేత్తలు పోటీ పడ్డారు. మూడేళ్లు తిరిగే సరికి ఒక విదేశీ కంపెనీ ఏకంగా మెజారిటీ వాటా 51 శాతం కొనుగోలు చేసింది. ఇలా.. కొద్ది సంవత్సరాల్లోనే వందలకోట్ల వ్యాపారం చేయడం పారిశ్రామిక దిగ్గజ సంస్థల యాజమాన్యాలకు సైతం సాధ్యం కాలేదు. కానీ, జగన్మోహన్‌రెడ్డి ప్రమోటర్‌గా భారతి సిమెంట్స్‌ను స్థాపిస్తానంటూ ప్రకటించడంతోనే, ‘అధికారం’ అంటే ఏమిటో చూపించారు.
జాక్‌పాట్ డీల్...
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా, 2006లో రఘురాం సిమెంట్స్ కాస్త భారతి సిమెంట్స్‌గా రూపాంతరం చెందింది. ఆ వెంటనే దిగ్గజ సంస్థలన్నీ భారీగా పెట్టుబడులు పెట్టాయి. సిమెంట్ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేకత కలిగిన ప్రఖ్యాత కంపెనీలు ఇండియా సిమెంట్స్, దాల్మియా వంటి కంపెనీలు భారతి సిమెంట్స్ షేర్లను కొనుగోలు చేశాయి. 2010లో విదేశీ కంపెనీ వికాట్...భారతి సిమెంట్స్‌లో మెజారిటీ షేర్లు 51 శాతం మేర 415 కోట్లు చెల్లించి కొనేసింది. ఈ మేరకు ఒప్పందం ఫ్రాన్స్‌లో జరిగింది. ఈ లావాదేవీకి సంబంధించి 2010-11 ఆర్థిక సంవత్సరానికిగాను జగన్మోహనరెడ్డి రూ.64కోట్ల ఆదాయపు పన్ను చెల్లించారు. ఈ ఒప్పందం జరిగేనాటికి అంటే 2010లో 25 లక్షల టన్నుల ఉత్పత్తి సామార్థ్యానికి, మరో ఏడాదినాటికి ఇంకో 25 లక్షల టన్నుల సామర్థ్యానికి పెంచుతామని వికాట్ ప్రకటించింది. ఇలా 50 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన భారతి సిమెంట్స్ మొత్తం విలువను రూ.4,600 కోట్లుగా నిర్ధారించారు. అప్పట్లోనే వికాట్ కైవసం చేసుకున్న 51 శాతం వాటాకు మార్కెట్ విలువ రూ.2,346 కోట్లు ఉంది. అమ్మిన వాటా మొత్తం జగన్‌కు చెందినవేనని ఇప్పుడు చెబుతున్నారు. అతితక్కువ పెట్టుబడితో భారతి సిమెంట్స్‌ను ప్రమోట్ చేసిన జగన్‌కు ఈ డీల్ జాక్‌పాట్ లాంటిదని మార్కెట్ వర్గాలు అప్పట్లోనే వెల్లడించాయి. భారతిలో 82 శాతం వాటా కోసం జగన్ గ్రూప్ నికరంగా పెట్టిన పెట్టుబడి మొత్తం రూ.45 కోట్లు. ఈ వాటా విలువ ఇప్పుడు రూ.3700 కోట్లు.. 51 శాతం వాటా కోసం ఆయన ఇన్వెస్ట్ చేసిన మొత్తం సుమారు 28 కోట్ల రూపాయలు అవుతుందని అనుకున్నా .. ఇప్పుడు లభించిన రూ.2,300 కోట్లు (మార్కెట్ విలువ) అంటే అనేక రెట్లు ఎక్కువని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో అధికార పలుకుబడిని ఉపయోగించి భారతి సిమెంట్స్‌కు భారీ ఎత్తున ఈక్విటీని , రుణాలను జగన్మోహనరెడ్డి సమీకరించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. భారతి సిమెంట్స్ ఈక్విటీ షేర్లు ఐదున్నర కోట్లున్నాయి. పది రూపాయల ముఖవిలువకే నాలుగున్నర కోట్ల భారతి సిమెంట్ వాటాలను జగన్, ఆయన కంపెనీలు తీసుకున్నాయి. మిగతా షేర్లను దాల్మియా సిమెంట్, ఇండియా సిమెంట్స్ వంటి సంస్థలు, మ్యాట్రిక్స్ ప్రసాద్ వంటి వ్యాపార ప్రముఖులు ఒక్కో షేరుకు 94-175 రూపాయల రేటుతో కొనుగోలు చేయడం గమనార్హం. దాల్మియా సిమెంట్స్ మాత్రం తర్వాత రెండు లక్షల షేర్లను రూ.1,440 రేటుతో కొనుగోలు చేసింది
అంత విలువ ఎలా?
