సన్మానం చేయాలా?
ABN , Publish Date - Nov 29 , 2024 | 02:49 AM
ఆంధ్రప్రదేశ్ ప్రజలారా... వినండి! మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి శాలువాలు కప్పాలట! సన్మానాలు చేయాలట! రాష్ట్రానికి ఆయన లక్షల కోట్లు మిగిల్చారట! ఈ మాటలన్నీ ఎవరో చెప్పినవి కావు! ఆయనకు ఆయనే చెప్పుకొన్నారు. తనకు తాను జేజేలు కొట్టుకున్నారు.
సెకీతో ఒప్పందంపై జగన్ అడ్డగోలు వాదన
అబద్ధాలు చెప్పినందుకు శాలువా కప్పాలా?
ట్రాన్స్‌మిషన్ చార్జీలు లేవంటూ జగన్ బుకాయింపు
‘నెట్‌వర్క్’ చార్జీలుంటాయని నాడే చెప్పిన కార్యదర్శి
2021లో యూనిట్ సౌర విద్యుత్తు రూ.2.14
రూ.2.49తో పాతికేళ్లు కొనడం రాష్ట్రానికి భారం కాదా?
రాష్ట్ర కార్పొరేషన్ టెండర్లలోనూ అదే ధర పలకలేదా?
ఆ టెండర్లను రద్దు చేసి సెకీతో ఎందుకు డీల్?
సెకీ నుంచి కొనుగోలు చేసేది అదానీ పవర్‌ను కాదా?
రూ.2.14 కంటే 2.49 తక్కువా?
‘దేశంలోనే అత్యంత చౌక ధరతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నాం. రాష్ట్రానికి లక్షల కోట్లు మిగిల్చాం. ఇందుకు శాలువా కప్పి సన్మానించాలి’... అని జగన్ తనను తాను ప్రశంసించుకున్నారు. మరి అసలు విషయంలోకి వస్తే! 2021 డిసెంబరులో జగన్ ‘సెకీ’తో ఒప్పందం కుదుర్చుకున్నారు. యూనిట్ రూ.2.49 చొప్పున పాతికేళ్లలో 7వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు చేసేందుకు కుదిరిన డీల్ అది! అయితే... అదే ఏడాది మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ సౌర విద్యుత్తు రూ.2.14లే పలికింది. 2022 జనవరిలో ఈ ధర రూ.2.17 మాత్రమే! జగన్ చెప్పిన రూ.2.49 ‘లెక్క’ ఏరకంగా తక్కువో! ఇవేం లెక్కలో!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఆంధ్రప్రదేశ్ ప్రజలారా... వినండి! మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి శాలువాలు కప్పాలట! సన్మానాలు చేయాలట! రాష్ట్రానికి ఆయన లక్షల కోట్లు మిగిల్చారట! ఈ మాటలన్నీ ఎవరో చెప్పినవి కావు! ఆయనకు ఆయనే చెప్పుకొన్నారు. తనకు తాను జేజేలు కొట్టుకున్నారు. ‘జగన్-అదానీ... ముడుపుల కహానీ’ని అమెరికా బయటపెట్టిన వారం తర్వాత ఆయన ఇప్పుడు, ఇన్నాళ్లకు నోరు తెరిచారు. తాడేపల్లిలో ఎంపిక చేసిన, ఎదురు ప్రశ్నించని ‘సొంత మీడియా’ ప్రతినిధులతో సమావేశమయ్యారు. గంటన్నరపాటు అనేక అబద్ధాలు, అర్ధసత్యాలతో మాయ చేసేందుకు ప్రయత్నించారు. 48 గంటల్లో క్షమాపణలు చెప్పకుంటే వందకోట్లకు పరువునష్టం దావా వేస్తానని ‘ఆంధ్రజ్యోతి’ని బెదిరించారు కూడా!
హవ్వ... అంత అబద్ధమా?
