జగన్-అదానీ లంచాల్లో ఇద్దరుఐఏఎస్‌ల కీలక పాత్ర!
ABN , Publish Date - Nov 25 , 2024 | 02:59 AM
సౌర విద్యుత్ ఒప్పందానికి సంబంధించి అదానీ నుంచి నాటి సీఎం జగన్ రూ.1,750 కోట్ల లంచాలు తీసుకున్న వ్యవహారంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారని రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేశ్ వెల్లడించారు.
తమ ‘రాజు’కు లబ్ధి చేకూర్చడానికే!
దీనివల్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం పోయింది
పకడ్బందీ విచారణతో కఠిన చర్యలు చేపట్టాలి
రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేశ్ డిమాండ్
అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): సౌర విద్యుత్ ఒప్పందానికి సంబంధించి అదానీ నుంచి నాటి సీఎం జగన్ రూ.1,750 కోట్ల లంచాలు తీసుకున్న వ్యవహారంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారని రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేశ్ వెల్లడించారు. తమ ‘రాజు’కు లబ్ధి చేకూర్చడానికే ఇలా చేశారని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘2019 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 9 పునరుత్పాదక సంస్థలకు చెందిన 23 ప్రాజెక్టులకు సంబంధించిన 2,132 మెగావాట్ల విద్యుత్ సరఫరా ఒప్పందాలను రద్దు చేసింది. అదే ప్రభుత్వం 2021 డిసెంబరులో 7,000 మెగావాట్ల సౌరవిద్యుత్ సరఫరా కోసం సెకీ ద్వారా ఒకే ఒక సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ వ్యవహారంలో వారి ’రాజు’కు ప్రయోజనాలు కల్పించడం కోసం ఇద్దరు ఐఏఎస్ అధికారులు కీలకపాత్ర పోషించారు. దీనివల్ల మంచి స్థాయిలో ఉన్న రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ఈ చర్య ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. అందుబాటులో ధరల్లో ఉండే విద్యుత్ సౌకర్యాల అవకాశాలను చావుదెబ్బతీసింది. వినియోగదారులపై పెనుభారం మోపింది. ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయింది. ఇలాంటి నేరపూరిత వ్యవహారాలపై పకడ్బందీ విచారణ జరిపి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. బయటకు వస్తున్న సమాచారం కంటే కూడా వాస్తవిక పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. అత్యవసర ప్రాతిపదికన దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఆయన తెలిపారు.