YS Sunitha: వైసీపీ సోషల్ మీడియా సైకోలపై వైఎస్ సునీత ఫిర్యాదు
ABN , Publish Date - Nov 13 , 2024 | 03:03 PM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసేందుకు ఆమె పులివెందుల చేరుకున్నారు.
కడప, నవంబర్13: గత ప్రభుత్వ హయాంలో తమను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై పోలీస్ కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో బుధవారం ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల్లో పోలీస్‌స్టేషన్‌కు ఆమె చేరుకున్నారు. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పీఏ వర్రా రవీందర్ రెడ్డితోపాటు పలువురిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.
వర్రా రవీందర్‌పై గతంలోనే ఫిర్యాదు..
సోషల్ మీడియాలో వర్రా రవీందర్ రెడ్డి.. తనపై పెట్టిన పోస్టులపై గతంలోనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సునీతరెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్ సునీత చేసిన ఈ ఫిర్యాదుపై గతంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. నాటి జగన్ ప్రభుత్వం సూచనల మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదనే ఓ వాదన సైతం నడిచింది.
వై ఎస్ అవినాష్ రెడ్డి పీఏనే..
మరోవైపు వర్రా రవీందర్ రెడ్డిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల విచారణలో అతడు కీలక విషయాలను బహిర్గతం చేశాడు. వైఎస్ సునీత, వైఎస్ షర్మిల, వైఎస్ విజయలక్ష్మిలపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ద్వారా తనకు అందిన కంటెంట్‌నే తాను పోస్టు చేసినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అతడు తెలిపారు. ఈ నేపథ్యంలో పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేయాలని వైఎస్ సునీత నిర్ణయించారు.
రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు..
ఇంకోవైపు వర్రా రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. వైసీపీ సోషల్ మీడియాలో సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, సుమారెడ్డి కీలకమైన వ్యక్తులు అని వర్రా రవీందర్ రెడ్డి తెలిపారు. వైసీపీ సోషల్ మీడియా హెడ్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తాము మరింత విజృంభించినట్లు తెలిపారు. ఆ క్రమంలో టీవీ చానళ్లలో చర్చ కార్యక్రమాల్లో పాల్గొని.. అధికార వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిని తాము లక్ష్యంగా చేసుకున్నామన్నారు.
టార్గెట్ వెనుక కారణమిదే..
అందులోభాగంగా ప్రతిపక్ష పార్టీల నేతలతోపాటు వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేశామని పోలీసుల ఎదుట వర్రా వివరించారు. అలాగే జనసేనా పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తోపాటు అతడి పిల్లలపై పోస్టులు చేసినట్లు అంగీకరించారు. అయితే వాటిని తొలగించాలంటూ ఓ వ్యక్తి తమను సంప్రదిస్తే.. రూ. 2 లక్షలు డిమాండ్ చేసినట్లు చెప్పారు. అలాగే జడ్జిలకు వ్యతిరేకంగా సైతం పోస్టులు పెట్టాలని సజ్జల భార్గవరెడ్డి తమపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడని వర్రా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.
కంటెంట్ ఇచ్చేవారు..
అలాగే వైఎస్ విజయమ్మతోపాటు వైఎస్ షర్మిల, వైఎస్ సునీతపై అభ్యంతరక పోస్టులు పెట్టాలని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి తమకు సూచించాడన్నారు. అందుకు సంబంధించిన కంటెంట్ సైతం తనకు అతడే ఇచ్చేవాడని చెప్పారు. అయితే వారిపై పెట్టే ఈ పోస్టులు ఏ విధంగా ఉండాలన్నది మాత్రం అవినాశ్ రెడ్డి, రాఘవరెడ్డి చర్చించుకునేవారని వర్రా వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో..
గత ప్రభుత్వ హయాంలో వైసీపీ సోషల్ మీడియా వేదికగా సైకోలు రెచ్చిపోయారు. దీంతో వారిపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు సైతం నమోదు అయ్యాయి. కానీ ఎవరిని పోలీసులు అరెస్ట్ అయితే చేయలేదు. అయితే చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం వైసీపీ సోషల్ మీడియాలో అభ్యంతర పోస్టులు కొనసాగుతూనే ఉన్నాయి.
లూక్ అవుట్ నోటీసులు జారీ..
ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా వైసీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేసింది. వారిలో వర్రా రవీందర్ రెడ్డితోపాటు ఇంటూరి రవికిరణ్ ఉన్నారు. ఇక సజ్జల భార్గవ రెడ్డితోపాటు పలువురి కోసం ఇప్పటికే ఏపీ పోలీసులు లూక్ అవుట్ పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
For AndhraPradesh News And Telugu News