Share News

Telangana: వరద బాధితులపై లాఠీఛార్జా? ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్..

ABN , Publish Date - Sep 02 , 2024 | 08:19 PM

వరద బాధితులకు సహాయం చేయకుండా తమపై బురద జల్లుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. సోమవారం నాడు చేగుంటలో హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు సహాయం చేయకుండా..

 Telangana: వరద బాధితులపై లాఠీఛార్జా? ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్..
Harish Rao

మెదక్, సెప్టెంబర్ 02: వరద బాధితులకు సహాయం చేయకుండా తమపై బురద జల్లుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. సోమవారం నాడు చేగుంటలో హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు సహాయం చేయకుండా తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారపక్షంలో ఉన్నా తమపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యారని హరీష్ రావు దుయ్యబట్టారు.


ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులకు అక్కడి ప్రభుత్వం అందిస్తు్న్న సహాయక చర్యలను ఉటంకిస్తూ.. రేవంత్ రెడ్డి సర్కార్ తీరును తూర్పారబట్టారు. 74 సంవత్సరాలు ఉన్న ఏపీ సీఎం బయట తిరుగుతుంటే.. 54 సంవత్సరాలు ఉన్న తెలంగాణ సీఎం మాత్రం ఇంట్లో కునుకు తీస్తున్నాడంటూ విమర్శలు గుప్పించారు. వాతావరణ శాఖ చెప్పినా కూడా ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం అని అన్నారు. వరదల కారణంగా 16 మంది చనిపోయారని ప్రభుత్వం చెబుతోందని.. కానీ, 31 మంది చనిపోయినట్లు తమకు సమాచారం ఉందన్నారు. తమ పార్టీ కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్నారని హరీష్ రావు చెప్పారు.


ఖమ్మంలో తొమ్మిది సీట్లు ఇస్తే.. తొమ్మిది మందిని కూడా కాపాడలేకపోయారని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు హరీష్ రావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, తప్పులు సరిదిద్దుకోవాలన్నారు. ఆపదలో ఉన్న వారిని కాపాడాలని ప్రభుత్వానికి హరీష్ రావు హితవు చెప్పారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చనిపోయిన వ్యక్తులకు రూ. 25 లక్షలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అడిగారని.. ఇప్పుడు సీఎంగా రేవంత్ ఉన్నందున చనిపోయిన వ్యక్తులకు రూ. 25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.


బాధితులపై లాఠీ ఛార్జ్ చేస్తారా?

ఖమ్మంలో వరద బాధితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. తమకు సాయం చేసేందుకు ఏ ప్రభుత్వాధికారి రావడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, వరద బాధితులకు వాగ్వాదం జరిగింది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఖమ్మంలో సహాయం అడిగిన వరద బాధితులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే బాధితులను కొట్టడమేనా? అని ప్రశ్నించారు.


Also Read:

సిగ్గు తెచ్చుకోండి ముఖ్యమంత్రి గారు: కేటీఆర్.. విషయం ఏంటంటే?

కుల గణనపై ఆర్ఎస్ఎస్ కీలక ప్రకటన

అమరావతిపై దుష్ప్రచారం తగదు

For More Telangana News and Telugu News..

Updated Date - Sep 02 , 2024 | 08:29 PM