Share News

చివరికి వస్తోంది సగమే

ABN , Publish Date - Oct 30 , 2024 | 04:48 AM

ఏదో ఊహించుకుని, భారీ లాభాలు వస్తాయన్న అంచనాతో లక్షలు పెట్టుబడి పెట్టి మద్యం వ్యాపారంలోకి దిగితే చివరికి నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని లైసెన్స్‌దారులు లబోదిబోమంటున్నారు.

చివరికి వస్తోంది సగమే
Liquor merchants

లక్షలు ఖర్చు చేసి దరఖాస్తులు వేశాం

20% మార్జిన్‌లో వస్తోంది 10 శాతమే

లబోదిబోమంటున్న మద్యం వ్యాపారులు


అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ఏదో ఊహించుకుని, భారీ లాభాలు వస్తాయన్న అంచనాతో లక్షలు పెట్టుబడి పెట్టి మద్యం వ్యాపారంలోకి దిగితే చివరికి నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని లైసెన్స్‌దారులు లబోదిబోమంటున్నారు. అమ్మకాలపై 20శాతం మార్జిన్‌ అనుకుంటే చేతికి 10 శాతమే వస్తోందని వాపోతున్నారు. లైసెన్సు ఫీజులు దాదాపుగా రెట్టింపైనా తమకిచ్చే మార్జిన్‌లో మాత్రం పెద్దగా పెంపు లేదని, పైగా చెప్పిన దాంట్లో సగమే వస్తోందని అంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వైన్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ఎక్సైజ్‌ అధికారులను కలిసి మొరపెట్టుకున్నారు. ఇలాగైతే వ్యాపారం చేయడం కష్టమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రైవేటు షాపుల పాలసీలో అన్ని రకాల పన్నులు విధించిన తర్వాత లైసెన్స్‌దారులకు మార్జిన్‌ ఇచ్చేవారు. కానీ గత ప్రభుత్వంలో కొత్తగా ప్రవేశపెట్టిన అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ టాక్స్‌(ఏఆర్‌ఈటీ) వ్యాపారులను దెబ్బకొట్టింది. కొత్త పాలసీలో ప్రభుత్వం ఇస్తామని ప్రకటించిన 20శాతం మార్జిన్‌ను అన్ని పన్నులు విధించిన తర్వాత కాకుండా, ఏఆర్‌ఈటీకి ముందే వేస్తున్నారు. అంటే పన్నులు విధించిన తర్వాత వచ్చే ధరపై 20 శాతం మార్జిన్‌ ఇస్తున్నారు. తర్వాత ఏఆర్‌ఈటీ విధిస్తున్నారు. ఇందులో లైసెన్సీలకు వాటా లేకుండా నేరుగా ప్రభుత్వానికి వెళ్తోంది. ఏఆర్‌ఈటీ పన్ను చాలా ఎక్కువగా ఉంటుంది. దేశంలో తయారైన ఫారిన్‌ లిక్కర్‌పై 137 శాతం నుంచి 220 శాతం, బీరుపై 211 శాతం, వైన్‌పై 187 శాతంగా ఉంది. ఈ పన్నుపై మార్జిన్‌ ఇవ్వకపోవడంతో వ్యాపారులకు ఇచ్చే దాంట్లో భారీగా కోత పడుతోంది. అలాగే కొత్తగా విధించిన 2 శాతం డ్రగ్‌ కంట్రోల్‌ అండ్‌ రీహాబిలిటేషన్‌ సెస్‌, 1 శాతం టీసీఎస్‌ పన్నుపైనా మార్జిన్‌ ఉండదు. సీసాలపై విధించే రౌండా్‌ఫపైనా మార్జిన్‌ ఇవ్వరు. ఉదాహరణకు ఒక సీసా ధర రూ.151 ఉంటే రౌండాఫ్‌ కింద రూ.160 ఎమ్మార్పీ చేస్తారు. అలా రౌండా్‌ఫలో పెరిగిన రూ.9పై లైసెన్సీలకు మార్జిన్‌ ఇవ్వరు. ఈ మూడు కేటగిరీలపై మార్జిన్‌ ఇవ్వకపోవడంతో పాటు, ఏఆర్‌ఈటీపైనా మార్జిన్‌ లేకపోవడంతో సగటున చివరికి 10 శాతమే వ్యాపారులకు దక్కుతోంది.


liquor-shops.jpg


అంత పెట్టుబడికి ఇంతేనా..

కొత్త మద్యం పాలసీలో లైసెన్స్‌ ఫీజులు భారీగా పెంచారు. వార్షిక ఫీజు రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు ఉంది. షాపుల కోసం వ్యాపారులు దరఖాస్తులపై భారీగా పెట్టుబడి పెట్టారు. 3,396 షాపులకు 89,882 దరఖాస్తులు వచ్చాయి. రూ.1800 కోట్ల మేర ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. చాలామంది వ్యాపారులు ఒక్కో షాపు దక్కించుకోవడానికి దాదాపు ఒక ఏడాది లైసెన్స్‌ ఫీజును దరఖాస్తు రుసుముల రూపంలోనే చెల్లించారు. అవన్నీ కలిపితే ఎక్కువమంది రూ.కోటికి పైగానే పెట్టుబడి పెట్టారు. రూ.100 సీసాపై రూ.20 వస్తుంది అనుకున్నామని, కానీ రూ.10 మాత్రమే వస్తోందని, 10 శాతం అసలు వ్యాపారులకు చేరట్లేదని అంటున్నారు.


liquor_ap.jpg


కొన్ని బ్రాండ్లపై మరీ తక్కువ!

మద్యంపై విధించే పన్నులు కేసు ధర ఆధారంగా మారిపోతాయి. ప్రీమియం బ్రాండ్లపై ఎక్కువ పన్నులు పడతాయి. వాటిపై మాత్రం మెరుగైన మార్జిన్‌ వస్తోంది. అయితే అలాంటి బ్రాండ్లు, విక్రయాలు తక్కువ. ఎక్కువగా అమ్ముడుపోయే చీప్‌ లిక్కర్‌, మీడియం బ్రాండ్లపై బాగా తక్కువ మార్జిన్‌ వస్తోంది. ఈ గణాంకాలను వైన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు రాయల సుబ్బారావు ఎక్సైజ్‌ అధికారులకు అందించారు. కొన్ని బ్రాండ్లపై 9 శాతం, 8.9 శాతం కూడా మార్జిన్‌ వస్తోందని అందులో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:
వంశీ కోసం.. లాయర్‌ వేషం

పెట్టుబడులకు ఇదే మంచి సమయం ఏపీకి రండి

జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరుగుతున్నాయ్‌


మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Oct 30 , 2024 | 07:24 AM