Share News

బదిలీలకు పైరవీలు

ABN , Publish Date - Aug 30 , 2024 | 11:58 PM

2019 నుంచి గత ఏడాది 2023 వరకు జడ్పీ బదిలీలు వైసీపీ పెద్దల కనుసన్నల్లో జరిగాయి. ప్రస్తుత టీడీపీ కూటమి పాలనలో జరుగుతున్న జడ్పీ బదిలీలను కూడా తమకు అనుకూలంగా సాగించాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

బదిలీలకు పైరవీలు

కుప్పలు తెప్పలుగా సిఫారసు లెటర్లు

తలలు పట్టుకుంటున్న అధికారులు

బదిలీల్లో పట్టుబిగిస్తున్న వైసీపీ?

జడ్పీలో బదిలీలకు పెద్దఎత్తున పైరవీలు సాగుతున్నాయి. నిబంధనలకు నీళ్లొదిలి సిఫారసులకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వ పాలనలో కూడా జిల్లా పరిషత్‌శాఖ బదిలీలపై వైసీపీ పట్టు బిగిస్తోందని ప్రచారం సాగుతోంది. తమ అనుకూల ఉద్యోగులను అనుకున్నచోటికి బదిలీ చేయయించడానికి పావులు కదుపుతోందని అంటున్నారు. ఈ మేరకు జడ్పీ ఇన్‌చార్జ్‌ చైర్‌పర్సన జె.శారద, జడ్పీ చైర్మన్‌ అభ్యర్థి, బి.మఠం జడ్పీటీసీ రామగోవింద్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ బాలయ్య, ఆ పార్టీకి చెందిన పలువురు జడ్పీటీసీలు గురువారం జడ్పీ చైర్మన్‌ చాంబర్‌లో భేటీ అయ్యి బదిలీలపై చర్చించినట్లు సమాచారం.

కడప రూరల్‌, ఆగష్టు 30: 2019 నుంచి గత ఏడాది 2023 వరకు జడ్పీ బదిలీలు వైసీపీ పెద్దల కనుసన్నల్లో జరిగాయి. ప్రస్తుత టీడీపీ కూటమి పాలనలో జరుగుతున్న జడ్పీ బదిలీలను కూడా తమకు అనుకూలంగా సాగించాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఒకే చోట 5 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసిన వారికి తప్పనిసరిగా బదిలీ చేయాలని పేర్కొంది. ఈ మేరకు జిల్లా పరిషత్‌శాఖ పరిధిలో మొత్తం 1,114 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తుండగా వీరిలో 5 ఏళ్ల సర్వీస్‌ పూర్తిచేసిన వారు 438 ఉన్నారు. వీరితో పాటు రిక్వెస్ట్‌ బదిలీలకు కూడా దరఖాస్తు చేసుకోవాలని జడ్పీశాఖ సూచించింది. మొత్తం 437 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎంపీడీవోలు 17 మంది, ఏవోలు 34 మంది, సీనియర్‌ అసిస్టెంట్లు 40 మంది, జూనియర్‌ అసిస్టెంట్లు 108 మంది, టైపిస్టులు 31 మంది, రికార్డు అసిస్టెంట్లు 102 మంది, అటెండర్లు 105 మంది ఽబదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే 5 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసిన వారిలో కొందరు యథాస్థానంలో కొనసాగేందుకు పావులు కదుపుతున్నారు. కొందరైలే రకరకాల సాకులు చూపుతూ 10 ఏళ్లకు పైబడి ఒక చోట ఉన్నారు. ఇప్పుడు కూడా అక్కడే ఉండేందుకు పరిస్థితులను చక్కదిద్దుకుంటున్నారు. తమతో అంటకాగిన వారిని బదిలీల్లో దూరం వెళ్లనీయకుండా కాపాడాల్సిన బాధ్యతను వైసీపీ పెద్దలు జడ్పీ పాలకమండలిపై ఉంచినట్లు సమాచారం.

ఒకేచోటికి.. ముగ్గురికి సిఫారసు

బదిలీలకు దరఖాస్తు చేసుకున్న ఆయా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అనుకున్న చోటికి బదిలీ కావడానికి జోరుగా పైరవీలు సాగిస్తున్నారు. ఇప్పటికే కొందరు టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన నాయకుల చుట్టూ చక్కర్లు కొట్టి ఆయా ఎమ్మెల్యేల లెటర్లను సంపాదించుకొని జడ్పీకి అందజేశారు. ఒకే చోటికి ముగ్గురు దరఖాస్తు చేసుకుంటే ఆ ముగ్గురూ ఆ యా ఎమ్మెల్యేల నుంచి సిఫారసు లెటర్లు ఇవ్వడం విశేషం.

అడకత్తెరలో పోక చెక్కలా అధికారులు

రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది. ఉమ్మడి కడప జిల్లాలోని జడ్పీ పాలకమండలి వైసీపీ చేతిలో ఉంది. అలాగే పులివెందుల, బద్వేలు, రాజంపేట ఎమ్మెల్యేలతో పాటు కడప, రాజంపేట ఎంపీలు వైసీపీకి చెందిన వారు ఉన్నారు. కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు, రాయచోటి, జమ్మలమడగు, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు టీడీపీ కూటమికి చెందిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న జడ్పీ బదిలీల్లో ఇటు వైసీపీ, అటు టీడీపీ నాయకుల నుంచి తీవ్రమైన వత్తిళ్లు వస్తుండడంతో అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఇప్పటికే ఆయా నియోజక వర్గాల నుంచి సిఫారసు లెటర్లు కుప్పలు తెప్పలుగా రావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

మళ్లీ వారిదే హవా!

