Share News

CM Chandrababu: తిరుమల లడ్డూ నాణ్యత పెంచాం

ABN , Publish Date - Sep 18 , 2024 | 08:16 PM

గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ నాణ్యత పడిపోయిందని సీఎం చంద్రబాబు వివరించారు. భక్తులు పవిత్రంగా భావించే లడ్డూలో జంతువుల నెయ్యి ఉపయోగించారని పేర్కొన్నారు. ఇప్పుడు స్వచ్చమైన ఆవు నెయ్యి ఉపయోగిస్తామని తెలిపారు.

CM Chandrababu: తిరుమల లడ్డూ నాణ్యత పెంచాం
Chandrababu

అమరావతి: దీపావళికి ఉచిత గ్యాస్ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రకటించారు. సంక్షేమ పథకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తానని స్పష్టం చేశారు. ‘వరదల్లో ప్రజలు పడిన కష్టాలు చూసి నేను చలించిపోయాను. పది రోజులపాటు అక్కడ ఉండి సాధారణ పరిస్థితి నెలకొన్న తర్వాత వెళ్ళాను. ప్రపంచవ్యాప్తంగా వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు . సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సర్వశక్తులు ఓడ్డాం. వరదల్లో నష్టపోయిన వారందరినీ అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం. వరదల్లో దెబ్బతిన్న వారికి 45 ఏళ్లలో నేనెప్పుడూ ఇంత ప్యాకేజీ ఇవ్వలేదు. పంటలకు హెక్టార్‌కు రూ.25 వేలు ఇస్తున్నాం. వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి సహాయం అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డూ నాణ్యత పడిపోయింది. జంతువుల నెయ్యితో లడ్డూ తయారు చేశారు. ఇప్పుడు మేం స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం అని’ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో చాలా సమస్యలకు శ్రీకారం చుట్టామని వివరించారు.


CM-Chandrababu.jpg


1వ తేదీన జీతాలు

1వ తేదీన ఉద్యోగస్తులకు జీతాలు అందజేస్తున్నామని చంద్రబాబు వివరించారు. కష్టాలు ఉన్నప్పటికీ కమిట్‌‌మెంట్‌తో పనిచేస్తున్నామని తెలిపారు. అన్నా క్యాంటీన్ రద్దుచేసి జగన్ దుర్మార్గమైన పని చేశారని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాలంటీర్ల వ్యవస్థ గడువు అయిపోయిందని గుర్తుచేశారు. అయినప్పటికి వారిని రెన్యువల్ చేయలేదని మండిపడ్డారు. వైసీపీలో తప్పులు చేసిన వాళ్లని వదిలిపెట్టను స్పష్టం చేశారు. అన్నింటిపై విచారణ జరుగుతున్నాయని గుర్తుచేశారు. మనం తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలని కూటమి నేతలకు సూచించారు. ఎన్డీఏ పక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు.


కొత్త మద్యం పాలసీ

‘అక్టోబర్ మొదటి వారంలో కొత్త మద్యం పాలసీ వస్తుంది. రూ.99కే పేదవాడికి నాణ్యమైన మద్యం అందిస్తాం. కూటమి ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. రెండేళ్లలో పోలవరం ఫేస్ వన్ పూర్తి చేస్తాం. పోలవరాన్ని పూర్తిచేసి జాతికి రైతులకు అందజేస్తాం. అమరావతికి నిధుల కొరతలేదు. త్వరలో విశాఖ రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఒక విజన్ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి. ఐదేళ్లు ఏం చేయాలనేది ఆ డాక్యుమెంట్‌లో పెట్టుకోండి. మీరు చేసే పనులు చిరస్థాయిగా గుర్తుండిపోతాయి. 2047 నాటికి పేదరికం అనేది ఉండకూడదు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసింది. లక్ష కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉంచింది. కేంద్రం ఇచ్చే సహకారంతో మనం ముందుకెళ్లాలి. 20 లక్షల ఉద్యోగాలు యువతకు ఇచ్చేలా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ప్రభుత్వ యంత్రాంగంతో వాలంటీర్ల సేవలు వినియోగించకుండా ఒకే రోజు వందశాతం పెన్షన్లు అందజేశాం. 64 లక్షల మందికి తొలిరోజే పెన్షన్లు అందజేశాం అని’ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


Chandrababu-Review.jpg


సపోర్ట్ చేసే సర్కార్

‘కేంద్రంలో మనం మద్దతిచ్చే ప్రభుత్వం లేకపోతే వెంటిలేటర్ పై ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటం కష్టమయ్యేది. వైసీపీ చేసిన అవకతవకలు చూసి మంత్రులు ఆశ్చర్యపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకాలు కొన్ని సందర్భాల్లో నాకే అర్థం కావట్లేదు. కేంద్రం ఇచ్చిన డబ్బులను దుర్వినియోగం చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పనిచేసినందున ఈ స్థాయిలో విజయం సాధించాం. ప్రజలు ప్రశంసించేలా మన నడవడిక ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించాలి. మూడు పార్టీలు ఇలానే శాశ్వతంగా ఉండాలి. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఏం చేసిందనేది ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ సాయం చేస్తుందో కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. వికసిత్ భారత్ పేరుతో నరేంద్ర మోదీ నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నారు అని’ సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు.


Chandrababu-Naidu.jpg


అండగా పవన్ కల్యాణ్

‘గత ప్రభుత్వం నన్ను అరెస్టు చేసిన సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి రావాలంటే ఆయన వెళ్లే విమానాన్ని క్యాన్సిల్ చేశారు. విమానం లేకపోయినా రోడ్డు మార్గంలో పవన్ కళ్యాణ్ వచ్చారు. నందిగామలో పవన్ కళ్యాణ్ రాకుండా రోడ్డును మూసేశారు. పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకున్నారు. సినిమా వాళ్లు ఇలా చేస్తారని నేను అనుకోలేదు. పవన్ కళ్యాణ్ నిజమైన పోరాట యోధుడు. రాజకీయాలకు ఒక ఆశయం కోసం పవన్ కల్యాణ్ వచ్చారు. ఆనాడు బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయి. బీజేపీతో కలిసి పొత్తును తీసుకొస్తానని ఆనాడు పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజలు గెలవాలి రాష్ట్రం పునర్నిర్మాణం కావాలని పవన్ కళ్యాణ్ కోరారు. మూడు పార్టీలు ఎన్నికల సమయంలో గ్యాప్ లేకుండా పని చేశాయి. మూడు పార్టీలు కలిస్తే రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకురావచ్చని పొత్తు పెట్టుకున్నాం. బీజేపీతో కలిస్తే నష్టం జరుగుతుందని చాలామంది అన్నారు.. లాభం జరుగుతుందని నేను చెప్పాను అని’ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Sep 18 , 2024 | 08:16 PM