Sajjala Ramakrishna Reddy: పోలీసుల విచారణలో నేను చెప్పింది ఇదే.. సజ్జల సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Oct 17 , 2024 | 05:40 PM
టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజల సంక్షేమం, పరిపాలన గురించి వదిలేశారన్నారు. వైసీపీ నాయకులను వేధించడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. తనను గురువారం విచారణకు పిలిచారని..
మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఆయనను పోలీసులు విచారించారు. ఆ తర్వాత పోలీసుల దర్యాప్తు, టీడీపీ కార్యాలయం దాడి ఘటనపై సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తమ పార్టీ నేతలను పోలీసులు వేధిస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజల సంక్షేమం, పరిపాలన గురించి వదిలేశారన్నారు. వైసీపీ నాయకులను వేధించడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. తనను గురువారం విచారణకు పిలిచారని, రోజూ నిందితుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తున్నారని సజ్జల పేర్కొన్నారు. ఘటన జరిగిన రోజు తాను ఇక్కడ లేనని, ఇదే విషయాన్ని పోలీసుల విచారణలో తెలిపానన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనతో తనకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు. ఆరోజు చాలా దూరంలో వేరే కార్యక్రమంలో పాల్గొన్నానని, ఆ వివరాలను విచారణ అధికారులకు ఇచ్చినట్లు తెలిపారు.
రాజకీయ కక్ష..
వైసీపీ నేతలపై టీడీపీ కక్షపూరిత చర్యలకు దిగుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. విపక్షం లేకుండా చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోందన్నారు. వైసీపీకి సీట్లు తక్కువగా వచ్చి ఉండవచ్చని.. 40 శాతం ఓట్లు పడ్డాయనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఎన్నికల హామీల అమలు నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించడంకోసమే ఈ కేసులు పెడుతున్నారన్నారు. పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం మొదలు పెట్టిన తప్పుడు సంస్కృతికి బదులు కూడా ఇలాగే ఉంటుందని హెచ్చరించారు. 2019 నుంచి తాము కక్ష పూరితంగా వ్యవహారిస్తే టీడీపీ నాయకులు చాలా ఇబ్బంది పడేవారన్నారు. ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం ఇటువంటి పనులు మానుకోవాలని తెలిపారు. దాడిలో పాల్గొన్నవారు తమ పేర్లు చెప్పారా లేదా పోలీసులు రాసుకున్నారా అని ప్రశ్నించారు.
ఆధారాలతో ప్రశ్నించినా..
టీడీపీ కార్యాలయం దాడి ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల తమ విచారణలో ఎన్నో ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. దాడి ఘటనలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందనడానికి ఆధారాలు లభించడంతోనే సజ్జలకు నోటీసులు జారీచేసి దర్యాప్తునకు పిలిచినట్లు తెలుస్తోంది. సజ్జల మాత్రం తనకు ఈ ఘటనతో ఎలాంటి ప్రమేయం లేదని, ఆ రోజు ఎక్కడో దూరంగా ఉన్నానని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. సజ్జల డైరెక్షన్‌లో దాడికి ప్లాన్ జరిగిందనే ప్రచారం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో నామ మాత్రంగా కేసు నమోదు చేసినా.. అప్పటి వైసీపీ ప్రభుత్వం ఒత్తిడితో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదనే విమర్శలు వినిపించాయి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here