భారతి సిమెంట్స్ కోసం లక్ష రూపాయలకు ఒక ఎకరా చొప్పన 487 ఎకరాలను రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేటాయించింది. 1400 ఎకరాల్లో విస్తరించి ఉన్న సున్నపురాయి గనుల లీజులను భారతి సిమెంట్స్ పొందింది. ఉత్పత్తి ప్రారంభించి ఏడాది తిరక్కముందే భారతి సిమెంట్స్ వాల్యూయేషన్‌ను పొందగలిగింది. గతంలో రాష్ట్రానికి చెందిన ‘మైహోం సిమెంట్స్’లో ఐర్లాండ్ కంపెనీ సీఆర్‌హెచ్ 50 శాతం వాటా తీసుకున్నప్పుడు కూడా టన్ను 213 డాలర్ల రేటుతో మదింపు చేశారు. మైహోమ్ సిమెంట్స్ వాటాల విక్రయ సమయంలో సిమెంట్ రంగం అసాధారణ బూమ్‌లోఉంది. భారతి సిమెంట్స్ రంగంపైకి వచ్చేనాటికి డజన్లకొద్దీ కంపెనీలు విస్తరించి.. వాల్యూయేషన్ విలువ బాగా తగ్గిందని నిపుణులు వెల్లడించారు. కొత్త ప్రాజెక్టులు, పాత సంస్థలు చేపట్టిన విస్తరణ వల్ల రాష్ట్రంలో సిమెంట్‌కు భారీ మిగులు ఏర్పడిన పరిస్థితుల్లోనూ భారతి సిమెంట్స్ విషయంలో.. అధిక ధరలకు వాల్యూయేషన్ కట్టడంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అంత లాభమా..?
రూ.45 కోట్ల పెట్టుబడి ఒక్క ఏడాదిలో రూ.3053 కోట్లకు చేరడం సాధ్యమా? కంపెనీ ఏర్పాటు కాకముందే... ‘మేం పెట్టుబడులు పెడతాం’ అంటూ పారిశ్రామికవేత్తలు పోటీపడటం చిత్రం కాదా? నానా అగచాట్లు పడితేగానీ దక్కని అనుమతులు, గనులు ఇలా చిటికెల మీద వచ్చి పడిపోవడం అసాధారణ పరిణామం కదా? ఇవన్నీ... భారతి సిమెంట్స్ విషయంలో జరిగాయి! తరతరాలుగా పరిశ్రమలు నిర్వహిస్తున్న వారు సాధించని విజయాలు భారతి సిమెంట్స్ రోజులూ, నెలల్లోనే సాధించింది! దీనికి కారణం ఏమిటి? జగన్ శ్రమ, మేథస్సే కారణమా? అని ప్రశ్నిస్తే కానే కాదని సీబీఐ, ఈడీ వంటి సంస్థలు ఎప్పుడో తేల్చాయి.
