Share News

KV Rao : కుట్ర పన్ని కాకినాడ పోర్టును కాజేశారు!

ABN , Publish Date - Dec 06 , 2024 | 03:10 AM

అధికారం అండతో అరాచకం.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని విచ్చల విడితనం.. కన్నేసిన ప్రతిదాన్నీ కబ్జా చేసే నియంతృత్వం.. అందుకోసం ఎంతకైనా తెగించే తత్వం.. కాకినాడ సీ పోర్టును హస్తగతం చేసుకోవడానికి అప్పటి సీఎం జగన్‌ అచ్చం ఇలాగే జగన్నాటకం ఆడారు.

KV Rao : కుట్ర పన్ని కాకినాడ పోర్టును కాజేశారు!

  • జగన్‌ అండ్‌ కో అధికారిక దందా

  • కేవీరావు నుంచి వాటా లాక్కోవడానికి వ్యవస్థలతో బెదిరింపులు

  • 40 రోజులు పోర్టులోనే విజిలెన్స్‌ మకాం

  • పోర్టు పత్రాల కోసం ఒత్తిళ్లు

  • లిఖితపూర్వకంగా రాసివ్వాలన్న రావు

  • దొరికిపోతామని భావించి మారిటైమ్‌ బోర్డును దించిన జగన్‌

  • సీఈవోగా విక్రాంత్‌ రెడ్డి సన్నిహితుడు

  • చెన్నై ఆడిటింగ్‌ కంపెనీతో నివేదిక

  • 994 కోట్లు ఎగ్గొట్టినట్టు కట్టుకథ

  • దీని ఆధారంగా విక్రాంత్‌ బెదిరింపులు

  • అమెరికా నుంచి రప్పించి సంతకాలు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

అధికారం అండతో అరాచకం.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని విచ్చల విడితనం.. కన్నేసిన ప్రతిదాన్నీ కబ్జా చేసే నియంతృత్వం.. అందుకోసం ఎంతకైనా తెగించే తత్వం.. కాకినాడ సీ పోర్టును హస్తగతం చేసుకోవడానికి అప్పటి సీఎం జగన్‌ అచ్చం ఇలాగే జగన్నాటకం ఆడారు. కేవీరావు నుంచి బలవంతంగా పోర్టు వాటాలను లాక్కోవడానికి రాష్ట్ర విజిలెన్స్‌ విభాగాన్ని అడ్డగోలుగా వాడుకున్నారు. మారిటైమ్‌ బోర్డునూ రంగంలోకి దింపారు. ఆ తర్వాత చెన్నైకు చెందిన పీకేఎఫ్‌ శ్రీధర్‌ అండ్‌ సంతానం ఆడిట్‌ కంపెనీని తెరపైకి తెచ్చారు. కేవీరావు నిర్వహణలో ఉన్న సీపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.994 కోట్లు ఎగ్గొట్టినట్లు తప్పుడు నివేదికలు సృష్టించారు. దాన్ని అడ్డంపెట్టుకుని కాకినాడ సీపోర్టు(డీ్‌పవాటర్‌పోర్టు)లో కేవీరావు నుంచి 41.12 శాతంవాటాను విక్రాంత్‌రెడ్డి, విజయసాయిరెడ్డి అరబిందో పేరు మీద రాయించుకున్నారు. 2020లో కేవీ రావు ప్రాణభయంతో అమెరికాకు వెళ్లిపోయి మూడేళ్లు అక్కడే తలదాచుకున్నారు. ప్రభుత్వ పెద్దలే బెదిరించడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. కనీసం ఫిర్యాదు చేసేందుకు కూడా సాహసించలేని దుస్థితి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాకినాడ పోర్టులోని అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కాకినాడ సీపోర్టు(డీ్‌పవాటర్‌పోర్టు)లో కేవీరావు నుంచి వాటాను బలవంతంగా రాయించుకున్న ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.


