Andhra Pradesh : తుఫాన్ వచ్చినా సకాలంలోనే నైరుతి
ABN , Publish Date - May 24 , 2024 | 03:46 AM
నైరుతి, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది శుక్రవారం నాటికి వాయుగుండంగా, ఆ తరువాత కూడా ఈశాన్యంగా పయనించి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారనున్నది. దీనికి ‘రీమెల్’ అని పేరు పెట్టనున్నారు.
ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షాలు
వర్షం కురిసే రోజులు మాత్రం తక్కువ
ఎక్కువగా కుండపోత వానలకు అవకాశం: ఐఎండీ
బలపడిన అల్పపీడనం.. తీవ్ర తుఫాన్‌గా మారే చాన్స్
26న బంగ్లాదేశ్, బెంగాల్ మధ్య తీరంపైకి?
ఏపీకి ముప్పు లేనట్టే.. పెరగనున్న ఎండలు, వడగాడ్పులు
విశాఖపట్నం, అమరావతి, మే 23(ఆంధ్రజ్యోతి): నైరుతి, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది శుక్రవారం నాటికి వాయుగుండంగా, ఆ తరువాత కూడా ఈశాన్యంగా పయనించి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారనున్నది. దీనికి ‘రీమెల్’ అని పేరు పెట్టనున్నారు. మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారి ఆదివారం సాయంత్రం బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాల్లో భారీవర్షాలు కురుస్తాయని, తీరం దాటేటప్పుడు వంద కిలోమీటర్లకుపైగా వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌కు ముప్పు లేనట్టేనని వాతావరణ నిపుణులు తెలిపారు.
ఇదే సమయంలో తీరానికి దూరంగా తుఫాన్ పయనించనున్నందున ఆ దిశగా భూ ఉపరితలం మీద నుంచి వేడి గాలులు వీయనున్నాయి. ఇప్పటికే వాయువ్య భారతం నుంచి తీవ్ర వడగాడ్పులు మధ్య భారతం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మీదుగా అల్పపీడనం దిశగా వీస్తున్నాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో వడగాడ్పుల తీవ్రత మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రానున్న నాలుగు రోజులు ఎండ తీవ్రత పెరగడంతో పాటు వడగాడ్పులు వీచే అవకాశముందని హెచ్చరించారు.
ఇదిలావుండగా కేరళకు ఆనుకుని ఆగ్నేయ, అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కేరళ, కర్ణాటక తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా, తుఫాను వచ్చినా రుతుపవనాల రాకలో జాప్యం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కేరళకు ఆనుకుని అరేబియా, హిందూ మహా సముద్రంలో రుతుపవన మేఘాలు భారీగా ఆవరించి ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం బలపడి తుఫాన్‌గా మారి బంగ్లాదేశ్ వద్ద తీరం దాటే క్రమంలో అరేబియాలో ఉన్న రుతుపవన మేఘాలు కేరళ వైపు వస్తాయని అంచనా వేస్తున్నారు. అప్పుడు ఈ నెల 29, 31 తేదీల మధ్య ఏ క్షణమైనా రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఏడాది నైరుతి సీజన్‌లో 103 శాతం వర్షాలు కురుస్తాయని ఇంతకుముందు అంచనా వేయగా, తాజా పరిస్థితులను బట్టి 105 శాతం వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
అలాగే, నైరుతి రుతుపవనాల నిష్క్రమణ కూడా ఈ ఏడాది ముందే జరుగుతుందని పేర్కొన్నారు. మొత్తంగా ఈ సీజన్‌లో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, వర్షం కురిసే రోజుల సంఖ్య తక్కువని, ఫలితంగా కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా, శనివారం అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాగల మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు, అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు చోట్ల ఎండలు తీవ్రంగా ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. శుక్రవారం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.