‘దేశంలోనే అత్యంత చౌకగా... రూ.2.49కే యూనిట్ విద్యుత్ సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నాం. దీనికి ఇంటర్‌స్టేట్ ట్రాన్స్‌మిషన్ చార్జీలను మినహాయించేందుకు సెకీ అంగీకరించింది’ అని జగన్ గురువారం గొప్పగా చెప్పారు. ఇదో పెద్ద... శుద్ధ అబద్ధం! ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి గ్రిడ్ ద్వారా విద్యుత్తు సరఫరా చేస్తే వసూలు చార్జీలనే ఇంటర్‌స్టేట్ ట్రాన్స్‌మిషన్ చార్జీలు అంటారు. సెకీ దీనిని మినహాయించలేదని, ఆ మొత్తం యూనిట్‌కు రూ.1.70 వరకు ఉంటుందని అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ అప్పట్లో ప్రకటించారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం దీని పేరును ‘జనరల్ పవర్ యాక్సిస్’ (జీపీఏ)గా మార్చింది. దీని ప్రకారం... యూనిట్‌కు 80 పైసల నుంచి రూ.1.70 దాకా జీపీఏ చెల్లించాల్సి ఉంటుంది. కనిష్ఠంగా 80 పైసలు లెక్కలోకి తీసుకున్నా, ఒప్పందకాలం పాతికేళ్లకు రూ.62వేల కోట్ల భారం పడుతుంది. ఇదీ అసలు నిజం!
మాటి మాటికీ మారే మాట...
జగన్ ప్రతిపక్ష నేత హోదాలో ఉండగా.. దీర్ఘకాలిక విద్యుత్తు ఒప్పందాలను బలంగా వ్యతిరేకించారు. 2014-19 కాలంలో సౌర విద్యుత్తు సంస్థలతో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నీ లంచాల కోసమేనని జగన్ ఆరోపించారు. విద్యుత్తు రంగంలో వేగంగా మార్పులు ఉంటాయని .. దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకోవడం తప్పని వాదించారు. అధికారపగ్గాలు చేపట్టిన వెంటనే.. వాస్తవాలను పరిశీలించకుండా, పర్యవసానాలను ఆలోచించకుండా సౌర, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను (పీపీఏ) రద్దు చేశారు. దీంతో ఒక్క యూనిట్ కరెంటు వాడుకోకున్నా ఆయా సంస్థలకు రూ.4500 కోట్ల మేర చెల్లింపులు జరపాల్సి వచ్చింది ఆ తర్వాత అదే జగన్... ‘సెకీ’తో ఏకంగా పాతికేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. గడచిన పదేళ్లుగా సౌర విద్యుత్తు ధరలు తగ్గుతూ వస్తున్నాయి. 2014లో ఇదే ‘సెకీ’ యూనిట్ సౌర విద్యుత్తు రూ.5.50కి సరఫరా చేసింది. ఆ తర్వాత ఈ ధర క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2021లో కనిష్ఠంగా రూ.2.14కు చేరింది. కానీ... అదే సంవత్సరం జగన్ పాతికేళ్లపాటు యూనిట్‌కు రూ.2.49 చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం! ప్రస్తుతం యూనిట్ ధర రూ.2.51 వరకు పలుకుతోంది. అది స్థిరంగా ఉండదని... భవిష్యత్తులో బాగా తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరి... రాష్ట్ర ప్రజలకు చేసింది మేలా? కీడా?
ఆ టెండర్లు ఎందుకు రద్దు చేశారు?
