CM Chandrababu: ఆ మహానీయుడి వల్లే ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోంది: సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Dec 25 , 2024 | 10:59 AM
ఆంధ్రప్రదేశ్: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి సందర్భంగా ఎన్డీయే అగ్రనేతలు ఆయనకు ఘటనివాళులు అర్పించారు. ఢిల్లీలోని 'సదైవ్ అటల్' స్మారక చిహ్నం వద్ద ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు నేతలు నివాళులు అర్పించారు.
అమరావతి: భారతజాతి గర్వించదగిన నేత భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. ఇవాళ (బుధవారం) అటల్ బిహారీ వాజ్ పేయి (Atal Bihari Vajpayee) శతజయంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు ఘననివాళులు అర్పించారు. ఢిల్లీ (Delhi)లోని 'సదైవ్ అటల్' స్మారక చిహ్నం వద్ద మాజీ ప్రధానికి ఘటన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అటల్ బిహారీ వాజ్ పేయిని ప్రశంసిస్తూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. దేశానికి వాజ్ పేయి చేసిన సేవలు స్మరించుకున్నారు. గతంలో ఆయనతో దిగిన ఫొటోను షేర్ చేశారు.
సీఎం చంద్రబాబు ట్వీట్ ఇదే..
"భారతజాతి గర్వించదగిన నేత, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి సందర్భంగా ఘననివాళులు అర్పిస్తున్నా. దేశగతిని మార్చిన వాజ్ పేయి దూరదృష్టి కారణంగానే నేడు ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోంది. అన్ని రంగాల్లో వృద్ధి సాధిస్తూ సగర్వంగా తలెత్తుకు నిలబడుతోంది. 'నేషన్ ఫస్ట్' అని ఎప్పుడూ భావించే ఆయనతో కలిసి పనిచేసిన అనుభూతి నాకు చిరకాలం గుర్తుండిపోతుంది. దేశం గురించి ఆయన ఆలోచించే తీరు విలక్షణమైనది. దానికి ఆధునికత, సాంకేతికత జోడించాలని సూచించినప్పుడు, సంస్కరణల గురించి ప్రతిపాదనలు చేసినప్పుడు ఆయన స్పందించిన తీరు నేను ఎన్నటికీ మరచిపోలేను. రాజనీతిజ్ఞులు, ప్రాత:స్మరణీయులు భారతదేశ ముద్దుబిడ్డ అటల్ జీకి ఘన నివాళి అర్పిస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు.
మంత్రి లోకేశ్ ట్వీట్..
"మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళలు అర్పిస్తున్నా. దేశప్రగతి కోసం నిరంతరం తపించిన వ్యక్తి వాజ్ పేయి. తన నాయకత్వంతో నవ భారత నిర్మాణానికి బాటలు వేశారు. ఐటీ, టెలికాం, కమ్యూనికేషన్ రంగాల్లో దేశం గొప్ప పురోగతి సాధించేందుకు విశేషంగా కృషిచేశారు. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు ద్వారా దేశ రూపురేఖలు మార్చారు. ఆయన దూరదృష్టితో దేశం వికసిత్ భారత్ దిశగా ముందడుగు వేస్తోంది. పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించి భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటారు. రాజకీయాల్లో గొప్ప విలువలు నెలకొల్పారు. వాజ్ పేయి ఆయన ఆశయసాధనకు పునఃఅంకితం అవుదాం.. అదే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి" అంటూ ట్వీట్ చేశారు.
ఢిల్లీ పర్యటన..
కాగా, ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నేడు భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం భేటీ కానున్నారు. అలాగే సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా, నిధుల కేటాయింపులపై ప్రధాని, అమిత్ షాలతో సీఎం చర్చించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏపీకి ప్రయోజనాలు కలిగేలా చంద్రబాబు వారితో చర్చలు జరపనున్నారు. అంతకుముందు మధ్యాహ్నం 12:30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరగనున్న ఎన్డీయే నేతల సమావేశంలో సీఎం పాల్గొంటారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ భేటీ కానున్నారు. ఢిల్లీలోని చంద్రబాబు అధికారిక నివాసంలో కేంద్ర మంత్రి కుమారస్వామి ఆయన్ని కలవనున్నారు. కేంద్ర మంత్రితో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Today Gold Rates: గుడ్ న్యూస్.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Hanumakonda: ఇంటర్ మెుదటి సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్య.. విషయం ఇదే..