Share News

CM Chandrababu : ఇక మీ ఆటలు సాగవ్‌!

ABN , Publish Date - Nov 22 , 2024 | 03:01 AM

‘ఇష్టానుసారంగా చేస్తే.. ఇకపై మీ ఆటలు సాగవ్‌! రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థుల భరతం పడతా. రౌడీలు, భూ కబ్జాదారులు, సంఘ విద్రోహ శక్తులు గుండెల్లో రైళ్లు పరుగెత్తించే కఠినమైన చట్టాలను అమలు చేస్తాం.

CM Chandrababu : ఇక మీ ఆటలు సాగవ్‌!

అసెంబ్లీలో సీఎం హెచ్చరిక

  • ‘రాజకీయ’ నేరగాళ్ల భరతం పడతా: సీఎం

  • తల్లి, చెల్లి వ్యక్తిత్వాన్ని కించపరిచిన వ్యక్తిని వెనకేసుకొస్తావా?

  • వర్రా వాడిన భాషను నా నోటితో ఉచ్చరించలేను

  • వీళ్లకు మనస్సాక్షే లేదు.. బాబాయి హత్యను మొదట గుండెపోటన్నారు

  • చంపారని తేలాక ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ డ్రామాలు

  • కోడికత్తి, గులకరాయి కేసులూ ఈ కోవలోవే

  • ఇలాంటి రాజకీయాలను జీవితంలో చూడలేదు

  • మాఫియాలను అరికట్టేందుకు పటిష్ఠ చట్టాలు

  • నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తాం

  • ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో అది చేసి చూపిస్తాం. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడితే.. అదే వారికి చివరి రోజవుతుంది.

  • దళిత మహిళ అయిన ప్రస్తుత హోం మంత్రికే రక్షణ లేకపోతే రాష్ట్రంలో ఇంకెవరికి ఉంటుంది? డీజీపీ, హోం సెక్రటరీ, డిప్యూటీ సీఎం.. ఎవరైనా సరే పేటీఎం బ్యాచ్‌కు లెక్కలేదు. ఏమిటీ విచ్చలవిడితనం?

  • గత ప్రభుత్వంలో కొంత మంది సీనియర్‌ పోలీసు అధికారులు వ్యవస్థకే మచ్చ తీసుకొచ్చారు. అలాంటి వారిని సస్పెండ్‌ చేసి చర్యలు తీసుకుంటున్నాం. తప్పు చేసినవారెవరినీ ఉపేక్షించం.

- ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ‘ఇష్టానుసారంగా చేస్తే.. ఇకపై మీ ఆటలు సాగవ్‌! రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థుల భరతం పడతా. రౌడీలు, భూ కబ్జాదారులు, సంఘ విద్రోహ శక్తులు గుండెల్లో రైళ్లు పరుగెత్తించే కఠినమైన చట్టాలను అమలు చేస్తాం. ఎవరైనా తప్పుచేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ‘షర్మిల వైఎ్‌సఆర్‌కు పుట్టిన బిడ్డ కాదు.. వైఎస్‌ విజయమ్మకు పుట్టిన బిడ్డ మాత్రమే’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి తన కన్నతల్లి, తోడబుట్టిన చెల్లెలి వ్యక్తిత్యాన్ని డ్యామేజ్‌ చేసిన వర్రా రవీందర్‌రెడ్డిని మాజీ సీఎంగా పనిచేసిన వ్యక్తి సమర్థిస్తున్నారంటూ వైఎస్‌ జగన్‌పై ఆయన మండిపడ్డారు.

వర్రా వాడిన భాషను తన నోటితో ఉచ్ఛరించలేనన్నారు. ‘అలాంటి భాషను వాడిన వ్యక్తిని వెనకేసుకొస్తావా? అతడి పేరుతో వేరేవాళ్లు పోస్టులు పెట్టారని చెబుతావా’ అంటూ జగన్‌ను నిలదీశారు. తనపై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో అవినాశ్‌రెడ్డిని కూడా అరెస్టు చేయాలని షర్మిల డిమాండ్‌ చేస్తున్నారని గుర్తు చేశారు.


గురువారం శాసనసభలో భూ ఆక్రమణల నిరోధక బిల్లు, పీడీ యాక్టు సవరణ బిల్లుపై చర్చసందర్భంగా సీఎం మాట్లాడారు. వైసీపీ పేటీఎం బ్యాచ్‌ ఆర్గనైజ్డ్‌గా సోషల్‌ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడుతూ ఆడవాళ్ల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో డిజిటల్‌ కార్పొరేషన్‌లో వైసీపీ మనుషులను పెట్టి ఒక వ్యవస్థను తయారు చేశారని.. వారి అడ్రసులు తెలియకుండా సోషల్‌ మీడియా ద్వారా దాడికి తెగబడుతున్నారని విమర్శించారు. ‘ఇదంతా చూస్తుంటే మనసు వికలమైపోతోంది. నిద్రకూడా రావడం లేదు. ప్రజలకు సేవ చేయడానికి వచ్చినవారు ఇన్ని అవమానాలు పడాలా? మొన్ననే విశాఖపట్నంలో ఒక అమ్మాయి నగ్న ఫోటోలు తీసి.. ఆమె జీవితాన్ని నాశనం చేశారు. వాళ్లు మనుషులా? మృగాలా’ అని విరుచుకుపడ్డారు.

పీడీ యాక్టుకు పదును పెడుతున్నామన్నారు. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న చట్టాలను అధ్యయనం చేసినట్లు తెలిపారు. కల్తీ విత్తనాలు, ఎరువుల విక్రయాలు మొదలుకొని రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌, ఇసుక మాఫియాలను అరికట్టేందుకు పటిష్ఠ చట్టాలు తీసుకొచ్చి నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తామని స్పష్టం చేశారు. వాళ్లు ఎక్కడ దాక్కున్నా పట్టుకొచ్చి శిక్షిస్తామని.. తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తామని ప్రకటించారు. ఇంకా ఏమన్నారంటే..