‘2021 సెప్టెంబరులో సెకీ నుంచి తియ్యటి కబురు వచ్చింది. మా విద్యుత్తు విధానాలను ప్రశంసిస్తూ... రూ.2.49కే యూనిట్ సౌర విద్యుత్తు సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది’’ అని జగన్ ముద్దుముద్దు మాటలు చెప్పారు. నిజానికి... 2020లో రాష్ట్ర ప్రభుత్వ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ పిలిచిన టెండర్లకే రూ.2.49కే సౌర విద్యుత్తు సరఫరా చేసేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. ‘సెకీ’ కూడా అదే రేటు నిర్ణయించింది. అయినా సరే... గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ పిలిచిన టెండర్లను జగన్ సర్కారు రద్దు చేసింది. ‘సెకీ’ పవర్‌కు జై కొట్టింది. అందులోనూ... తాను గొప్పగా ప్రవేశపెట్టినట్లు చెప్పుకొనే ‘రివర్స్ టెండర్’కు కూడా పోకుండా వేలకోట్ల ఒప్పందాన్ని ఏకపక్షంగా కుదుర్చుకున్నారు. ఇదంతా ఎవరి కోసం?
‘అదానీ’ కోసం కాదా?
‘‘కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్‌లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో థర్డ్ పార్టీ (అదానీ) ప్రస్తావన ఎక్కడుంది?’ అని జగన్ చాలా తెలివిగా ప్రశ్నించారు. ఒప్పందం ‘సెకీ’తో కుదిరినప్పటికీ... కరెంటు సరఫరా చేసేది అదానీయే! ‘సెకీ’ ఒక మధ్యవర్తి మాత్రమే! కమీషన్ తీసుకోవడానికే దీని పాత్ర పరిమితం! ‘సెకీ’ ద్వారా రాష్ట్రాలకు 12వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు అదానీ, అజూర్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. కానీ... ఆ ధరకు, దీర్ఘకాలం కరెంటు కొనుగోళ్లకు రాష్ట్రాలు ముందుకు రాలేదు. ‘పవర్ డీల్’ అనిశ్చితిలో పడటం... పెట్టుబడిదారుల నుంచి ఒత్తిడి రావడంతో రాష్ట్రాలకు ‘లంచాలు ఎరవేసి’ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు అమెరికా ‘సెక్’, దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. 12వేల మెగావాట్లలో ఏపీ ఒక్కటే ఏడువేల మెగావాట్ల కొనుగోలుకు సిద్ధపడటం గమనార్హం. అందుకే... ఈ కేసు నివేదికలో ‘ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్’ అని జగన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అక్షరాలా ఉతికి ఆరేశాం!
‘సెకీతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో తప్పులు జరిగితే ఆంధ్రజ్యోతి అప్పుడు ఊరుకునేదా?’ అని జగన్ ప్రశ్నించారు. ఆయనకు తెలియదో, తెలిసీ ఇలా అన్నారో తెలియదు కానీ... ‘సెకీ’తో డీల్‌పై ‘ఆంధ్రజ్యోతి’ అనేక కథనాలు ప్రచురించింది. 2021 సెప్టెంబరు 22న ‘ఆంధ్రా సూరీడు అదానీ’ అనే శీర్షికన ‘సెకీ’తో ఒప్పందం వెనుక జరిగిన అనుమానాస్పద పరిణామాలను, కోణాలను వివరించింది. అదే అంశాలను ఇప్పుడు అమెరికా దర్యాప్తు సంస్థలు తమ నివేదికల్లో ప్రస్తావించాయి.
‘మామూలే’ అయితే గోప్యత ఎందుకు?
‘ముఖ్యమంత్రిని పారిశ్రామికవేత్తలు కలవడం సహజం. అదానీ అలాగే నన్ను కలిశారు’ అని జగన్ ఇప్పుడు చెబుతున్నారు.నిజమే... పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రులు కలవడం సహజమే! కానీ... ఇలాంటి భేటీలు రహస్యంగా జరగవు. పెట్టుబడులు, ప్రాజెక్టుల ప్రతిపాదనలపై చర్చలు జరిగితే... ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తారు. కానీ... అదానీతో జగన్ జరిపిన సమావేశాలన్నీ గుట్టుగానే! దీని మర్మమేమిటి?