Chandrababu: కాంబోడియాలో చిక్కుకున్న యువతను కాపాడాలి: చంద్రబాబు
ABN , Publish Date - May 25 , 2024 | 11:08 AM
కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువతను కాపాడాలని టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. మానవ అక్రమ రవాణాకు ఏపీ కేంద్రంగా మారడం ఆందోళనకరమని ఆయన ఎక్స్(ట్విటర్) వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. 150మందిని స్వదేశానికి తీసుకొచ్చేలా సహాయపడాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు.
అమరావతి, మే 25: కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువతను కాపాడాలని టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మానవ అక్రమ రవాణాకు ఏపీ కేంద్రంగా మారడం ఆందోళనకరమని ఆయన ఎక్స్(ట్విటర్) వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. 150మందిని స్వదేశానికి తీసుకొచ్చేలా సహాయపడాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాల పేరుతో రాష్ట్ర యువతను అక్రమంగా కాంబోడియా తరలించి సైబర్ నేరాల ఉచ్చులోకి నెట్టారన్నారు. యువతను నాశనం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే..?
రాష్ట్రంలో యువత ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాకపోవడంతో నిరాశలో కూరుకుపోతున్నారు. ఇదే అదునుగా మంచి జీతం, విదేశాల్లో ఉద్యోగాలంటూ కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. ఇదే తరహాలో కాంబోడియా సైబర్ నేరగాళ్ల వలకు దేశ యువత చిక్కారు. సుమారు 5వేల మంది యువత వారి చేతిలో చిక్కినట్లు తెలుస్తోంది. అందులో 150మంది తెలుగు యువత ఉన్నారు. నిరుద్యోగులను కాంబోడియా తీసుకువెళ్లిన ఏజెంట్లు వారిని సైబర్ నేరగాళ్లకు అప్పగించారు. వారిని బంధీలుగా చేసుకుని చిత్రహింసలకు గురిచేస్తూ వారితో సైబర్ నేరాలు చేయిస్తున్నారు. నేరాలకు పాల్పడకపోతే ఆహారం, మంచి నీళ్లు ఇవ్వకుండా చీకటి గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. త్వరితగతిన చర్యలు చేపట్టి బాధితులను త్వరగా స్వదేశానికి తరలించాలని ఎక్స్ వేదికగా చంద్రబాబు కేంద్రాన్ని కోరారు.
For more Andhrapradesh news and Telugu news...