Share News

Jagan: వైసీపీ కార్యాలయం కూల్చివేతపై స్పందించిన జగన్

ABN , Publish Date - Jun 22 , 2024 | 10:17 AM

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఒక నియంతలా వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చి వేయించారని ట్విటర్ వేదికగా విమర్శించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారని అన్నారు.

Jagan: వైసీపీ కార్యాలయం కూల్చివేతపై స్పందించిన జగన్

అమరావతి: ఉండవల్లిలోని బోటు యార్డ్ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం కూల్చివేతపై ఆ పార్టీ అధినేత, వైఎస్ జగన్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని వైసీపీ జగన్ ఆరోపించారు. ఒక నియంతలా వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చి వేయించారని ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారని, ఎన్నికల తర్వాత చంద్రబాబు హింసాత్మక ఘటనలతో రాష్ట్రంలో రక్తాన్ని పారిస్తున్నారని జగన్ ఆరోపణలు గుప్పించారు. ఐదేళ్ల చంద్రబాబు పాలన ఎలా ఉండబోతుందనడానికి ఈ ఘటనే ఉదాహరణ అని పేర్కొన్నారు.


‘‘ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదు.. వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను’’ అని జగన్ తెలిపారు.

Updated Date - Jun 22 , 2024 | 11:13 AM