  • వివేకా హత్యపై డ్రామాలు

‘వివేకా హత్య జరిగినప్పుడు నేనే సీఎంను. ఆయన గుండెపోటుతో చనిపోయాడని ఆరోజు ఉదయమే నాకు మెసేజ్‌ వచ్చింది. అది ‘సాక్షి’ మెసేజే. పోలీసు వ్యవస్థతోపాటు అధికారులూ అదే చెప్పారు. వివేకా గుండెపోటుతో చనిపోయాడని విజయసాయిరెడ్డి కూడా ఉదయమే ప్రెస్‌మీట్‌లో చెప్పారు. నేనూ నమ్మాను. అది ఎన్నికల సమయం. హెలికాప్టర్లు ఉన్నాయి. సొంత బాబాయి చనిపోతే జగన్‌ వెంటనే వెళ్లాలి కదా! మధ్యాహ్నం వరకు వెళ్లలేదు. ఈలోపే హత్య జరిగిన రూము, బాత్‌రూములను క్లీన్‌ చేసేశారు. వివేకా భౌతిక కాయాన్ని క్లీన్‌ చేసి బాక్స్‌లో పెట్టేశారు. స్థానిక సీఐని మేనేజ్‌ చేసేశారు. అయితే వివేకా కూతురికి అనుమానం వచ్చి తన తండ్రి శవానికి పోస్టుమార్టం చేయాలని కోరింది. పోస్టుమార్టం సమయంలో వివేకా తలపై గాట్లు బయటపడ్డాయి. దాంతో జగన్‌ డ్రామాలు మొదలు పెట్టాడు. మర్నాడు ఆయన పత్రికలో ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ కథనాలు రాశారు. వీళ్లకసలు మనస్సాక్షే లేదు. కోడికత్తి కేసు, మొన్న ఎన్నికల ముందు జరిగిన గులకరాయి కేసు కూడా ఇలాంటివే. ఇలాంటి రాజకీయాలను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు.


  • శాంతి భద్రతలతోనే రాష్ట్రాభివృద్ధి

రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యం. ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. టూరిజం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర భవిష్యత్‌ కోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాం. గంజాయి సమస్య పెద్ద సవాల్‌గా మారింది. గత ఐదేళ్లలో దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌.. విశాఖపట్నంలోనే. జగన్‌ ఐదేళ్లలో ఒక్కసారైనా దీనిపై సమీక్ష చేయలేదు. దాంతో ఇళ్ల దగ్గర కూడా గంజాయి సాగు చేసే పరిస్థితి. కాలేజీలకు కూడా విస్తరించింది. విదేశాలకూ ఎగుమతి చేశారు. రాష్ట్రంలో ఎక్కడ.. ఏ నేరం జరిగినా దాని వెనుక గంజాయి బ్యాచ్‌ ఉంటోంది. ఈ బ్యాచ్‌లకు పకడ్బందీ నెట్‌వర్క్‌ ఉంది. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడితే.. మా టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడి చేశాయి. గంజాయి కట్టడికి సమయం పడుతుందని ఎన్నికల ముందే చెప్పాను. పిల్లలు మత్తుకు అలవాటుపడి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాంటివారిపై జనం తిరుగుబాటు చేయాలి.

  • పోలీసు వ్యవస్థ ప్రక్షాళన

పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. 6వేలకు పైగా కానిస్టేబుళ్లను రిక్రూట్‌ చేస్తాం. జిల్లాకో సైబర్‌ పోలీసు స్టేషన్‌ పెడతాం. 2,812 కొత్త వాహనాల కొనుగోలుకు రూ.280 కోట్లు మంజూరు చేశాం. పోలీసులకు గత ప్రభుత్వం చెల్లించాల్సిన వివిధ బకాయిలు రూ.859 కోట్లను దశలవారీగా క్లియర్‌ చేస్తాం. రూ.90 కోట్లతో పోలీసు బలగాల ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటున్నాం. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం, ఇతర కార్యక్రమాల నిర్వహణకు రాజధానిలో ఐదెకరాలు కేటాయిస్తాం.


  • భూ కబ్జాలకు పాల్పడితే 14 ఏళ్లు జైల్లోనే..

గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఇష్టానుసారంగా భూ కబ్జాలకు పాల్పడ్డారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు పేరుతో మోసాలకు తెరతీశారు. రాష్ట్రవ్యాప్తంగా భూ ఆక్రమణలపై 8,305 ఫిర్యాదులు రాగా.. అవన్నీ 22ఏ కేసులు, భూ కబ్జాలకు సంబంధించినవే. అందుకే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే ఈ నల్లచట్టాన్ని రద్దు చేస్తూ ఫైల్‌పై సంతకం చేశాను. కఠినమైన గుజరాత్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో అమలవుతున్న చట్టాలను అధ్యయనం చేసి భూ ఆక్రమణల చట్టంలో సవరణలు తీసుకొచ్చాం. ఇక మీదట ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడినా.. బెదిరింపులకు దిగినా.. బాధితులు కేసు పెడితే కబ్జాదారులు 10 నుంచి 14 ఏళ్ల పాటు జైల్లో మగ్గాల్సిందే. భూ ఆక్రమణల కేసులను 6 నెలల్లోపు పరిష్కరించేందుకు వీలుగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి.. బాధితుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను కూడా నియమిస్తాం. చట్టాన్ని ఉల్లంఘించేవారిపై చాలా కఠినంగా వ్యవహరిస్తాం.

Updated Date - Nov 22 , 2024 | 03:04 AM