Share News

Pattabhiram: తప్పుడు జీవోలతో సీఎం జగన్ మోసం..

ABN , Publish Date - Feb 15 , 2024 | 01:57 PM

అమరావతి: రాజధానిలో పూర్తికాని నిర్మాణాలు పూర్తి అయినట్టు, వాటిలో అధికారులు నివాసముంటున్నట్టు, బ్యాంకుల్ని మోసగిస్తూ ఇచ్చిన జీవోనెం10.. ఈ 420 సర్కార్ బరితెగింపునకు నిదర్శనమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు

Pattabhiram: తప్పుడు జీవోలతో సీఎం జగన్ మోసం..

అమరావతి: రాజధానిలో పూర్తికాని నిర్మాణాలు పూర్తి అయినట్టు, వాటిలో అధికారులు నివాసముంటున్నట్టు, బ్యాంకుల్ని మోసగిస్తూ ఇచ్చిన జీవోనెం10.. ఈ 420 సర్కార్ బరితెగింపునకు నిదర్శనమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. అసలు నిర్మాణమే పూర్తికాని, మనుషులే లేని భవనాల్లో అధికారులు ఉంటున్నట్టు తప్పుడు జీవోలతో జగన్ రెడ్డి ప్రభుత్వం బ్యాంకులకు త్రీడీ సినిమా చూపించారని.. ఆ త్రీడీ సినిమాకు నిర్మాత జగన్ అయితే, దర్శకత్యం మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అని అన్నారు. బ్యాంకుల్ని మోసగించే సినిమాకు కథ.. స్క్రీన్ ప్లే మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి అందిస్తే, సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ యాక్షన్ డైరెక్టర్ పాత్ర పోషించార్నారు. నివాసముండే వారికి జీఏడీ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్) వారు ఏకంగా సీఆర్డీఏకి రూ.69,36,60,000ల అద్దె చెల్లిస్తున్నట్టు ప్రభుత్వం బ్యాంకులకు కట్టుకథలు చెప్పిందని విమర్శించారు.

తప్పుడు జీవోతో ఆగకుండా సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ 29-01-2024న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మికి లేఖ రాశారని.. ఆ లేఖలో ‘ఫిబ్రవరి10, 2024న ఏపీ సీఆర్డీఏకి జీఏడీ విభాగాలకు మధ్య ఒప్పందం జరిగినట్టు, నివాస సముదాయాల్లో అన్నిసౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారని పట్టాభిరామ్ అన్నారు. రాజధాని నిర్మాణమంతా గ్రాఫిక్స్ అన్నవారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఇలా నిర్మాణాలు పూర్తి అయినట్లు.. తప్పుడు జీవోలిచ్చి బ్యాంకుల్ని మోసగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బ్యాంకులను మోసగించిన వ్యవహారంపై మంత్రి ఆదిమూలపు సురేశ్, ఐఏఎస్ అధికారులు వివేక్ యాదవ్, శ్రీలక్షి ప్రజలకు సమాధానం చెప్పాలని పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. గతంలో ఇదే మాదిరి వైఎస్ కుటుంబాన్ని నమ్మి జైలుపాలైనా శ్రీలక్ష్మి బుద్ధి మారలేదని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి అండతో పద్ధతి మార్చుకోకుండా ఆమె ఇదే విధంగా వ్యవహరిస్తే మరలా జైలుకెళ్లడం ఖాయమన్నారు. బ్యాంకుల యాజమాన్యాలు వాస్తవాలు తెలుసుకొని, జగన్ మోసపు రెడ్డి అండతో తప్పుడు జీవోలిచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టాభిరామ్ సూచించారు.

Updated Date - Feb 15 , 2024 | 01:58 PM