  • మొదట విజిలెన్స్‌ రంగంలోకి...

మొదట 2020 జనవరిలో రాష్ట్ర విజిలెన్స్‌ విభాగాన్ని రంగంలోకి దించారు. అమరావతి, విశాఖపట్నం నుంచి ఎంపిక చేసిన పోలీసు అధికారులతో కూడిన విజిలెన్స్‌ బృందాన్ని కాకినాడ సీపోర్టుకు పంపించారు. వీరంతా 40 రోజులు సీపోర్టులో మకాం వేశారు. మొత్తం పోర్టుకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు, కార్గో వ్యవహారాలు, రాష్ట్రప్రభుత్వానికి చెల్లించిన, చెల్లించాల్సిన పన్నుల సమాచారం ఇవ్వాలని పోర్టు కార్యాలయ సీఈవోపై ఒత్తిడి తెచ్చారు. దీనికి కేవీరావు అభ్యంతరం చెప్పారు. విజిలెన్స్‌ అధికారులకు సీపోర్టు డాక్యుమెంట్లతో పని ఏంటని అడిగారు. అసలు విజిలెన్స్‌ అధికారులకు సంబంధం ఏంటని నిలదీశారు. రాతపూర్వకంగా లేఖ ఇస్తే చూస్తామని కరాఖండీగా చెప్పేశారు. దీంతో విజిలెన్స్‌ అధికారులు నేరుగా పోర్టు డాక్యుమెంట్ల లేఖ ఇచ్చి సేకరిస్తే భవిష్యత్తులో దొరికిపోతామని భయపడ్డారు. చిక్కులు వస్తాయని నాటి సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్లారు.

  • మారిటైమ్‌ బోర్డు ద్వారా...

విజిలెన్స్‌ అధికారుల ద్వారా కేవీ రావును బెదిరించాలన్న ప్లాన్‌ వర్కవుట్‌ కాకపోవడంతో మరో కుట్రకు తెరలేపారు. వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్‌రెడ్డి రంగంలోకి దిగారు. అప్పటికప్పుడు పోర్టులపై పర్యవేక్షణ కలిగిన రాష్ట్ర ప్రభుత్వ విభాగమైన ఏపీ మారిటైమ్‌ బోర్డును పురమాయించారు. తమకు కావాల్సిన డాక్యుమెంట్లను దీని ద్వారా అధికారికంగా సేకరించాలని నిర్ణయించారు. అయితే మారిటైమ్‌ బోర్డు సీఈవో తమకు అనుకూల వ్యక్తి అయితేనే అనుకున్న పని జరుగుతుందని భావించారు. అప్పటికప్పుడు 2020లో ప్రభుత్వ అధికారిని కాకుండా చెన్నైకు చెందిన కె.మురళీధరన్‌ అనే ప్రైవేటు వ్యక్తిని తీసుకువచ్చి సీఈవో సీట్లో కూర్చోబెట్టేశారు. ఆయన విక్రాంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. మురళీధరన్‌ బాధ్యతలు తీసుకోగానే తాము అడిగిన డాక్యుమెంట్‌లు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం తరఫున కేఎ్‌సపీఎల్‌ను ఆదేశించారు.


పోర్టులోనే 40 రోజులుగా మకాం వేసిన విజిలెన్స్‌ అధికారులకు వాటిని పంపించారు. ఇలా 7 వేల డాక్యుమెంట్లను కేవీరావు నిర్వహణలో ఉన్న పోర్టు నుంచి విజిలెన్స్‌ సేకరించింది. లోపాలను గుర్తించి, దొంగ నివేదికలను సృష్టించారు. వీటన్నింటిని మూటలు కట్టించి చెన్నై నుంచి పిలిపించిన సంతానం ఆడిటింగ్‌ కంపెనీ చేతిలో విక్రాంత్‌రెడ్డి ఉంచారు. పోర్టులో ఆడిటింగ్‌ కంపెనీ మకాం వేసి వీటన్నింటినీ పరిశీలించింది. కేవీ రావు రూ.994 కోట్లు ప్రభుత్వానికి ఎగ్గొట్టారనే నివేదికను తయారు చేసి జగన్‌కు అందించింది.