బదిలీల్లో చక్రం తిప్పిన సెర్ఫ్‌ సిబ్బంది

వైసీపీతో అంటకాగిన వారికి కోరిన చోట పోస్టింగ్‌

ఇబ్బడి ముబ్బడిగా ఎమ్మెల్యేల లేఖలు

కడప (ఎన్టీఆర్‌ సర్కిల్‌), ఆగస్టు 30: వైసీపీతో ఐదేళ్లుగా అంటకాగిన కొంతమంది సెర్ఫ్‌ సిబ్బంది ఇప్పుడు కూడా హవా కొనసాగిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో అయినా తాము కోరుకున్న చోటికి బదిలీ పొందవచ్చని ఆశించిన సెర్ఫ్‌ సిబ్బందికి నిరాశే మిగులుతోంది. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రయోజనాల కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన కొంతమంది సెర్ఫ్‌ సిబ్బంది.. ప్రభుత్వం మారిన వెంటనే ఇబ్బందులు పడతారని అందరూ అనుకున్నారు. అయితే బంధుత్వాలు, సామాజిక వర్గానికి ప్రస్తుత పాలకులు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి ప్రాంతానికి చెందిన ఒకాయన గత ప్రభుత్వంలో వైసీపీ కోసం ఎంతో శ్రమించారని ఆయనకు కూడా ప్రస్తుతం ప్రయోజనం చేకూరేలా బదిలీ జరుగుతోందని అంటున్నారు. ఎల్‌-2 క్యాడర్‌కు చెందిన ఒక ఉద్యోగి 15 సంవత్సరాల నుంచి డీఆర్డీఏ హెడ్‌ ఆఫీసులో పనిచేస్తున్నారు. ఎవరికి ఎలా కావాలంటే ఆ విధంగా ఆయన లబ్ధి చేకూర్చుతారనే పేరుంది. గత ప్రభుత్వంలో వైసీపీతో అంటకాగడంతో అప్పుడు కూడా ఈయన పెత్తనం సాగేదని ఈ ప్రభుత్వం వచ్చినా తనకు అడ్డు లేదనే విధంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. హెడ్‌ ఆఫీసులో పనిచేస్తున్న మరో ఉద్యోగి పరోక్షంగా వీఓఏల చేత వైసీపీకి ఎన్నికల్లో ప్రచారం చేయించారనే చర్చ కూడా ఉంది. ప్రస్తుత బదిలీల్లో ఆయనకు పెద్ద పీట వేసినట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో ఈయన ఏకంగా వైసీపీ కార్యాలయాన్ని వేదిక చేసుకుని మహిళా సంఘాల ప్రతినిధులతో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి సమావేశం నిర్వహించారు. అలాంటి వ్యక్తికి ఈ ప్రభుత్వంలో కూడా ప్రాధాన్యత కల్పించడంపై సెర్ఫ్‌ సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సెర్ఫ్‌ సిబ్బంది బదిలీలకు ఎమ్మెల్యేలు ఇబ్బడి ముబ్బడిగా లేఖలు ఇచ్చినట్లు తెలుస్తోంది. డీఆర్డీఏలోని అధికారి ఒకరు తన కోటరీని వదులుకునేందుకు ఏ మాత్రం ఇష్టపడ్డం లేదని.. ఆయన సలహాతో అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఒక్కో ఉద్యోగి రెండు, మూడు లేఖలు తెచ్చుకున్నట్లు సమాచారం. రాష్ట్రమంత్రి కూడా ఒకరికి సిఫారసు లేఖ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీ ఎమ్మెల్యేల నుంచి లెటరు తెచ్చుకున్న వారే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేల నుంచి కూడా లెటరు తెచ్చుకున్నారని అంటున్నారు. దీంతో రాజకీయ పలుకుబడి లేని తమకు అన్యాయం జరుగుతోందని పలువురు సెర్ఫ్‌ సిబ్బంది వాపోతున్నారు. పైరవీలను పక్కనబెట్టి పనితీరు, నిబంధనల మేరకు బదిలీలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వీరు కోరుతున్నారు.

సెర్ఫ్‌ సీఈవోకు ఫిర్యాదు ?

నిబంధనలు పక్కనబెట్టి బదిలీల్లో ఇష్టానుసారంగా వ్యవహరించ వద్దంటూ డీఆర్డీఏ పీడీపై జిల్లాలోని సీనియర్‌ టీడీపీ నేత ఒకరు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చర్చ సాగుతోంది. గత ఐదేళ్లు వైసీపీ నాయకులు చెప్పినట్లు పనిచేసి వారి ప్రయోజనాల కోసం పాకులాడిన వారిని కొనసాగించాలనే అధికారుల తీరును ఆయన తప్పు పట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు డీఆర్డీఏ అఽధికారిపై సెర్ఫ్‌ సీఈవోకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Updated Date - Aug 30 , 2024 | 11:58 PM