Share News

కూటమిలో చిటపటలు

ABN , Publish Date - Nov 03 , 2024 | 04:56 AM

కూటమి ప్రభుత్వంలో అగ్ర నాయకులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నా... కింది స్థాయి నేతల్లో అక్కడక్కడ సఖ్యత లోపిస్తోంది.

కూటమిలో చిటపటలు
TDP And Janasena Party Leaders

కొన్నిచోట్ల రచ్చకెక్కుతున్న తమ్ముళ్లు, సైనికులు

క్షేత్రస్థాయిలో చిన్న విషయాలకే గొడవలు

గోదావరి జిల్లాల్లో చేయిదాటుతున్న పరిస్థితులు

ఫొటోలు, కండువాల విషయంలో రచ్చ

పలుచోట్ల ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని

టీడీపీ, జనసేన పార్టీల నేతల్లో అసంతృప్తి

కొత్తగా వస్తున్న వైసీపీ నేతలతోనూ సమస్యలు

అగ్రనాయకులు కల్పించుకుని సమన్వయ

కమిటీలు వేయాలని సీనియర్ల సూచనలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కూటమి ప్రభుత్వంలో అగ్రనాయకులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నా... కింది స్థాయి నేతల్లో అక్కడక్కడ సఖ్యత లోపిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చేజారిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు, జనసైనికుల మధ్య గ్యాప్‌ పెరుగుతోంది. ఎన్నికల సమయంలో ఉన్న సమన్వయం ఇప్పుడు కొరవడుతోంది. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. అగ్రనేతలు కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతే చిలికి చిలికి గాలివానగా మారే ప్రమాదం లేకపోలేదు. గ్రామ స్థాయి నుంచి ప్రారంభమైన అంతరం మండల స్థాయికి, ఇప్పుడు నియోజకవర్గ స్థాయి నాయకుల వరకూ చేరింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొన్నిచోట్ల తమ్ముళ్లు, జనసైనికులు బాహాబాహీకి దిగుతున్నారు. పలుచోట్ల ఎమ్మెల్యేలపైనా విమర్శలు వస్తున్నాయి. కాకినాడ రూరల్‌, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు టీడీపీ నాయకులను దూరం పెడితే.. ఎర్రగొండపాలెంతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలున్న పలు నియోజకవర్గాల్లో జనసేన నాయకులను పట్టించుకోవడం లేదు. ఇలాంటి చోట్ల నాయకులు లోలోపల రగిలిపోతున్నారు. సమన్వయం పాటించమని అగ్రనాయకులు కోరడంతో వెనక్కి తగ్గుతున్నారు. టీడీపీ, జనసేన నాయకుల్లో సఖ్యత లోపం ఇరు పార్టీలను కలవరపాటుకు గురి చేస్తోంది.


TDP-2.jpg


చిన్న విషయాలకే రచ్చ

కూటమిలో మూడు పార్టీలు ఉన్నందున నేతలు సర్దుకుపోవాలి. అక్కడక్కడా సమన్వయం పాటించకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన చిన్న సంఘటనే ఇందుకు ఉదాహరణ. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థికి సంబంధించిన సమావేశంలో కొంతమంది టీడీపీ నాయకులు జనసేన పార్టీ కండువా వేసుకోలేదు. దీంతో జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు. వాస్తవంగా అయితే ఇది చాలా చిన్న సమస్య. ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కండువాలు అందరూ కప్పుకొన్నారు. ఇప్పుడు కూడా జనసేన శ్రేణులు అభ్యంతరం తెలపగానే టీడీపీ నాయకులు జనసేన పార్టీ కండువాలు ధరించి ఉంటే ఎలాంటి సమస్య ఉండేది కాదు. ఈ చిన్న విషయానికే ఇరువర్గాల వారికి మాటామాట పెరిగి రచ్చకెక్కారు. పెద్దాపురం నియోజవర్గంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఒక కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడి ఫొటో ముద్రించలేదనే విషయంలో స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సమక్షంలో తెలుగు తమ్ముళ్లు, జనసైనికుల మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు కాకినాడ ఎంపీ ఉదయ్‌ శ్రీనివా్‌సకు వ్యతిరేకంగా కొంత మంది టీడీపీ నాయకులు నేరుగా రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి అనుకూలంగా మారిపోయారని ఆరోపణలు చేశారు. ఇలా చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చేసుకుని స్థానిక నాయకులు రచ్చకెక్కుతున్నారు. అలాగే కొన్ని పదవులు, చిన్న చిన్న కాంట్రాక్ట్‌ పనుల విషయంలో ఇరు పార్టీ నేతల మధ్య విభేదాలు వస్తున్నాయి. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నాయకుల మధ్య సఖ్యత పూర్తిగా లోపించింది. అక్కడ టీడీపీ నాయకులు జనసేనకి చెందిన నాయకులను కనీసం పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై స్థానిక నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొంది.