ఉత్పత్తి ప్రారంభించకుండానే.. ప్రతిఫలం
2007లో భారతీ సిమెంట్ పెట్టిన జగన్ 2009 ఆగస్టు 27న తన వాటా నుంచి 2,27,584 షేర్లను ఒక్కొక్కటీ రూ.1,450 ధరకు మ్యాట్రిక్స్ ప్రసాద్‌కు చెందిన అల్ఫావిల్లాస్ ప్రైవేటు లిమిటెడ్, అల్ఫా ఎవెన్యూస్ ప్రై.లిమిటెడ్ సంస్థలకు విక్రయించారు. జగన్‌కు రూ.33 కోట్లు దక్కాయి. భారతీ సిమెంట్స్ ఉత్పత్తిని ప్రారంభించక ముందే జగన్‌కు దక్కిన ప్రతిఫలం అది. ఈ మొత్తంతో జగన్ పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చేసింది. విక్రయించిన ఈ షేర్లు జగన్ వాటాలో ఒక శాతం కంటే తక్కువే.
గనులన్నీ ‘భారతి’కే..
ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆయన కుమారుడు జగన్‌కు చెందిన భారతి సిమెంట్స్‌లోకి అక్రమ పెట్టుబడులు రప్పించేందుకు దందాసాగింది. నాటి గనుల శాఖ డైరెక్టర్ వి.రాజగోపాల్ పక్కా స్కెచ్‌తో సాగిన అడ్డగోలు దోపిడీ బాగోతం అప్పట్లో విమర్శలకు కేంద్ర బిందువైంది. వైఎస్ కుటుంబం తమకు సన్నిహితంగా ఉండే సజ్జల కుటుంబాన్ని వినియోగించుకుని సాగించిన అక్రమాలు బయటకు వచ్చాయి. నాటి గనుల శాఖ సంయుక్త కార్యదర్శి ఎ.దయాకర్‌రెడ్డి, సూపరింటెండెంట్ కె.వెంకట్రావు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాలతో.. ఆనాడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లుగా తేలింది. జయా సిమెంట్స్ (భరత్ లిమిటెడ్) చేతికి అడ్డగోలుగా లీజును మార్చేశారు. కడప జిల్లా నవాబుపేట తాలమంచిపట్నంలో 1,017 ఎకరాల సున్నపురాయి నిక్షేపాల ప్రాస్పెక్టింగ్ లీజుకోసం 1997లో జయా మినరల్స్ దరఖాస్తు చేసుకుంది. నాటి గనుల శాఖ జేడీ మేనకేతన్‌రెడ్డి ఈ సంస్థకు సిమెంట్ ప్లాంటు ఏర్పాటు చేసే యోగ్యత లేదని స్పష్టంచేశారు. దరఖాస్తుదారుడి వివరణ కోరారు. కానీ స్పందన లేదు. 2004లో ఈ ఫైలు ఒక్కసారిగా కదిలింది. ఇదే సంస్థ నుంచి మరో దరఖాస్తును స్వీకరించారు. ఎన్నో ఏళ్లుగా స్పందించని కంపెనీకి ప్రాస్పెక్టింగ్ లైసెన్సు మంజూరు చేసేలా రాజగోపాల్ ప్రతిపాదనలు పంపారు. దరఖాస్తు చేసిన జయా మినరల్స్‌కు కాకుండా.. ఈశ్వర్ సిమెంట్స్‌కు బదిలీ చేయాలని విచిత్ర షరతు విధించడం గమనార్హం. తర్వాత ఈ గనులు ఈశ్వర్ నుంచి రఘురామ్‌కు, దాని పేరు మారాక భారతి సిమెంట్స్‌కు బదిలీ అయ్యాయి.
ఇది కూడా చదవండి:
వంశీ కోసం.. లాయర్ వేషం
పెట్టుబడులకు ఇదే మంచి సమయం ఏపీకి రండి
జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరుగుతున్నాయ్