Share News

AP Politics: జగన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!

ABN , Publish Date - Aug 16 , 2024 | 08:44 AM

అధికారం ఉందనే అహంకారంతో ఏమి చేసినా సాగుతుందనుకున్న వైసీపీ అధినేత జగన్‌కు ప్రస్తుతం చుక్కలు కనిపిస్తున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

AP Politics: జగన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!
YS Jagan

అధికారం ఉందనే అహంకారంతో ఏమి చేసినా సాగుతుందనుకున్న వైసీపీ అధినేత జగన్‌కు ప్రస్తుతం చుక్కలు కనిపిస్తున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. పోలీసులను అడ్డంపెట్టుకుని వ్యవస్థలను తనకు ఇష్టం వచ్చినట్లుగా జగన్ వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను జగన్ రక్షిస్తున్నారనే ప్రచారం గతంలో జోరుగా సాగింది. సీబీఐ అధికారులు కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయాలనుకున్న సమయంలో.. ఆయన అరెస్ట్ కాకుండా జగన్ తన అధికార బలాన్ని ఉపయోగించి అడ్డుకున్నారనే ఆరోపణలు వినిపించాయి. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. వివేకానందరెడ్డిని హత్య చేసిన నిందితులు వైసీపీ అధినేత జగన్‌కు బంధువులు కావడంతోనే వారిని జగన్ కాపాడుతున్నారని ఆరోపించారు. వివేకానందరెడ్డితో తనకు ఎంతో అనుబంధం ఉందన్న కేవీపీ.. తన సన్నిహితుడు దారుణ హత్యకు గురికావడాన్ని జీర్ణించుకోలేపోయినట్లు తెలిపారు. వివేకా హత్య కేసులో నిందితుల్ని శిక్షించే అధికారం ఉంటే... రాతి యుగం నాటి శిక్షలతో చిత్ర హింసలు పెట్టేవాడినని కేవీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యలు చూస్తే వివేకా హత్య కేసులో నిందితులు ఎవరో జగన్‌కు స్పష్టంగా తెలుసని, నిందితులను కాపాడుతున్నది జగన్మోహన్ రెడ్డి అనే విషయం స్పష్టమవుతోంది.


ఐదేళ్ల పాలనలో..

మరోవైపు ఐదేళ్ల జగన్ పాలనలో జరిగిన అరాచకాలపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టిసారించినట్లు కనిపిస్తోంది. వివేకా హత్య కేసు సీబీఐ పరిధిలో ఉండటంతో.. కేసు విచారణ వేగవంతం అయ్యేందుకు రాష్ట్రప్రభుత్వం సహకరించే అవకాశం ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వం సీబీఐకి సహకరించకపోగా.. అధికారులను తీవ్ర ఒత్తిడికి గురిచేసే ప్రయత్నం చేశారనే ప్రచారం గతంలో జరిగింది. తాజాగా అగ్రిగోల్డ్ భూముల వ్యవహరంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌ అరెస్టయ్యారు. టీడీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలోని అక్రమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా అన్ని కేసులను తెరపైకి తీసుకువస్తే రాజకీయ కక్ష సాధింపుగా వైసీపీ ప్రచారం చేసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.


జగన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

వైసీపీ అధినేత జగన్ సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అవకతవకలు జరిగాయంటూ చంద్రబాబును అరెస్ట్ చేయించారు. అయితే సీఎంవో ఒత్తిడితో మాత్రమే పోలీసులు అక్రమ కేసులు బనాయించి.. చంద్రబాబును అరెస్ట్ చేశారని అప్పట్లో టీడీపీ ఆరోపించింది. ప్రస్తుతం దీనిపై కూడా టీడీపీ ప్రభుత్వం సమీక్ష చేస్తోంది. వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన నాయకులపై బనాయించిన కేసులు రాజకీయ కక్షసాధింపులో భాగంగా పెట్టారా.. లేదా నిబంధనల ప్రకారం పెట్టారా అనేదానిపై ప్రభుత్వం సమీక్షించనున్న నేపథ్యంలో.. ఒకవేళ సీఎంవో ఒత్తిడితో కేసులు పెట్టిఉంటే కుట్రలో పాత్రదారులపైనా చర్యలు ఉండే అవకాశం లేకపోలేదు. ఇలా జగన్ చుట్టూ ఉచ్చుబిగుస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Aug 16 , 2024 | 08:44 AM