pawan kalyanF.jpg


వైసీపీ నాయకులతోనూ సమస్యలు

వైసీపీ నాయకుల కారణంగా కూడా కూటమిలో సమస్యలు వస్తున్నాయి. చాలామంది వైసీపీ నాయకులు అధికారం కోసం కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులంతా సమష్ఠిగా పని చేశారు. కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా గ్రామస్థాయిలో సమన్వయం చేసుకున్నారు. అప్పుడు వైసీపీ తరఫున ప్రచారం చేసిన నాయకులు ఇప్పుడు టీడీపీ లేదా జనసేన పార్టీలోకి చేరిపోతున్నారు. వీరి వల్ల కూడా కొన్ని చోట్ల సమస్యలు వస్తున్నాయని కొంత మంది నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని పిఠాపురం టీడీపీ నేత వర్మ కూడా ప్రస్తావించారు. కలసిమెలసి ఉన్న టీడీపీ, జనసేన నాయకుల మధ్య వైసీపీ వాళ్లు చిచ్చుపెడుతున్నారని, రెండు పార్టీల మధ్య సఖ్యతను దెబ్బతీస్తున్నారని అంటున్నారు. వైసీపీ నేతలను పార్టీలోకి తీసుకునే సమయంలోనే ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేర్చుకుంటే మంచిదన్న సూచనలు వస్తున్నాయి.


కమిటీలు వేయాలి

ప్రభుత్వానికి సంబంధం లేకుండా జిల్లా స్థాయిలో మూడు పార్టీలకు సంబంధించి ముఖ్య నేతలతో కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీనియర్‌ నాయకులు సూచిస్తున్నారు. గ్రామస్థాయిలో సమస్యలు వచ్చినా ఈ కమిటీలో చర్చించి పరిష్కారం చూపించాలని, అప్పుడే నాయకుల్లో మార్పు వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇలాగే వదిలేస్తే కూటమిపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదన్నారు. అగ్రనాయకులు కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతే స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.


అగ్రనేతలు ఒకేబాట-ఒకే మాట

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఇద్దరూ సమన్వయంతో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇద్దరిలో ఎవరూ ఈగోలకు వెళ్లడం లేదు. సీఎం చంద్రబాబు తాను 40 ఏళ్ల సీనియర్‌ రాజకీయ నాయకుడినని, 14 ఏళ్ల పాటు సీఎంగా పని చేశానని, ఇప్పుడు సీఎంగా ఉన్నానన్న భేషజాలకు పోవడం లేదు. డిప్యూటీ సీఎం పవన్‌ కూడా తాను ప్రజల్లో ఇమేజ్‌ ఉన్న నాయకుడినని, తన వల్లనే కూటమి ఏర్పడిందని, అధికారంలోకి వచ్చిందని అనుకోవడం లేదు. అందరి సమన్వయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని భావిస్తూ ఇద్దరు అగ్రనాయకులు కలిసి వెళ్తున్నారు. ముఖ్యమైన విషయాలపై ఇద్దరు చర్చించుకుంటూ నిర్ణయం తీసుకుంటున్నారు. నామినేటెడ్‌ పోస్టులు, కీలకమైన పోస్టింగ్‌ల విషయంలోనూ ఇద్దరూ ఒక మాట అనుకుని, ఫైనల్‌ నిర్ణయానికి వస్తున్నారు. నియోజకవర్గ, జిల్లా స్థాయి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సృష్టంగా చెబుతున్నారు. ఏదైనా సమస్య వస్తే ఇరు పార్టీల నేతలు ఒక చోట కూర్చొని చర్చించుకోవాలని సూచిస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఈగోలను దూరం పెట్టి స్థానిక జనసేన, బీజేపీ నేతలతో కలిసి నడవాలని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రెండు నెలల క్రితమే పార్టీ శ్రేణులను హెచ్చరించారు. ఏ జిల్లాలో అయినా క్షేత్రస్థాయి నాయకులు చేసే పనుల వల్ల కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడితే వారిని ఉపేక్షించేది లేదని, ఈ విషయాన్ని గుర్తించి నాయకులు ప్రవర్తించాలని ఘాటుగానే వార్నింగ్‌ ఇచ్చారు. ప్రభుత్వంలో అగ్రనాయకుల వద్ద అంతా సక్రమంగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భవిష్యత్తులో ఇబ్బందులు తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి

RK Kothaapluku : మరీ ఇంత నీచమా?

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Nov 03 , 2024 | 10:41 AM