Share News

Avinash Reddy: అధికారులను బంధించి ఎన్నికలు నిర్వహిస్తారా: ఎంపీ అవినాశ్ రెడ్డి..

ABN , Publish Date - Dec 14 , 2024 | 05:19 PM

బీటెక్ రవి సినిమాల్లో మాదిరిగా ప్రవర్తిస్తూ మాట్లాడుతున్నారని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. పులివెందులలో ఆయన చేతగాని దద్దమ్మల రాజకీయం చేస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Avinash Reddy: అధికారులను బంధించి ఎన్నికలు నిర్వహిస్తారా: ఎంపీ అవినాశ్ రెడ్డి..
Kadapa MP Avinash reddy

కడప: జిల్లాలో అధికారులను బంధించి మరీ టీడీపీ నేతలు సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించారని కడప ఎంపీ అవినాశ్ సంచలన ఆరోపణలు చేశారు. తహసీల్దార్ కార్యాలయాల్లో నోడ్యూ సర్టిఫికెట్ ఇచ్చేందుకు వీఆర్వోలు అందుబాటులో లేరని, వారిని టీడీపీ నేతలే మండల కేంద్రాల్లో బంధించారని తీవ్ర విమర్శలు చేశారు. దీని మెుత్తానికి పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవినే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా అవినాశ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.


ఇలాగేనా ఎన్నికలు..

బీటెక్ రవి సినిమాల్లో మాదిరిగా ప్రవర్తిస్తూ మాట్లాడుతున్నారని అవినాశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. పులివెందులలో ఆయన చేతగాని దద్దమ్మల రాజకీయం చేస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ సారి తన ముఖం అద్దంలో చూసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులను, రెవెన్యూ అధికారులను అడ్డుపెట్టుకుని సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించారని అవినాశ్ రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ శ్రేణులు మీడియాపై దాడి చేశారని, తప్పుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు టీడీపీ చేసిందేమీ లేదని, కేవలం అబద్ధపు హామీలతోనే అధికారంలోకి వచ్చిందని ఎంపీ అవినాశ్ అన్నారు. సాగునీటి ఎన్నికల్లో ఓడిపోతామని వారికి ముందే తెలుసని అందుకే అధికారులను బంధించి మరీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఎంపీ అవినాశ్ రెడ్డి చెప్పుకొచ్చారు.


రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు..

సాగునీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లాలో పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో మెుత్తం టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఎన్నికలు జరిగాయి. పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్ ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. అట్లూరు మండలం కమసముద్రం గ్రామంలో తొడలు కొడుతూ మరీ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. దీంతో గొడవలు జరుగకుండా వైసీపీ వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. జమ్మలమడుగు మండలం పెద్దమూడెం, బద్వేల్‌లోని అట్లూరు, పులివెందులలోని వేముల ప్రాంతాల్లో ఇలాగే వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు.


గుండ్లకుంట జడ్పీ స్కూల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. ఘటన స్థలంలో వీడియోలు తీస్తున్న మీడియాపై ఓ వైసీపీ నేత దుర్భాషలాడారు. నోటికొచ్చినట్టు బండ బూతులతో మీడియాపై వైసీపీ నేత రెచ్చిపోయాడు. అయితే పోలీసుల రంగ ప్రవేశంతో చేయడంతో గొడవ సర్దుమణిగింది. శుక్రవారం రోజు ఎంపీ అవినాశ్ రెడ్డి పర్యటన సందర్భంగా వేమూరులో ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. ఈ మేరకు ఎంపీ అవినాశ్ రెడ్డిని పోలీసులు నేడు గృహ నిర్బంధం చేశారు. ఎన్నికలు అయ్యేంత వరకూ గృహ నిర్బంధంలోనే ఉంచారు. అనంతరం వదిలిపెట్టారు.

Updated Date - Dec 14 , 2024 | 05:38 PM