  • విక్రాంత్‌ రెడ్డి నేరుగా

ఆడిటింగ్‌ కంపెనీ నివేదిక జగన్‌కు అందగానే ఆయన ఆదేశాలతో విక్రాంత్‌ రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. రూ.994 కోట్లు ఎగ్గొట్టారన్న విషయాన్ని ప్రస్తావిస్తూ కేవీరావును బెదిరించడం మొదలుపెట్టారు. పోర్టులో 41.12 శాతం వాటా వదిలేసుకుంటావా.. లేదా అరెస్టయి జీవితకాలం జైలుశిక్షకు అనుభవిస్తావా? అని భయపెట్టారు. పిలిపించి సంతకాలు చేయాలని బెదిరించారు. గన్‌తో బెదిరించారు. దీంతో చేసేదిలేక వ్యాపారం పనిపై అమెరికా వెళ్లి మళ్లీ వస్తానని చెప్పి కేవీరావు దేశం విడిచి వెళ్లిపోయారు. అయినా విక్రాంత్‌ రెడ్డి వదల్లేదు. దేశానికి వస్తావా? లేదంటే సంతకాలకు తానే అమెరికాకు రావాలా అంటూ బెదిరించారు. పైగా కేవీరావు ఇద్దరు కుమార్తెలు ఇక్కడే ఉండడం, వారికి వివాహాలు చేయాల్సి ఉండడంతో ఆయన భయపడ్డారు. అమెరికా నుంచి వచ్చి వచ్చి సంతకాలు చేసేశారు. సీపోర్టులో వాటాతోపాటు సెజ్‌లో వాటాలు కూడా రాసిచ్చేస్తున్నట్లు ఆయనతో సంతకాలు చేయించుకున్నారు. అడ్వాన్స్‌ కింద ఇస్తామన్న రూ.100 కోట్లు ఇచ్చినట్లు చూపించి ఆ డబ్బు వేరొకరికి సర్దుబాటు చేయాలని బెదిరించారు. ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయిన కేవీరావు 2020 నుంచి ఇటీవల వరకు అక్కడే ఉండిపోయారు.


  • సీఈవో పోస్టుపై కన్ను..

కేవీ రావు నుంచి 41.12 శాతం వాటాను బెదిరించి రాయించుకోగా, కేఎ్‌సపీఎల్‌లో ఆయనకు ఇంకా దాదాపు 47 శాతం వాటా ఉంది. మెజారిటీ వాటా ఆయనదే. అయితే అరబిందో పేరుతో వాటాను బదలాయించేసుకున్న విక్రాంత్‌రెడ్డి ఆ వెంటనే కేఎ్‌సపీఎల్‌ సీఈవో పోస్టుపై కన్నేశారు. అతిపెద్ద వాటాదారుడైన కేవీ రావు నియమించిన సీఈవోను తప్పించి, ఆ స్థానంలో అరబిందో తరఫున మరో వ్యక్తిని నియమించాలని చూశారు. మారిటైమ్‌ బోర్డు సీఈవోగా తాము నియమించిన కె.మురళీధరన్‌ను కేఎ్‌సపీఎల్‌ సీఈవోగా చేయాలని ప్రయత్నించారు. కేవీరావు ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటాలు బలవంతంగా రాయించుకున్నారని, తనకు మిగిలి ఉన్న మెజారిటీ వాటాకు సంబంధించి సీఈవోగా తమ వ్యక్తే ఉండాలని పట్టుబట్టారు. అయితే విక్రాంత్‌ రెడ్డి ఖాతరు చేయకుండా సీఈవో పోస్టు కోసం ప్రయత్నాలు కొనసాగించారు. అయితే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ ప్రతిపాదన ఆగిపోయింది. అరబిందో పేరుపై వాటా బదిలీ అయినప్పటి నుంచి పోర్టు పాలనలో జగన్‌ మనుషుల జోక్యం పెరిగిపోయింది. బిల్లుల చెల్లింపు, కార్గో రవాణా, ఇతర నిర్ణయాల్లో కేవీరావును అదే పనిగా సతాయించడం మొదలుపెట్టారు.

