AP Politics: అవ్వా తాతలకు జగన్ వెన్నుపోటు
ABN , Publish Date - Apr 02 , 2024 | 04:52 AM
మండుటెండల కాలంలో అవ్వాతాతలకు ముఖ్యమంత్రి జగన్ వెన్నుపోటు పొడిచారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.
పింఛన్లు ఇంటికి పంపే వకాశమున్నా కావాలనే పంపడం లేదు
టీడీపీ అడ్డుకుంటోందని ఫేక్ ప్రచారం
టీడీపీ వస్తే పింఛన్ 4 వేలిస్తాం
వలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు: బాబు
ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు ఇవ్వొద్దని కోర్టు చెప్పలేదు. ఎన్నికల కమిషన్ కూడా చెప్పలేదు. అయినా జగన్ మాత్రం ఇంటి వద్దకు పెన్షన్ పంపవద్దని అధికారులను ఆదేశించాడు. వలంటీర్లూ.. అధికార పార్టీ నేతల మాటలు నమ్మి మీ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు. జగన్ రాజకీయ క్రీడలో పావులు కావొద్దు.
- చంద్రబాబు
అమరావతి, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): మండుటెండల కాలంలో అవ్వాతాతలకు ముఖ్యమంత్రి జగన్ వెన్నుపోటు పొడిచారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. పేదల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను ఇచ్చే అవకాశమున్నా కావాలనే చేయడం లేదన్నారు. టీడీపీ వచ్చిన తర్వాత పింఛను మొత్తాన్ని రూ. 4 వేలకు పెంచుతామని ప్రకటించారు. ఈ రెండు మూడు నెలలు ఎవరైనా తీసుకోకపోయినా తర్వాత వారికి పెంచిన మొత్తంతో కలిపి ఇస్తామని తెలిపారు. సోమవారం ఆయన రాష్ట్రంలోని తమ పార్టీ నేతలు, బూత్ స్ధాయి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజకీయ లబ్ధి కోసం వృద్ధులను అవస్థ పెట్టడానికి కూడా జగన్ వెనుకాడడం లేదని ధ్వజమెత్తారు. టీడీపీ కూటమి గద్దెనెక్కితే వలంటీర్లు ఉంటారని చెప్పారు. ‘గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా 30 వేల మంది ప్రభుత్వ సిబ్బంది ఉన్నారు. వారి ద్వారా ఒక్క రోజులోనే పింఛను ఇంటింటికి పంపిణీ చేసే అవకాశం ఉన్నా కావాలనే చేయడం లేదు. టీడీపీ అడ్డుకుంటోందని మోసపూరిత ప్రచారం మొదలుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్‌కు అర్థమైంది. అందుకే ఫేక్ ప్రచారాలు, కుట్ర రాజకీయాలకు తెరదీశాడు. ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకపోతే ఊరుకునేది లేదు. దీనిపై ఎంతవరకైనా వెళ్లి పోరా టం చేయడం ఖాయం. మీరు కూడా అధికారులను గట్టిగా నిలదీయండి’ అని పార్టీ నేతలకు పిలుపిచ్చారు.
ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమైన టీడీపీ మహిళా నేత!
వలంటీర్లను వైసీపీ తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటూ పార్టీ ప్రచారం చేయించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ‘వలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని అనేక ఫిర్యాదులు వచ్చాయి. అందుకే ప్రభుత్వ పథకాల పంపిణీకి వారిని దూరం పెట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. మనం వలంటీర్ల వ్యవస్ధకు, పింఛన్లను ఇంటి వద్ద పంచడానికి వ్యతిరేకం కాదు. వలంటీర్లను రాజకీయంగా వాడుకోవడానికే మనం వ్యతిరేకం’ అని స్పష్టం చేశారు. గత 15 రోజుల్లో జగన్ ప్రభుత్వం తమ వారికి రూ.13 వేల కోట్లు చెల్లింపులు చేసి ఖజానా ఖాళీ చేసిందని, చివరకు పేదల పింఛన్లకు కూడా డబ్బు మిగల్చలేదని దుయ్యబట్టారు. తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు పిలిచి డబ్బులిచ్చి.. అవ్వా తాతలను ఏడిపిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడానికి సొంత బాబాయినే గొడ్డలిపోటుతో లేపేసిన వైసీపీ పెద్ద మనుషులు ఎన్ని కుట్రలైనా చేయగలరన్నారు.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి