Chandrababu: ప్రధాని మోదీ సహా ఏడుగురు కేంద్రమంత్రులను కలిసిన చంద్రబాబు
ABN , Publish Date - Oct 09 , 2024 | 09:28 AM
‘విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయకుండా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను.. కేంద్రం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంది. ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్రం నుంచి సమగ్ర ప్యాకేజీ అవసరం. పరిపాలన వైఫల్యం, కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో పడింది. ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయడం ఒక పరిష్కార విధానం. అయితే అందుకు సెయిల్, కేంద్రం ఒప్పుకోవాల్సి ఉంటుంది’. అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) రెండు రోజుల ఢిల్లీ పర్యటన (Delhi Tour) ముగిసింది. దీంతో ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి ఆయన విజయవాడ (Vijayawada)కు బయలుదేరారు. ఈ రెండు రోజుల్లో ప్రధాని మోదీ (PM Modi) సహా ఏడుగురు కేంద్రమంత్రులను (Central Ministers) చంద్రబాబు కలిసారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నితిన్ గడ్కరీ, హార్దీప్ సింగ్ పూరి, కుమార స్వామి, పీయూష్ గోయల్, అమిత్ షా, నిర్మలా సీతారామన్‌లను విడివిడిగా కలిసి చర్చలు జరిపారు.
కాగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయకుండా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. కేంద్రం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంది. ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్రం నుంచి సమగ్ర ప్యాకేజీ అవసరం. పరిపాలన వైఫల్యం, కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో పడింది. ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయడం ఒక పరిష్కార విధానం. అయితే అందుకు సెయిల్, కేంద్రం ఒప్పుకోవాల్సి ఉంటుంది. సాధుకొండ, ఎర్రకొండ, గడ్చిరోలిలో ఐరన్ ఓర్ ఉంది. సెయిల్ మాదిరి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఐరన్ ఓర్‌ను కేటాయిస్తే ప్రధాన సమస్య పరిష్కారమవుతుంది.
జగన్ వెళుతూ.. వారసత్వంగా 85 లక్షల టన్నుల చెత్తను మిగిల్చిపోయారు. కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు కూడా విడుదల చేయలేదు. ఏ మంత్రిత్వ శాఖకు వెళ్లి నిధులు అడిగినా యుటిలిటీ సర్టిఫికెట్లు(యూసీ) అడుగుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్ల పాలనలో జరిగిన ఆర్థిక అరాచకాల వల్ల అతలాకుతలమైన ఏపీ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు కేంద్రం అన్ని విధాలా సహకరించాలని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏపీ ఆర్థికంగా పూర్తిగా కోలుకునేందుకు అవసరమైన మద్దతు అందిస్తానని ప్రధాని హామీ ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పారు.
రాష్ట్రాభివృద్ధికి అవసరమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను మంజూరు చేయాలని, అమరావతి రాజధానిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, పీఎంయూవై కింద కేటాయింపులను పెంచాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ మరో రెండేళ్లలో పూర్తవుతుందని, ఇందుకోసం కేంద్రం రూ.12,500 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. త్వరలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ (ఏషియన్ డెవల్‌పమెంట్ బ్యాంకు) నుంచి రూ.15 వేల కోట్లు త్వరలో మంజూరు కానున్నాయని తెలిపారు. రాజధాని పనులు డిసెంబరు నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించకుండా అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖ ఉక్కును తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా అభివర్ణించారు. మరో రెండేళ్లలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. హైదరాబాద్-విజయవాడ ఎక్స్‌ప్రె్‌సవేను నాలుగు నుంచి ఎనిమిది లేన్లకు పెంచాలని, హైదరాబాద్ నుంచి అమరావతికి మరో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రతిపాదించినట్లు తెలిపారు. మచిలీపట్నం రేవును తెలంగాణకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. భోగాపురంలోనే సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ మరో రెండేళ్లలో ఏర్పడుతుందని తెలిపారు. బీపీసీఎల్ రిఫైనరీని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కమిటీ నిర్ణయిస్తుందని, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నంతో సహా నాలుగు ప్రాంతాలు పరిశీలనలో ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. తన రెండ్రోజుల ఢిల్లీ పర్యటనపై మంగళవారం సాయంత్రం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
వారసత్వంగా చెత్త మిగిల్చారు
‘‘జగన్ ఆర్థిక అకృత్యాల వల్ల అడుగడుగునా ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానికి వివరించాను. స్వచ్ఛభారత్ పథకాన్ని కూడా జగన్ నీరుగార్చారు. వారసత్వంగా ఆయన 85 లక్షల టన్నుల చెత్తను మిగిల్చిపోయారు. జగన్ హయాంలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్ది 2047 వరకు ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా రూపుదిద్దే దిశలో లక్ష్యాన్ని ప్రధానికి వివరించాను. జగన్ సర్కారు కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేయ్యలేదు. ఏ మంత్రిత్వ శాఖకు వెళ్లి నిధులు అడిగినా యూటిలిటీ సర్టిఫికెట్లు(యూసీ)లు అడుగుతున్నారు. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులతో సహా కేంద్రం తలపెట్టిన ఏ ప్రాజెక్టుకూ జగన్ ప్రభుత్వం భూమి కేటాయించలేదు. మ్యాచింగ్ గ్రాంట్లను కూడా విడుదల చేయలేదు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ. 10.50 లక్షల కోట్లు అప్పు చేసింది. ఎఫ్‌ఆర్‌బీఎం కింద కూడా అప్పులు చేసే పరిస్థితి లేదు’’ అని చంద్రబాబు అన్నారు.
పంచాయతీరాజ్‌ను నాశనం చేశారు
‘‘రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను నాడు నాశనం చేశారు. ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను కూడా ఇవ్వలేదు. ఉపాధి హామీ డబ్బులను నాటి వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేయలేదు. విశాఖపట్నం రైల్వే జోన్‌కు కూడా గత ప్రభుత్వం భూమి కేటాయించలేదు. మేం అధికారంలోకి రాగానే కేంద్రాన్ని సంప్రదించి అనువైన భూమిని కేటాయించాం. డిసెంబరులో ప్రధాని చేతుల మీదుగా రైల్వేజోన్ ప్రారంభమవుతుంది’’ అని సిఎం చంద్రబాబు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పెంపు పొడిగింపు
బాసర సరస్వతీ దేవి ఆలయంలో మూల నక్షత్ర పర్వదిన వేడుకలు
సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ
సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News