  • కుక్కను చంపాలంటే పిచ్చిదని ముద్ర వేయాలన్నది నానుడి. నాడు కాకినాడ పోర్టు వాటాలు లాక్కోవడానికి జగన్‌ అండ్‌ కో ఇంతకంటే దారుణమైన కుట్ర చేశారు. కేవీ రావు నుంచి 41.12 శాతం వాటా రాయించుకునే వరకు ఎన్నో రకాలుగా వేధించి, భయపెట్టారు.

  • మొదట విజిలెన్స్‌ అధికారులను రంగంలోకి దింపారు. పోర్టులో 40 రోజులు మకాం వేసి కేవీరావుపై ఒత్తిడి చేశారు. ఆయన మాట వినకపోవడంతో మారిటైమ్‌ బోర్డును ఉసికొల్పారు. బోర్డు సీఈవోగా జగన్‌ బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌ రెడ్డి సన్నిహితుడిని నియమించారు. సంచుల కొద్దీ డాక్యుమెంట్లు తెప్పించి ప్రభుత్వానికి 994 కోట్లు ఎగ్గొట్టినట్టు ఆడిటింగ్‌ సంస్థతో నివేదిక తయారు చేయించారు. ఆ తర్వాతి కథ విక్రాంత్‌ రెడ్డి నడిపించారు.


  • ఆడిటింగ్‌ సంస్థ నివేదికను బూచిగా చూపి వాటాలు ఇస్తావా? లేక జైలుకు పంపాలా? అని కేవీరావును విక్రాంత్‌ రెడ్డి గన్‌తో బెదిరించారు. ఆయన అమెరికాకు వెళ్లినా మళ్లీ వెనక్కి రప్పించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. పోర్టులో రూ.2,500 కోట్ల విలువైన వాటాకు రూ.494 కోట్లు, సెజ్‌లో రూ.1,104 కోట్ల విలువైన షేర్లకు రూ.12 కోట్ల బేరం కట్టారు. అరబిందో పేరు మీద రాయించుకున్నారు. నాడు జరిగిన బాగోతంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

  • విక్రాంత్‌ సన్నిహితుడికి ప్రతిఫలం

కేఎస్‌పీఎల్‌లో వాటా కొట్టేయడం కోసం మారిటైమ్‌ బోర్డు సీఈవోగా నియమించిన మురళీధరన్‌ నాడు జగన్‌కు అన్ని విధాలా సహకరించారు. అడ్డదారిలో పోర్టు వాటా రాయించుకోవడానికి కావాల్సిన సూచనలు, సలహాలు ఇచ్చారు. మురళీధరన్‌ అంతకుముందు కరైకల్‌ పోర్టులో పనిచేసిన అనుభవంతో జగన్‌కు సహకరించారు. కేవీరావు నుంచి వాటాలు రాయించేసుకున్న తర్వాత మురళీధరన్‌కు అందుకు ప్రతిఫలంగా కీలక పదవి కట్టబెట్టారు. అరబిందో కంపెనీ కాకినాడ సెజ్‌లో కొత్తగా నిర్మిస్తున్న కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్‌ (కేజీపీఎల్‌)కు ఆయన్ను ఏకంగా డైరెక్టర్‌గా నియమించారు. ప్రస్తుతం ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. జగన్‌, అరబిందో, మురళీధరన్‌ బంధాన్ని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Updated Date - Dec 06 , 2024 | 03:14 AM